కాశ్మీర్ దాడి ఎఫెక్ట్..! సౌదీ నుంచి రిటర్న్ లో రూటు మార్చేసిన మోడీ..!
జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్ లో నిన్న జరిగిన తీవ్రవాద దాడి దేశంలో తీవ్ర కలకలం రేపుతోంది. 28 మంది పర్యాటకులు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ వెంటనే హోంమంత్రి అమిత్ షా కు ఫోన్ చేసి పహల్గాంకు వెళ్లాలని ఆదేశాలు ఇచ్చారు. త్రివిధ దళాధిపతులతో మాట్లాడి తాజా పరిస్ధితిని సమీక్షించారు. అంతే కాదు స్వయంగా తాను సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకుని భారత్ కు తిరిగి వచ్చారు. అయితే ఇక్కడే ఓ ట్వీస్ట్ చోటు చేసుకుంది.
భారత ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లేటప్పుడు పాకిస్తాన్ గగనతలం మీదుగా ఆ దేశానికి వెళ్లారు. కానీ పహల్గాంలో ఉగ్రదాడి జరిగిందన్న సమాచారం అందగానే సౌదీ అరేబియా నుంచి భారత్ కు హుటాహుటిన ప్రధాని మోడీ బయలుదేరారు. అయితే ఈసారి ఆయన పాకిస్తాన్ గగనతలం మీదుగా భారత్ కు చేరుకోలేదు. మరో మార్గంలో ఆయన విమానం భారత్ కు చేరుకుంది. నిఘా వర్గాల హెచ్చరికలతోనే ప్రధాని మోడీ ఇలా పాకిస్తాన్ గగనతలం మీదుగా కాకుండా మరో మార్గంలో భారత్ కు వచ్చినట్లు తెలుస్తోంది.

ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత, ప్రధానమంత్రి మోడీ విమానాశ్రయంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరియు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఎస్) సమావేశం జరగనుంది. ఇందులో ప్రధాని మోడీ పాకిస్తాన్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది.

మరోవైపు పహల్గాంలో జరిగిన దాడి వెనుక కారణాలపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కశ్మీర్లో తీవ్రవాదాన్ని రూపుమాపేందుకే ఆర్టికల్ 370ని రద్దు చేసినట్లు కేంద్రం గతంలో చెప్పిన కారణాన్ని ఇప్పుడు విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం సుప్రీంకోర్టు కశ్మీర్లో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఇచ్చిన ఆదేశాలే ఇందుకు కారణమంటూ ప్రచారం మొదలుపెట్టింది. దీంతో ఇరు వర్గాల మధ్య సోషల్ మీడియాలో పెద్ద వార్ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications