ఆస్ట్రేలియాపై సెంచరీ బాదిన మొట్టమొదటి బంగ్లాదేశ్ క్రికెటర్: కంగారూలు కుదేల్
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. డార్విన్ మరారా స్టేడియంలో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఆ దేశ యువ సంచలనం తన్జీద్ హసన్ తమీమ్ సెంచరీ బాదాడు. ఇది అతనికి రెండో టెస్ట్ మ్యాచ్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆస్ట్రేలియాపై టెస్ట్ సెంచరీ సాధించిన మొట్టమొదటి బంగ్లాదేశ్ బ్యాటర్‌గా రికార్డు పుస్తకాల్లోకెక్కాడీ డాషింగ్ ఓపెనర్. ఓ భారీ సిక్స్, ఎనిమిది ఫోర్లతో 100 పరుగులు పిండుకున్నాడు. 101 పరుగులకు అవుట్ అయ్యాడు.
దీంతో మొదటి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు టీ బ్రేక్ సమయానికి బంగ్లాదేశ్ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 286 పరుగులు చేసింది. భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ప్రస్తుతం ముష్ఫిక్ ఉర్ రెహ్మాన్- 29, కేప్టెన్ నాజ్ముల్ హొస్సైన్ శాంటో- 79 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఇప్పటివరకు 88 పరుగుల ఆధిక్యతను సాధించింది బంగ్లాదేశ్. ఓపెనర్ షద్మన్ ఇస్లాం- 20, హసన్ తమీమ్- 101, మొమినుల్ హక్ 49 పరుగులు చేసి అవుట్ అయ్యారు.

మొదటి ఇన్నింగ్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిన విషయం తెలిసిందే. టాప్ ఆర్డర్ లో స్టీవెన్ స్మిత్ మినహా మరే బ్యాటర్ కూడా రాణించలేకపోయారు. 71 పరుగులతో స్మిత్ ఒంటరిపోరాటం సాగించాడు. ట్రావిస్ హెడ్- 22, జేక్ వెదరాల్డ్- 23, మార్ముస్ లాబుషేన్- 1, కామెరాన్ గ్రీన్- 13, అలెక్స్ క్యారీ- 19, బ్యూ వెబ్ స్టర్- 12, పాట్ కమ్మిన్స్- 9, మిఛెల్ స్టార్క్- 1, నాథన్ లియాన్- 7, జోష్ హేజిల్ వుడ్- 4 (నాటౌట్) పరుగులు చేశారు. 198 పరుగులకే చాప చుట్టేసింది ఆస్ట్రేలియా.
బంగ్లాదేశ్ బౌలర్ హసన్ మహ్మూద్ ఆరు వికెట్లతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు. తస్కిన్ అహ్మద్- 2, ఇబాదత్ హొస్సైన్- 2 వికెట్లను పడగొట్టారు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో హసన్ తమీమ్.. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. 2003లో కైర్న్స్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో హన్నన్ సర్కార్ చేసిన 76 పరుగులే ఆస్ట్రేలియాలో ఓ బంగ్లాదేశ్ బ్యాటర్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉండేది.
23 ఏళ్లుగా ఏ బంగ్లాదేశ్ బ్యాటర్ కూడా ఆస్ట్రేలియా పిచ్‌లపై సెంచరీ మార్కును అందుకోలేకపోయాడు. దీన్ని బద్దలు కొట్టాడు హసన్. ఈ ఏడాది మే 16న పాకిస్తాన్‌పై టెస్ట్ అరంగేట్రం చేసిన ఈ యంగ్ బ్యాటర్.. రెండో టెస్ట్ లోనే ఈ రికార్డు సాధించాడు. నాథన్ లియాన్ బౌలింగ్ లో మిఛెల్ స్టార్క్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగినప్పుడు అతనికి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ఈ సెంచరీతో మొదటి టెస్ట్ మ్యాచ్ పై పూర్తి పట్టు బిగించింది బంగ్లాదేశ్. ఇంకా చేతిలో ఏడు వికెట్లు మిగిలివుండటంతో భారీ స్కోర్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.














Click it and Unblock the Notifications