స్కూళ్లు, హాస్టళ్లకు సోలార్ పవర్! 10 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హరిత ఇంధన (గ్రీన్ ఎనర్జీ) హబ్‌గా మార్చడమే కాకుండా, విద్యుత్ నెట్‌వర్క్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్‌కు అనుసంధానించేందుకు 'గ్రీన్ ఎనర్జీ కారిడార్-3' కింద సుమారు రూ. 22,000 కోట్లతో రూపొందించిన భారీ ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేసింది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యుత్ శాఖపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రాబోయే ఆరు నెలల కార్యాచరణ, పీఎం సూర్య ఘర్, పీఎం కుసుమ్ పథకాల పురోగతితో పాటు ప్రభుత్వ భవనాల సొలారైజేషన్ పనులపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-3 కింద ఉత్పత్తి అయ్యే ఇంధనాన్ని ప్రధాన గ్రిడ్‌కు అనుసంధానించేందుకు 2,261 కిలోమీటర్ల మేర కొత్త ట్రాన్స్‌మిషన్ లైన్లను వేయనున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ 18 గిగావాట్ల విద్యుత్‌లో సోలార్ ద్వారా 11 గిగావాట్లు, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా 7 గిగావాట్లు ఉత్పత్తి కానుంది. ఈ మెగా ప్రాజెక్టు కోసం 9,500 మెగావాట్ల సామర్థ్యంతో ఐదు భారీ పూలింగ్ స్టేషన్లను నిర్మించనున్నారు. ముదిగుబ్బ, తలుపుల, రామాయపట్నం, పోరుమామిళ్ల, కొప్పాక ప్రాంతాల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ నెట్‌వర్క్ పూర్తయితే విశాఖ డేటా సెంటర్లకు అవసరమైన నిరంతర విద్యుత్ అందుతుందని, తద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

స్కూళ్లు, హాస్టళ్లలో 'నెట్ జీరో' విప్లవం.. సబ్సిడీలతో సోలార్ ప్యానెల్లు
ప్రభుత్వ భవనాలపై విద్యుత్ భారాన్ని తగ్గించేందుకు 200 మెగావాట్ల సామర్థ్యంతో సొలారైజేషన్ ప్రక్రియను రెస్కో (RESCO) మోడల్, నెట్ మీటరింగ్ విధానంలో ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్ కింద చిత్తూరు జిల్లాలోని 78 గురుకుల పాఠశాలలు, వసతి గృహాలను ఎంపిక చేశారు. దీనితో పాటు రాష్ట్రవ్యాప్తంగా 2,898 స్కూళ్లు, హాస్టళ్లను 'నెట్ జీరో హెల్తీ క్యాంపస్'లుగా మార్చేందుకు గుర్తించారు. పీఎం సూర్యఘర్ పథకం అమల్లో ఏపీ ప్రస్తుతం దేశంలోనే నాల్గో స్థానంలో ఉందని, దీనిని అగ్రస్థానానికి తీసుకెళ్లాలని సీఎం ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సోలార్ ప్యానెళ్ల ఏర్పాటును ఆగస్టు నెలాఖరుకల్లా పూర్తి చేయాలని, బీసీ వర్గాలకు రూ. 20 వేల సబ్సిడీతో 10 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు బిగించే ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం స్పష్టం చేశారు.
దేశంలోనే తొలిసారి 'డిజిటల్ ట్విన్ గ్రిడ్'.. రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్
సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడంలో ఎప్పుడూ ముందే ఉండే ఏపీ ప్రభుత్వం, విద్యుత్ రంగంలో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన 'ప్రవాహ్' సంస్థ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ల్యాబ్ సహకారంతో ఏపీఈపీడీసీఎల్ పరిధిలో సాంకేతిక నష్టాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా దేశంలోనే మొదటిసారిగా 'డిజిటల్ ట్విన్ గ్రిడ్'ను రూపొందిస్తున్నారు.
ఇక విద్యుత్ డిమాండ్ విషయానికి వస్తే.. జూన్ 2026 నుండి నవంబర్ 2026 వరకు రాష్ట్రంలో గరిష్ట డిమాండ్ 12,226 మెగావాట్లకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. గత మే 21న రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 15,016 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైందని, గత ఏప్రిల్-మేతో పోలిస్తే ఈ ఏడాది విద్యుత్ వినియోగం 16.77 శాతానికి పైగా పెరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల (131 ప్రాంతాల్లో 577 స్టేషన్లు) ఏర్పాటును, రైతులకు లాభం చేకూర్చే కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ప్లాంట్ల స్థాపనను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.
సీఎం చంద్రబాబుతో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) బృందం భేటీ
మరో ముఖ్య పరిణామంలో, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయింది. ఏపీ ట్రాన్స్‌కో మరియు డబ్ల్యూఈఎఫ్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటి థీమాటిక్ సెంటర్ 'C4IR' (సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రీయల్ రెవల్యూషన్) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గ్రీన్ ఎనర్జీ, ఎనర్జీ ట్రాన్సిషన్, సైబర్ సెక్యూరిటీ రంగాలపై ఈ కేంద్రం ప్రధానంగా అధ్యయనం చేయనుంది.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. C4IR పూర్తి ఫలితాల ఆధారంగా (Result Oriented) పనిచేయాలని, విశాఖ డేటా సెంటర్ కారిడార్, గ్రీన్ హైడ్రోజన్ పెట్టుబడులను దీనితో అనుసంధానం చేయాలని సూచించారు. రాబోయే దావోస్ ప్రపంచ సదస్సు నాటికి ఆంధ్రప్రదేశ్ సాధించిన గ్రీన్ ఎనర్జీ పురోగతిని ప్రపంచానికి చాటిచెప్పేలా C4IR అద్భుతమైన బెస్ట్ మోడల్స్ తయారు చేయాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సాయిప్రసాద్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.














Click it and Unblock the Notifications