కల్లోల ఉక్రెయిన్‌లో మోదీ సాహసం- శాంతి మంత్రం: తొలి భారత ప్రధాని
PM Modi visit Ukrain: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఉక్రెయిన్‌లో అడుగుపెట్టారు. కొద్దిసేపటి కిందటే రాజధాని కీవ్ చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. రైల్వే స్టేషన్‌లో ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు మోదీకి స్వాగతం పలికారు. రైల్ ఫోర్స్ వన్ లో కీవ్‌కు చేరుకున్నారు.
ఈ నెల 21వ తేదీన ఆయన రెండు దేశాల పర్యటనను చేపట్టిన విషయం తెలిసిందే. తొలుత పోలెండ్ వెళ్లారు. రాజధాని వార్సాలో ఆ దేశాధ్యక్షుడు ఆంద్రెజ్ దూదా, ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్‌తో సమావేశం అయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక, రక్షణ ఒప్పందాలపై చర్చించారు. మోదీ.. పోలెండ్ పర్యటన రెండు రోజుల పాటు కొనసాగింది. కొద్దిసేపటి కిందటే ఉక్రెయిన్‌కి చేరుకున్నారు.

ఒక భారత ప్రధాని ఉక్రెయిన్‌లో పర్యటిస్తోండటం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 1991లో సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది ఉక్రెయిన్. అప్పటి నుంచి ఇప్పటివరకు భారత్‌కు చెందిన ఏ ప్రధాని కూడా ఆ దేశానికి వెళ్లలేదు. ఇప్పుడు అక్కడికి వెళ్లిన తొలి ప్రధానిగా రికార్డు నెలకొల్పారు మోదీ.
సుదీర్ఘకాలంగా రష్యాతో యుద్ధాన్ని కొనసాగిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మోదీ.. ఉక్రెయిన్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీతో సమావేశం కానున్నారు. ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. ప్రత్యేకించి- ఈ రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనేలా, కాల్పుల విరమణ ఒప్పందాలు కుదిరేలా చర్చలు సాగించనున్నారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. దీనికి విరామం అనేది ఉండట్లేదు. 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. పలువురు ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది.
అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు. సై అంటే సై అంటోన్నాయి. రష్యా చేస్తోన్న దాడులను ఉక్రెయిన్ సమర్థవంతంగా అడ్డుకుంటోంది. ఇన్ని రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిని రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి.
మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్‌బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్‌హీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కీలకమైన కర్క్స్ రీజియన్‌ను సైతం తమ ఆధీనంలోకి తెచ్చుకోగలిగినట్లు రష్యా ప్రకటించింది.
ఈ పరిస్థితుల్లో మోదీ ఉక్రెయిన్‌లో అడుగు పెట్టబోతోన్నారు. పోలెండ్ నుంచి నేరుగా కీవ్‌కు చేరుకుంటారు. ఆ దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీతో ముఖాముఖి సమావేశమౌతారు. మొన్నటివరకు తటస్థంగా ఉంటూ వచ్చింది భారత్. ఇప్పుడు ఉక్రెయిన్‌లో పర్యటించబోతోండటం చర్చనీయాంశమౌతోంది.












Click it and Unblock the Notifications