అజిత్ దోవల్‌కు కీలక బాధ్యతలు?: ఉక్రెయిన్ పరిణామాలపై మోడీ అత్యున్నత భేటీ
న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతోన్న భీకర యుద్ధం.. తొమ్మిదో రోజుకు చేరుకుంది. రష్యన్ సైనిక బలగాలు తమ దాడులు విస్తృతం చేశాయి. దాదాపు అన్ని నగరాలపైనా విరుచుకుని పడుతున్నాయి. రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకునే విషయంలో ఉక్రెయిన్ సైన్యం నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటోన్నప్పటకీ- మిగిలిన నగరాల్లో అలాంటి పరిస్థితి దాదాపుగా కనిపించట్లేదు. ప్రత్యేకించి తూర్పు ప్రాంతంలోని పలు నగరాలపై రష్యన్ ఆర్మీ దాడులు దూకుడును కొనసాగిస్తోంది. రాకెట్ల మోత మోగిస్తోంది. యూరప్‌లోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రంపైనా రాకెట్లను సంధించింది.

సీ-17 కీలక పాత్ర..
మరోవంక- ఆపరేషన్ గంగ విజయవంతంగా కొనసాగుతోంది. ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి భారత విద్యార్థులు, పౌరుల తరలింపు మరింత ముమ్మరమైంది. మొదట్లో ఎయిరిండియా విమానాలను నడిపించిన కేంద్ర ప్రభుత్వం- యుద్ధం తీవ్రతరమౌతున్న కొద్దీ వాటి సంఖ్యను పెంచింది. వైమానిక దళానికి చెందిన సీ-17 గ్లోబ్‌మాస్టర్ ఎయిర్ క్రాఫ్ట్‌లను రంగంలోకి దింపింది. ఈ విమానాలు వందల సంఖ్యలో భారతీయులను స్వదేశానికి చేర్చుతున్నాయి. ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వైమానిక దళానికి చెందిన హిండన్ ఎయిర్ బేస్ నుంచి ఈ ఆపరేషన్ కొనసాగుతోంది.

హిండన్‌కు చేరిన 690 మంది..
తాజాగా మూడు సీ-17 ఎయిర్ క్రాఫ్ట్స్.. హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నాయి. ఈ మూడు విమానాల ద్వారా మొత్తం 690 మంది భారతీయులు స్వదేశీ గడ్డపై అడుగు పెట్టారు. కేంద్రమంత్రులు వారికి పుష్పగుచ్ఛాలను అందించి స్వాగతం పలుకుతున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ భాయ్ మాండవీయ, విదేశాంగ శాఖ సహాయమంత్రి వీ మురళీధరన్, మీనాక్షి లేఖి.. తదితర కేంద్రమంత్రులు విద్యార్థులకు స్వాగతం పలికే కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యారు. హిండన్ ఎయిర్ బేస్ నుంచి వారిని స్వస్థలాలకు తరలించే పనులను పర్యవేక్షిస్తోన్నారు.
మోడీ కీలక భేటీ..
కాగా- ఈ పరిణామాల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దేశ రాజధానిలో ఈ భేటీ కొనసాగుతోంది. విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, కేంద్ర వాణిజ్యం-పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయెల్, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. ప్రధానంగా ఆపరేషన్ గంగ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయడం, రష్యాతో భారత్‌కు ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపైనే ఈ భేటీని ప్రధాని మోడీ ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.
Recommended Video

రష్యా వైపు నుంచి భారతీయుల తరలింపు..
ఆపరేషన్ గంగ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి రష్యాతో సంప్రదింపులను చేపట్టే బాధ్యతను అజిత్ దోవల్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. తమ భూభాగం నుంచి కూడా భారతీయులను తరలించడానికి తాము సహకరిస్తామంటూ రష్యా అంగీకారాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో- దీనికి సంబంధించిన పర్యవేక్షణ పనులను అజిత్ దోవల్‌కు ఇచ్చినట్లు సమాచారం. అలాగే రష్యాలోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదించడం, అధికారుల మధ్య సమన్వయం సాధించడం వంటి చర్యలు ఆయన పర్యవేక్షించే అవకాశం ఉంది. ఇప్పటికే నలుగురు కేంద్రమంత్రులు ఉక్రెయిన్ పొరుగు దేశాల్లో ఉంటూ ఆపరేషన్ గంగాను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications