వాళ్లు జైళ్లలో ఉన్నారు!: ప్రధాని నరేంద్ర మోడీపై యశ్వంత్ సిన్హా తీవ్రవ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై బీజేపీ మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా శుక్రవార తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టే మోడీ ఆకర్షణీయంగా కనిపిస్తున్నారని చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానిపై విమర్శల వర్షం కురిపించారు.
ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ నాయకత్వం, ఆయన నాలుగేళ్ల పాలనపై ప్రశ్నించగా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మనకు ఓ అలవాటు ఉంటుందని, సాధారణంగా అధికారంలో ఉన్నవారినే ఎక్కువగా ఆరాధిస్తుంటామని, అది మన జాతీయ బలహీనత అన్నారు. ఇప్పుడు మోడీ మన ప్రధాని అని అందుకే ఆయన ప్రజాకర్షణ పొందిన నేతగా కనిపిస్తున్నారన్నారు.

అదే ఆయనకు అధికారం లేకపోతే ఆకర్షణీయంగా కనిపించరని చెప్పారు. ప్రజలు చూసే తీరు ఇలాగే ఉంటుందన్నారు. ఈ అలవాటు నుంచి మనం బయటపడాలన్నారు. గతంలో ప్రజాకర్షణ పొందిన వ్యక్తులు కొందరు ఇప్పుడు జైళ్లలో ఉన్నారని ఎవరూ పేరు పలకకుండా చెప్పారు.
గత ఎన్డీయే ప్రభుత్వంలో యశ్వంత్ సిన్హా ఆర్థిక, విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇటీవల సొంత పార్టీపై సిన్హా విమర్శలు చేశారు. నోట్లరద్దు, రాఫెల్ ఒప్పందం వంటి అంశాలపై ప్రధాని మోడీ, బీజేపీని విమర్శించారు. ఆ తర్వాత పార్టీ నుంచి తప్పుకున్నారు. ఆయన కుమారుడు జయంత్ సిన్హా కేంద్రంలో సహాయమంత్రిగా ఉన్నారు.












Click it and Unblock the Notifications