బెంగాల్ లో దీదీ ఆట ముగిసింది , ఇది అభివృద్ధికి సమయం : విరుచుకుపడిన ప్రధాని మోడీ
పశ్చిమబెంగాల్లో ఎన్నికల సందర్భంగా రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. బెంగాల్లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్, అధికారంలోకి రావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న పార్టీ బిజెపి ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ రంగంలోకి దిగి పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
ఈరోజు బెంగాల్ లోని పురులియా జిల్లాలో ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో తృణముల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆట కొనసాగుతోందన్నారు.

బెంగాల్ లో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్న మోడీ
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని అందుకు కారణం అధికార టిఎంసి అని మోడీ విరుచుకుపడ్డారు . తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన ఆటలో బిజీగా ఉందని, పశ్చిమ బెంగాల్ నీటి సంక్షోభంలో చిక్కుకుని ఇబ్బంది పడుతుందని మోడీ పేర్కొన్నారు.
మొదట వామపక్ష ప్రభుత్వం మరియు తరువాత టిఎంసి ప్రభుత్వం ఇక్కడ పరిశ్రమలను అభివృద్ధి చేయనివ్వలేదన్నారు. నీటిపారుదల కోసం చేయాల్సిన పనులు జరగలేదు. తక్కువ నీరు కారణంగా పశువుల పెంపకం కూడా సరిగా చెయ్యలేని పరిస్థితి ఉందన్నారు .

టీఎంసీ అంటే ట్రాన్స్ఫర్ మై కమిషన్
టీఎంసీ అంటే ట్రాన్స్ఫర్ మై కమిషన్ అని కమిషన్ ఇస్తేనే టీఎంసీ ఏదైనా చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు బిజెపి ప్రభుత్వం డీబీటీ తరహాలో పనిచేస్తుందని, అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ అని మోడీ పేర్కొన్నారు. మే రెండవ తేదీన బెంగాల్లో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్ లో నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, బెంగాల్లో మాఫియా , ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, బెంగాల్ లో అరాచకం పెరిగిపోతుందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు.

బెంగాల్ లో టీఎంసీ ఆట ముగిసింది , అభివృద్ధి మొదలు కానుంది
టిఎంసి ప్రభుత్వం రైతులను వారి కష్టాలకు వదిలిపెట్టి తమ ఆటలో బిజీగా ఉన్నారు అని ప్రధాని మోడీ అన్నారు.
ఇక ఇంతకాలం కొనసాగిన టిఎంసి ఆట ముగిసిందని, ఇది అభివృద్ధికి సమయం అని ప్రధాని అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రజలతో 10 సంవత్సరాల పాటు ఆటాడిన దీదీ ఆట ఇప్పుడు ముగుస్తుందని పేర్కొన్నారు. బెంగాల్ లో అభివృద్ధి ప్రారంభమవుతుందని నరేంద్రమోడీ అన్నారు.

పశ్చిమ బెంగాల్ లో ఆట మొదలైందని టీఎంసి వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్
ఖేలా హోబ్' అన్న నినాదాన్ని ఎనిమిది దశల ఎన్నికలకు ముందే టిఎంసి పశ్చిమ బెంగాల్ ప్రజల్లోకి తీసుకు వెళ్ళింది. వాస్తవానికి, ఈ నినాదాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సహా టిఎంసి నాయకులు తమ ప్రసంగాలలో కూడా ఉపయోగించారు. దాదాపు అన్ని ప్రసంగాలలో, "ఖేలా హోబ్, దేఖా హాబ్, జేతా హోబ్ (ఆట ప్రారంభిద్దాం, మేము చూస్తాము, మేము గెలుస్తాము)" అని టీఎంసీ నాయకులు మాట్లాడారు. ఇక దీనిపై రివర్స్ ఎటాక్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ లో దీదీ మమతా బెనర్జీ ఆట ముగిసిందని తన ప్రచారంలో పదే పదే ప్రసంగిస్తున్నారు.












Click it and Unblock the Notifications