చంద్రబాబే కాదు- అందర్నీ కలిపేసుకుంటున్న మోడీ-ఆజాదీ సాయంతో జమిలి ప్లాన్ ?
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై గత కొన్నేళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. అయితే కేంద్రం ఈ దిశగా వేస్తున్న అడుగులు ముందుకు పడటం లేదు. అయితే దేశంలో బీజేపీ నానాటికీ పటిష్టంగా మారుతున్న వేళ జమిలి ఎన్నికల విషయంలో మాత్రం మోడీ ఎందుకు ముందుకెళ్లలేకపోతున్నారనే చర్చ సాగుతూనే ఉంది. కానీ తాజాగా ప్రధాని మోడీ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. జమిలి ఎన్నికల్ని ఎలాగైనా నిర్వహించి తీరాలని భావిస్తున్న మోడీ.. ఇందులో భాగంగా రాజకీయ ప్రత్యర్ధుల్ని కూడా కలిపేసుకుంటున్న వైనం చర్చనీయాంశమవుతోంది.

మోడీకి జమిలి కష్టాలు
కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు దాటిపోయింది. మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. అంతకంటే ముందే లేదా 2024లో జమిలి ఎన్నికలకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా ప్రాంతీయ పార్టీలకు అవకాశం ఇవ్వకుండా ఏకపక్ష విజయాలతో చైనా అధినేత జిన్ పింగ్ తరహాలో తన అధికారం సుస్ధిరం చేసుకోవాలని మోడీ భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. సీఈసీ సాయంతో జమిలి ఎన్నికలకు ఏర్పాట్లు చేయించేశారు. లా కమిషన్ అధ్యయనం పేరుతో కాస్త కాలయాపన చేస్తున్నట్లు కనిపిస్తున్నా అంతిమంగా రాజకీయం అనుకూలంగా ఉందని తేలిపోగానే మోడీ జమిలి కార్డు బయటికి తీయడం ఖాయమే.

విపక్షాల్ని కలిపేసుకుంటున్న వైనం
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే కేవలం కేంద్రం కోరుకుంటే సరిపోదు. ఇప్పటికే అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల్ని తమ అధికారం త్యాగం చేసేందుకు ఒప్పించాలి. అసలే దేశంలో తాము టార్గెట్ పెట్టుకున్న కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో బీజేపీకి జరిగిన మేలేంటో తెలియదు కానీ ప్రాంతీయ పార్టీలు మాత్రం బలపడుతున్నాయి. ఓ మమత, ఓ కేజ్రివాల్, నవీన్ పట్నాయక్, జగన్ వంటి వారు ప్రస్తుతానికి బలంగా కనిపిస్తున్నారు. వీరిని కాదని జమిలికి వెళ్లే పరిస్దితి లేదు. కానీ వీరిలో జగన్, పట్నాయక్ ఇప్పటికే తనకు అనుకూలంగానే కనిపిస్తున్నారు. అయినా ఎప్పుడు ప్లేటు ఫిరాయిస్తారో తెలియదు. దీంతో మిగతా వారందరినీ ఆ దిశగా ఒప్పిస్తే వీరు కూడా కలిసి రావడం ఖాయం. అదే సమయంలో ఆయా రాష్ట్రాల్లో విపక్ష పార్టీల్ని సైతం దగ్గర చేసుకుంటే వీరిపై మరింత ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది. మోడీ ఇప్పుడు అదే చేస్తున్నారు.

కలిసొచ్చిన ఆజాదీ పండుగ
జమిలి ఎన్నికల కోసం ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీల్ని ఒప్పించడం లేదా విపక్షాల సాయంతో వారిపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా ప్రధాని మోడీ అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను సైతం వాడేసుకుంటున్నారు. ఈ వేడుకలకు పార్టీలకు అతీతంగా రాజకీయ నేతల్ని ఆహ్వానిస్తున్నట్లు చెప్తున్న మోడీ.. అక్కడ వారితో చేతులు కలపడం ద్వారా పరోక్షంగా దేశం కోసం కలిసి రావాలని వారిని కోరుతున్నారు. సహజంగానే మోడీతో స్నేహం కోసం ఎదురుచూస్తున్న చంద్రబాబు వంటి నేతలు ఇదే అదనుగా ముందుకొస్తున్నారు. ఇప్పటికే భీమవరం టూర్ లో చంద్రబాబును కలిపేసుకుందామనుకున్న మోడీకి జగన్ అడ్డుపడినా చివరికి ఢిల్లీకి పిలిపించి మరీ కలిశారు మోడీ. మిగతా రాష్ట్రాల్లోనూ విపక్ష నేతల్ని పిలిపించుకోవడం, దారికి తెచ్చుకోవడం, బెదిరించడమే లక్ష్యంగా మోడీ వ్యూహాలు సాగుతున్నట్లు తెలుస్తోంది.

ఇంత చేసినా జమిలికి అడ్డంకులు ఇవే !
అయితే మోడీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆర్టికల్ 360 రద్దు వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కష్టంగానే కనిపిస్తోంది. ఎందుకంటే కశ్మీర్ లో ఆర్టికల్ 360 రద్దుపైనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఏకంగా దాదాపు 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాల్ని రద్దు చేసి జమిలి ఎన్నికలకు వెళ్లాలంటే భారీ వ్యతిరేకత తప్పదు. అలాగని మరో రెండేళ్ల తర్వాత జమిలి ఎన్నికల్ని నిర్వహించాలనుకున్నా అప్పుడు పరిస్ధితులు ఎలా ఉంటాయో తెలియదు. దీంతో సాధ్యమైనంత ఎక్కువ మందిని ఒప్పించడం ద్వారా జమిలి ఎన్నికల్ని నిర్వహించాలనే పట్టుదలతో మోడీ ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications