మోదీ.. మొదలెట్టారు
PM Modi first foreign tour: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ ప్రయాణాల పరంపర మొదలైంది. మూడో విడత ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత ఆయన ఇటలీకి బయలుదేరి వెళ్లారు. జీ7 దేశాల సదస్సులో పాల్గొనడానికి ఇటలీ వెళ్లారు. కొద్దిసేపటి కిందటే ల్యాండ్ అయ్యారు. ఇటలీలో గల భారత రాయబారులు, ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు.. విమానాశ్రయంలో మోదీకి స్వాగతం పలికారు.
జీ7లో భారత్‌కు సభ్యత్వం లేదు. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్.. మాత్రమే ఇందులో కొనసాగుతున్నాయి. ప్రత్యేక ఆహ్వానితుడిగా భారత్ తరఫున మోదీ ఇందులో పాల్గొనబోతోన్నారు. ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో ఉక్రెయిన్ అధ్యక్షులు వొలొదిమిర్ జెలెన్‌స్కీ సహా పరిమితంగా ఎంపిక చేసిన దేశాల అధ్యక్షులు ఉన్నారు.

ఈ దఫా ఇటలీ.. జీ7 సదస్సుకు ఆతిథ్యాన్ని ఇస్తోంది. తీరప్రాంత నగరం అపూలియాలో రెండు రోజులపాటు ఈ భేటీ కొనసాగనుంది. ఇందులో పాల్గొనడానికి అమెరికా అధ్యక్షుడు జో బైెడెన్, బ్రిటన్, కెనడా ప్రధానమంత్రులు రిషి సునాక్, జస్టిన్ ట్రూడో, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ ష్కాల్జ్.. ఇదివరకే ఇటలీకి చేరుకున్నారు.
ఈ సదస్సులో పలు అంశాలు చర్చకు రానున్నాయి. ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యాను మరింత కట్టడి చేయడం, ఆ దేశం ఆక్రమించిన అనేక ప్రాంతాల విముక్తి కల్పించడం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం కల్పించడంపైనా చర్చిస్తారు. జీ7 దేశాల మధ్య వాణిజ్య పరమైన పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు.
మోదీ చేపట్టిన ఈ పర్యటనపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. స్పెషల్ ఇన్వైటీగా వెళ్లడాన్ని తప్పుపట్టింది. తగ్గిన తన అంతర్జాతీయ ప్రతిష్ఠను కాపాడుకోవడానికే ఆయన ఈ పర్యటన చేపట్టారని ఎద్దేవా చేసింది. జీ7 సదస్సు 1970వ దశకం చివరి నుంచి జరుగుతోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ గుర్తు చేశారు. మూడో విడతలోనైనా మోదీ గత చరిత్రను తెలుసుకుంటారని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications