మోడీ ట్రబుల్ షూటర్- ప్రపంచానికే రక్షకుడు-యోగీ ఆదిత్యనాథ్ ప్రశంసలు..
ఉత్తర్ ప్రదేశ్ లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన సీఎం యోగీ ఆదిత్యనాథ్.. ఇప్పుడు స్ధానిక సంస్ధల ఎన్నికల్లోనూ బీజేపీ జైత్రయాత్రను కొనసాగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ ప్రధాని మోడీ పాలనను సైతం ఓటర్లకు గుర్తుచేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని ఆయన సంకట్ మోచక్ (సమస్య పరిష్కారకర్త)గా అభివర్ణించారు. ప్రపంచం ఆయన్ను ఓ రక్షకుడిగా చూస్తోందన్నారు.
యూపీ స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రచారం కోసం మౌ, అజంగఢ్, సంత్ కబీర్ నగర్, బల్లియాలో పర్యటించిన యోగీ ఆదిత్యనాథ్.. ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. హనుమంతుడిని సంకత్మోచక్ అని పిలుస్తారని,నరేంద్ర మోడీని ప్రపంచ వ్యాప్తంగా ఒక రక్షకుడిగా చూస్తున్నారని వెల్లడించారు. నేడు మోడీ వల్ల యావత్ భారతదేశానికే గౌరవం లభిస్తోందన్నారు. ప్రపంచంలో ఏదైనా సంక్షోభం ఏర్పడినప్పుడల్లా ప్రపంచం రక్షకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ వైపు చూస్తుందన్నారు.

తూర్పు యూపీలోని సంత్ కబీర్ నగర్ జిల్లాలోని మఘర్ అనే పట్టణంలోనూ సిఎం యోగీ ప్రచారం నిర్వహించారు. దీనిని ఒకప్పుడు నరకానికి ప్రవేశ ద్వారంగా పరిగణించేవారని, అయితే బీజేపీ ప్రభుత్వం దానిని స్వర్గంగా అభివృద్ధి చేయడానికి కృషి చేసిందని అన్నారు. మఘర్‌లో మరణం అంటే నరకానికి వెళ్లడం అని అర్థనని, కానీ సంత్ కబీర్ ఆ భావనను మార్చాడన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో అది స్వర్గంగా మారిందన్నారు. సామాజిక సమానత్వం, సామరస్యంతో సహా ఆయన విలువలు, ఆదర్శాలపై పరిశోధనలను ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం సెయింట్ కబీర్ అకాడమీని ఏర్పాటు చేసిందన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి స్వయంగా ప్రచారానికి వస్తున్నారని ప్రజలు భావిస్తున్నారని, అవును, నేను వస్తున్నాను ఎందుకంటే డబ్బు ఢిల్లీ, లక్నో నుండి పంపుతున్నామని, అది ప్రజల ప్రయోజనాల కోసం సక్రమంగా ఖర్చుపెట్టాలని కోరుకుంటున్నట్లు యోగీ తెలిపారు. 2017కి ముందు కూడా డబ్బు ఉందని, కానీ పేదలకు ఇళ్లు రాలేదు, డబ్బు వృథా అయిందన్నారు. 70 ఏళ్లుగా కొందరి జేబుల్లోకి వెళ్లిందని, లేకుంటే ఈపాటికి ప్రతి పేదవాడికి మరుగుదొడ్డి, ఇల్లు ఉండేవన్నారు.












Click it and Unblock the Notifications