ఛత్తీస్ గడ్ ఎన్కౌంటర్: ఘన విజయం, చావుదెబ్బ కొట్టామన్న మోదీ, అమిత్ షా!
ఛత్తీస్ గడ్ రాష్ట్రం నారాయణ్ పూర్ జిల్లాలోని అభూజ్మడ్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 27 మంది నక్సలైట్లు చనిపోయారు. ఈ ఎన్కౌంటర్ లో నక్సల్స్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు చనిపోయారు. అలిపిరి వద్ద చంద్రబాబుపై బాంబు దాడి సూత్రధారి అయిన నంబాల కేశవరావు తలపై కోటి రూపాయల నజరానా వుంది. ఈ ఎదురు కాల్పుల్లో ఒక భద్రతా సిబ్బంది కూడా మరణించారు.
మావోయిస్టులకు గట్టి దెబ్బ
నక్సల్స్ కదలికల గురించి సమాచారం అందుకున్న నారాయణపూర్, దంతేవాడ, బీజాపూర్, కొండగావ్ జిల్లాల రిజర్వ్ గాడ్ పోలీసు సంయుక్త బృందం రెండు రోజుల క్రితం ఆ ప్రాంతంలో గాలింపు చర్య చేపట్టిన సందర్భంగా ఈ ఎదురు కాల్పులు జరిగాయి. ఈ భారీ ఎన్కౌంటర్ మావోయిస్ట్ పార్టీకి పెద్ద దెబ్బని చెప్పాలి.

ఘన విజయం సాధించాం: ప్రధాని మోదీ
ఎన్కౌంటర్ పై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. మావోయిస్టులపై ఘన విజయం సాధించామని ఆయన పేర్కొన్నారు. దేశంలో అంతర్గత శాంతి కోసం మావోయిస్టులను నిర్మూలిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు.
మార్చి 31 కల్లా నక్సలిజాన్ని నిర్మూలించడానికి కృత నిశ్చయం: అమిత్ షా
ఈ ఎన్కౌంటర్ పై హోం శాఖా మంత్రి అమిత్ షా స్పందించారు. వచ్చే సంవత్సరం మార్చి 31 కల్లా నక్సలిజాన్ని నిర్మూలించడానికి మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో వుందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు . నారాయణ్ పూర్ లో జరిగిన ఎదురు కాల్పుల్లో 27 మంది మావోయిస్టులు చనిపోయారని, వీరిలో నిషేధిత సిపిఐ మావోయిస్టు అగ్రనేత, ఇతర నేతలు ఉన్నారని ఎక్స్ వేదికగా అమిత్ షా పేర్కొన్నారు.
మావోయిస్ట్ అగ్రనేత హతం కావటం ఇదే తొలిసారి
మన దేశంలో గత మూడు దశాబ్దాల కాలంలో సిపిఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి స్థాయి నాయకుడు హతం కావడం ఇదే మొదటిసారని ఆయన అన్నారు. నంబాల కేశవరావు మృతిని ఆయన ధ్రువీకరించారు. మావోయిస్ట్ లను చావు దెబ్బ కొట్టామని హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఈ గాలింపు చర్య చేపట్టిన భద్రతా బలగాలను ఆయన అభినందించారు. బ్లాక్ ఫారెస్ట్ పోలీసు చర్య ముగిశాక ఛత్తీస్ గడ్, తెలంగాణ, మహారాష్ట్రలో 54 మంది నక్సల్స్ అరెస్టు అయ్యారని, మరో 84 మంది లొంగిపోయారని హోంమంత్రి వివరించారు.












Click it and Unblock the Notifications