Cyclone Tauktae: సొంత రాష్ట్రంలో ప్రధాని మోడీ ఏరియల్ సర్వే
అహ్మదాబాద్: గుజరాత్‌లో తౌక్టే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏరియల్ సర్వే నిర్వహించారు. తుఫాన్ తీవ్రతను అంచనా వేశారు. ఈ ఉదయం దేశ రాజధాని నుంచి ప్రత్యేక విమానంలో ఆయన గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చేరుకున్నారు. అనంతరం భావ్‌నగర్ విమానాశ్రయం నుంచి ఏరియల్ సర్వేకు బయలుదేరారు. తీర ప్రాంత జిల్లాలైన అమ్రెలి, భావ్‌నగర్, కేంద్రపాలిత ప్రాంతం డయ్యుల్లో ఏరియల్ సర్వే చేపట్టారు. గిర్ సోమ్‌నాథ్, ఉనా, జఫరాబాద్‌లల్లో ప్రధాని మోడీ ఏరియల్ సర్వే కొనసాగింది. అనంతరం ఆయన అహ్మదాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.
Recommended Video
అయిదు రాష్ట్రాలను వణికించిన తౌక్టే తుఫాన్.. సోమవారం రాత్రి గుజరాత్ వద్ద తీరాన్ని తాకింది. అమ్రెలి జిల్లాలోని జఫరాబాద్ ఈ తుఫాన్ తీరాన్ని దాటింది. ఆ సమయంలో 170 నుంచి 190 కిలోమీటర్ల మేర బలమైన ఈదురుగాలులు వీచాయి. సముద్ర తీర ప్రాంతాలన్నీ తుఫాన్ ప్రభావానికి గురయ్యాయి. మత్స్యకారుల పడవలు సముద్రంలో కొట్టుకుపోయాయి. వలలు ధ్వంసమయ్యాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. వందలాది హెక్టార్లలో పంట ధ్వంసమైంది. ఉద్యానవన పంటలు వర్షపు నీటితో నిండిపోయాయి. రైతులు, మత్స్యకారులు పెద్ద ఎత్తున నష్టపోయారు.

ఈ నష్టాన్ని అంచనా వేయడానికి ప్రధాని.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ మధ్యాహ్నం భావ్‌నగర్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను ముఖ్యమంత్రి విజయ్ రుపాణి స్వాగతం పలికారు. అనంతరం ఏరియల్ సర్వేకు బయలుదేరి వెళ్లారు. ఈ సర్వే ముగిసన అనంతరం ప్రధానమంత్రి అహ్మదాబాద్‌కు చేరుకుంటారు.

అక్కడే తుఫాన్ నష్టంపై అంచనా వేస్తారు. గుజరాత్ ప్రభుత్వ అధికారులతో సమావేశమౌతారు. ఎంతమేర నష్టం వచ్చిందనే అంచనాలను తెలుసుకున్న తరువాత.. ఆర్థిక ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉంది. దీనితోపాటు- రాష్ట్రంలో నెలకొన్న కరోనా వైరస్ స్థితిగతులపైనా ప్రధాని ఆరా తీస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications