పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ..: భక్తులతో కలిసి ప్రధాని మోడీ భజన: రవిదాస్ మందిరంలో
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పంజాబ్‌లో ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరుగనుంది. మొత్తం 117 నియోజకవర్గాలకు ఒకే విడత పోలింగ్‌ను నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 2,13,88,764 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీనికోసం ఎన్నికల అధికారులు 24,689 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదే రోజు మూడో విడత ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా ఉంటుంది.
ఈ నెల 14వ తేదీ నాడే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను తొలుత ఈసీ షెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. సిక్కుల మత గురువు సంత్ రవిదాస్ జయంత్యుత్సవాలను దృష్టిలో ఉంచుకుని- పోలింగ్‌ను వాయిదా వేయాలంటూ పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ ఛన్నీ సహా పలువురు ప్రముఖులు ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తుల మేరకు ఈసీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ను 20వ తేదీకి రీషెడ్యూల్ చేసింది. దీనికోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది.

కాగా- సంత్ రవిదాస్ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఉదయం దేశ రాజధానిలో మందిరాన్ని దర్శించారు. ఢిల్లీ కరోల్‌బాగ్ ప్రాంతంలోని శ్రీ గురు రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిరంలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ ఉదయం ఆయన తన అధికారిక నివాసం నుంచి బయలుదేరారు. నేరుగా కరోల్‌బాగ్‌కు చేరుకున్నారు. విశ్రామ్ ధామ్ సిబ్బందికి ముందస్తు సమాచారం లేదు. గంట ముందు మాత్రమే ప్రధాని వస్తున్నారనే సమాచారాన్ని ఆయన కార్యాలయం అధికారులు సిబ్బందికి ఇచ్చారు.
Very special moments at the Shri Guru Ravidas Vishram Dham Mandir in Delhi. pic.twitter.com/PM2k0LxpBg
— Narendra Modi (@narendramodi) February 16, 2022
తమ విశ్రామ్ ధామ్‌కు చేరుకున్న ప్రధానికి అక్కడి సిబ్బంది సాదరంగా ఆహ్వానించారు. సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. లోనికి తీసుకెళ్లారు. సిక్కులు అనుసరించే సంప్రదాయం ప్రకారం.. తలకు స్కార్ఫ్ చుట్టుకున్నారు. రవిదాస్ విగ్రహానికి హారతి ఇచ్చారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం భక్తులతో కలిసి- శబద్ కీర్తన్‌లో పాల్గొన్నారు. గురు రవిదాస్ కీర్తనలను ఆలపించారు. వారితో కలిసి భజన చేశారు. విశ్రామ్ ధామ్ ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు. వారి వద్ద నుంచి వీడ్కోలు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications