
రష్యాకు వ్యతిరేకంగా భారత్ నిలిచిన వేళ: పుతిన్‌కు ప్రధాని మోడీ ఫోన్ కాల్
బెర్లిన్: జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు ఇటీవలే జర్మనీ వేదికగా ముగిసింది. బవారియన్ ఆల్ప్స్ రీజియన్‌లో గల ష్లాస్ ఎల్మావ్‌లో ఏర్పాటైన ఈ సమ్మిట్‌లో వివిధ దేశాధినేతలు, ప్రధానమంత్రులు హాజరయ్యారు. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ ష్కాల్జ్ దీనికి అధ్యక్షత వహించారు. ఉగ్రవాదం, ఆహార భద్రత, గ్రీన్ ఎనర్జీ, వాతావరణ మార్పులు, పర్యావరణం.. వంటి కీలక అంశాలు ఇందులో చర్చకు వచ్చాయి. కొన్ని కీలక తీర్మానాలను ఈ సదస్సు ఆమోదించింది.
బీజేపీలో మగాళ్లు లేరా?: ఓ మహిళను బలిపశువు చేశారు: ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి

జీ7లో
ప్రత్యేకించి రష్యా-ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధంపైనా వారు చర్చించారు. అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్‌తో పాటు భారత్, అర్జెంటీనా, ఇండొనేషియా, సెనెగల్, దక్షిణాఫ్రికా దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు ఇందులో పాల్గొన్నారు. సమ్మిట్ ప్రారంభంలోనే ఆయా దేశాలన్నీ ఉక్రెయిన్‌కు భారీగా ఆర్థిక సహాయాన్ని ప్రకటించాయి. జీ7 దేశాల కూటమి కలిసి ఉక్రెయిన్‌కు 29.5 బిలియన్ డాలర్ల బడ్జెట్‌ను కేటాయిస్తామని స్పష్టం చేశాయి.

రష్యాకు వ్యతిరేకంగా..
ఈ సదస్సులో భారత్‌కు ప్రాతినిథ్యాన్ని వహించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై తన వైఖరిని స్పష్టం చేశారు. యుద్ధాన్ని తాము సమర్థించట్లేదని తేల్చి చెప్పారు. తక్షణమే రష్యా తన సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. శాంతియుత వాతావరణంలో చర్చలు, దౌత్యపరంగా ద్వారా మాత్రమే సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలని మోడీ అన్నారు. ఈ క్రమంలో ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీకి ఫోన్ చేశారు.

పుతిన్‌కు ఫోన్..
ఇక తాజాగా- ప్రధాని మోడీ.. ఈ సారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సుమారు 40 నిమిషాల పాటు ఆ ఇద్దరు నేతల మధ్య సంభాషణ కొనసాగింది. వివిధ అంశాలు వారిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చాయి. సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న దౌత్య, మైత్రీ సంబంధాల గురించి మాట్లాడారు. 2021లో వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు వచ్చిన సమయంలో ఈ రెండు దేశాల మధ్య కుదరిన ఒప్పందాలు, వాటిని సమర్థవంతంగా అమలు చేయడంపై చర్చించారు.

పలు రంగాలపై..
వ్యవసాయం, రక్షణ, వాణిజ్యం, ఎగమతి-దిగుమతులు, విదేశాంగ విధానాలపై మోడీ-పుతిన్ మధ్య సంభాషణ కొనసాగినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. వ్యవసాయోత్పత్తులు, ఫార్మాసూటికల్స్ ఎగుమతులు, ఎరువులు, ఇతర క్రిమి సంహారక మందులు, ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్.. వంటి పలు అంశాలపై వారిద్దరు సంభాషించినట్లు పీఎంఓ తెలిపింది.

24న ఆరంభం..
రష్యా-ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా యుద్ధం కొనసాగుతుండటం, ఇటీవలే జీ7 దేశాల సదస్సులో భారత్ కాస్త వ్యతిరేక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం వంటి పరిణామాల మధ్య మోడీ.. రష్యా అధ్యక్షుడితో ఫోన్‌లో సంభాషించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన రష్యా.. తన పొరుగునే ఉన్న ఉక్రెయిన్‌పై దండెత్తిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూ వస్తోంది.