ప్రధాని మోదీ తాజా నిర్ణయాలు- నాలుగున్నర గంటల సుదీర్ఘ మంత్రివర్గ భేటీలో..
అయిదు దేశాల పర్యటనను ముగించిన ఢిల్లీ చేరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. గురువారం రాత్రి నాలుగున్నర గంటల పాటు కొనసాగిందీ భేటీ. ఈ మధ్యకాలంలో ఇంత సుదీర్ఘంగా భేటీ కావడం ఇదే తొలిసారి. ఇందులో పలు అంశాలు చర్చకు వచ్చాయి. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులు, పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం నేపథ్యంలో చోటు చేసుకుంటోన్న పరిణామాలపై మంత్రివర్గం చర్చించింది.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన కేంద్ర మంత్రివర్గ సమావేశం నాలుగున్నర గంటల పాటు కొనసాగింది. సేవా తీర్థ్‌లో జరిగిన ఈ ఏడాది తొలి పూర్తి స్థాయి మంత్రివర్గ సమావేశం ఇది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ సుదీర్ఘ భేటీ ఏర్పాటు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

దక్షిణ కొరియా, జెనీవా పర్యటనల్లో ఉండటం వల్ల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈ సమావేశానికి హాజరుకాలేదు. కాగా ఈ భేటీలో పలు మంత్రిత్వ శాఖలతో పాటు కేబినెట్ కార్యదర్శి, నీతి ఆయోగ్.. తమ పవర్ ప్రజెంటేషన్లు సమర్పించాయి. తొమ్మిది మంత్రిత్వ శాఖలు తమ పనితీరు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై వివరణాత్మక బ్రీఫింగ్ అందించాయి. పెట్రోలియం మంత్రిత్వ శాఖ పనితీరుపై ప్రధానంగా చర్చ జరిగినట్లు చెబుతున్నారు.
విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్.. ప్రధాని ఇటీవల చేపట్టిన అయిదు దేశాల పర్యటన, దాని కీలక దౌత్య ఫలితాలపై మంత్రులకు వివరించారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ, పశ్చిమ ఆసియా సంక్షోభం, దాని ఆర్థిక ప్రభావాలను ప్రస్తావించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రిత్వ శాఖలను ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఇంధనం, వ్యవసాయం, ఎరువులు, విమానయానం, షిప్పింగ్, లాజిస్టిక్స్ వంటి రంగాలకు ఈ సమావేశంలో ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు. పాలనా సంస్కరణలు, వికసిత భారత్ 2047, పశ్చిమ ఆసియాలో నెలకొన్న సంక్షోభం వంటి కీలక అంశాలపై చర్చించారు. 2047 నాటికి వికసిత భారత్ నిర్మాణ లక్ష్యాన్ని నినాదంగా కాకుండా నిబద్ధతగా భావించి పనిచేయాలని ప్రధాని మోదీ కేంద్ర మంత్రులను కోరారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో పార్టీ సాధించిన ఘన విజయంపై ప్రధాని మోదీని మంత్రివర్గ సహచరులు ఈ సమావేశంలో అభినందించినట్లు వర్గాలు పేర్కొన్నాయి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీలను సందర్శించిన పర్యటనను ముగించుకుని మోదీ గురువారం న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. ఈ పర్యటన ఇంధన భద్రత, రక్షణ సహకారం, వాణిజ్యం, కీలక ఖనిజాల రంగాలలో భారత్ భాగస్వామ్యాన్ని విస్తరించడంపై దృష్టి సారించింది. యూఏఈలో భారత్, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు, దీర్ఘకాలిక ఎల్‌పీజీ సరఫరా, రక్షణ, షిప్పింగ్‌తో సహా పలు ఒప్పందాలపై సంతకాలు చేసింది.












Click it and Unblock the Notifications