తమిళంలో సంతకం పెట్టడం నేర్చుకో: ప్రధాని మోదీ సంచలనం
తమిళనాడు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిని ప్రారంభించారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో అధునాతన సాంకేతిక విధానంతో నూతనంగా ఈ బ్రిడ్జిని నిర్మించారు. బ్రిడ్జి ప్రారంభోత్సవం అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. తమిళనాడుకు గతంలో ఎన్నడూ లేని విధంగా రైల్వే ప్రాజెక్టుల కోసం ఏడు రెట్లు నిధులు పెంచామన్నారు. 2014 వరకు రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.900 కోట్లు కేటాయిస్తే NDA ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.600కోట్లు కేటాయించిందని ప్రధాని మోదీ వెల్లడించారు.
ప్రధాని మోదీ డీఎంకే నాయకులపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మీరు తమిళులు అని గర్వంగా ఫీల్ అయితే.. కనీసం సంతకాలైనా తమిళంలో పెట్టాలని ఎద్దేవా చేశారు. ఈ మేరకు కొందరు నేతలు సంతకాలను తమిళంలో చేయకపోవడం పట్ల ప్రధాని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కనీసం వాటినైనా తమిళంలో చేయాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. మరోవైపు వైద్య విద్యను తమిళ భాషలో అందించాలని, అప్పుడే తద్వారా పేదలకు ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాని మోదీ సూచించారు.

తమిళ భాష, తమిళ సంస్కృతిని ప్రపంచ నలుమూలలా తీసుకెళ్లేందుకు ఎన్డీఏ ప్రఫభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఇక 21వ శతాబ్దంలో నిర్మించిన ఇంజినీరింగ్ అద్భుతం పంబన్ వంతెన అని ప్రధాని మోదీ అభివర్ణించారు. ఈ వంతెన ఆధునికీకరణ డిమాండ్ దశాబ్దాల నుంచి ఉన్న కారణంగా కొత్త బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టామన్నారు.
ఇక పంబన్ వంతెన ఆవిష్కరించిన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ డుమ్మా కొట్టారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి మోదీ ప్రభుత్వానికి, తమిళనాడు సర్కార్ కు మధ్య వివాదం జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని కార్యక్రమానికి సీఎం హాజరుకాకపోవడం సంచలనంగా మారింది.












Click it and Unblock the Notifications