గ్లోబల్ లీడర్స్: మరోసారి ప్రథమ స్థానంలో ప్రధాని మోడీ, తర్వాతి స్థానాల్లో బైడెన్, మెర్కెల్
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన సత్తాను చాటుకున్నారు. ప్రపంచంలో 13 మంది నేతల్లో అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకుడిగా నరేంద్ర మోడీ మరోసారి ప్రథమ స్థానంలో నిలిచారు. ప్రజల్లో 70 శాతం మంది ఆదరణ ఆయనకు ఉందని అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సర్వే సంస్థ తన అధ్యయనంలో వెల్లడించింది.

ప్రజాదరణలో ముందున్న మోడీ..
సర్వేలో పాల్గొన్న వయోజనుల్లో 25 శాతం మంది మాత్రమే మోడీ పట్ల వ్యతిరేకతను కనబర్చినట్లు తెలిపింది. కాగా, ప్రతివారం ఈ గణాంకాలను లెక్కిస్తుంటారు. సెప్టెంబర్ 2వ తేదీ నాటికి ఉన్న సమాచారం ప్రకారం మోడీ తర్వాతి స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మేన్యుయెల్ లోపెప్ ఓబ్రడార్, ఇటలీ ప్రధాని మారియో డ్రాఘి, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జర్మన్ ఛాన్సలర్ ఏంజిలా మెర్కెల్ ఉన్నారు. ఇంతకుముందు వారం కూడా ప్రజామోదంలో ప్రధాని నరేంద్ర మోడీనే ముందుండటం విశేషం. జూన్ నెలలో మాత్రం ప్రజాదరణ 66 శాతానికి తగ్గింది. 2019 ఆగస్టులో మోడీని ఇష్టపడేవారి శాతం 82గా ఉండటం గమనార్హం.

తిరస్కార జాబితాలో చివరన మోడీ
కాగా, వివిధ దేశాలకు చెందిన నేతలకు ప్రజల నుంచి తిరస్కరణ ఏ స్థాయిలో ఉంటోందో సర్వేలో తెలుసుకున్నప్పుడు అందరి కంటే పైన జపాన్ ప్రధాని సుగా నిలిచారు. 64 శాతం మంది ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు. తిరస్కార జాబితాలో 25 శాతం మోడీ చివరి స్థానంలో ఉన్నారు. కాగా, ఎన్నికలు, పోలింగ్‌ను ప్రభావితం చేసే అంశాలు, ఎన్నికైనా ప్రజాప్రతినిధులకు ఉన్న ఆదరణ వంటి అంశాలపై మార్నింగ్ కన్సల్ట్‌కు చెందిన రాజకీయ విభాగం సమాచారాన్ని సేకరిస్తుంటుంది. ప్రతిరోజూ ప్రపంచంలో దాదాపు 11వేల మందిని ప్రశ్నించి, నేతలకు ఉన్న ఆదరణను తెలుసుకుంటుంది. ఇక అమెరికా అధ్యక్షునికి సంబంధించి ఆ దేశంలో రోజూ 5వేల మందిని ఇంటర్వ్యూ చేస్తుంటుంది. ఇదంతా ఆన్ లైన్లోనే జరుగుతుంది. ఒక దేశంలో ఒకవారంలో సర్వేలో వయోజనులు చెప్పిన సమాచార సగటును సంస్థ క్రోడీకరించి ఫలితాలను విడుదల చేస్తుంది.
మార్నింగ్ కన్సల్ట్ సర్వే అప్రూవల్ జాబితా..
మార్నింగ్ కన్సల్ట్ సర్వే అప్రూవల్ జాబితా.. మోడీ 70 శాతం ప్రజాదరణతో ప్రపంచ నేతల్లో ముందుండగా.. ఆ తర్వాతి స్థానాల్లో లోపేజ్ ఓబ్రడార్ 64శాతం, డ్రాఘి 63శాతం, మెర్కెల్ 52 శాతం, బైడెన్ 48 శాతం, మోరీసన్ 48 శాతం, ట్రూడో 45 శాతం, జాన్సన్ 41 శాతం, బోల్సనారో 39 శాతం, మూన్ 38 శాతం, శాంచెజ్ 35 శాతం, మాక్రాన్ 34 శాతం, సుగా 25 శాతంతో తర్వాత స్థానాల్లో ఉన్నారు.
Recommended Video
మార్నింగ్ కన్సల్ట్ సర్వే తిరస్కార జాబితా
మార్నింగ్ కన్సల్ట్ సర్వే తిరస్కార జాబితా.. సుగా 60 శాతంతో ముందుండగా, ఆ తర్వాతి స్థానాల్లో మాక్రాన్ 57 శాతం, శాంచెజ్ 57 శాతం, బోల్సనారో 54 శాతం, మూన్ 53 శాతం, జాన్సన్ 52 శాతం, ట్రూడో 49 శాతం, బైడెన్ 44 శాతం, మెర్కెల్ 41 శాతం, డ్రాఘి 31 శాతం, లోపేజ్ ఓబ్రడార్ 27 శాతం, మోడీ 25 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కాగా, ప్రజాదరణలో ప్రధాని మోడీ ప్రథమ స్థానంలో ఉండటంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. మోడీపై భారత ప్రజలకున్న ఆచంచల విశ్వాసానికి ఇది నిదర్శనమని, ఆయన పనితీరు, దార్శనిక నాయకత్వాలపై ప్రజాదరణ చెక్కు చెదరలేదన్నారు.












Click it and Unblock the Notifications