ఆర్థిక వ్యవస్థ: మోడీ కీలక నిర్ణయం, పేదల కోసం సరికొత్త పథకం
ప్రధాని నరేంద్ర మోడీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక సలహా మండలిని నియమించారు. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ప్రధాని మోడీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక సలహా మండలిని నియమించారు. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ప్రధాని మోడీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

బిబేక్ దేబ్రాయ్ నేతృత్వంలో కమిటీ
ఆర్థిక సలహా మండలిని ప్రధాని ప్రకటించారు. ఈ మేరకు ప్రముఖ ఆర్థికవేత్త, నీతి ఆయోగ్ సభ్యుడు బిబేక్ దేబ్రాయ్ నేతృత్వంలో ఈ సలహా మండలిని ఏర్పాటు చేశారు. ఈ మండలిలో సభ్యులుగా డాక్టర్ సూర్జిత్ బళ్లా, రతిన్ రాయ్, డాక్టర్ అషీమా గోయల్, సభ్య కార్యదర్శిగా రతన్ వటల్ నియమితులయ్యారు.

మోడీ కోరినా లేదా సుమోటోగా సూచనలు
ఆర్థిక వ్యవహారాలు, ఇతర అంశాలపై ఈ మండలి ప్రధాని మోడీకి సలహాలు ఇవ్వనుంది. దేశంలోని కీలక అంశాలపై ప్రధాని మోడీ కోరినా లేదా సుమోటోగానైనా వివిధ అంశాలపై సూచనలు ఇవ్వనుంది. ప్రధాని మోడీ కోరిక మేరకు సమయానుకూలంగా నివేదికలను సైతం రూపొందిస్తుంది.

మరో కీలక పథకం
మరోవైపు, ప్రధాని మోడీ మరో పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి పేదవాడి ఇంటికీ విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా 'ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్‌ఘర్ యోజన' (సౌభాగ్య) పథకాన్ని ప్రారంభించారు. సౌభాగ్య పథకం కింద ఈ ఏడాది డిసెంబరు నాటికి అన్ని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు అందేలా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

అంచనా ఇదీ
ఇందుకు రూ.16,320కోట్లు అవుతుందని అంచనా. గ్రామీణ ప్రాంతాలకు రూ.14,025 కోట్లు కేటాయించగా, పట్టణ ప్రాంతాల కోసం రూ.2,295 కోట్లు కేటాయించారు. 2019 మార్చి 31 నాటికి ఈ పథకం కింద ప్రతి ఇంటికీ విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది.

కేంద్రం 60 శాతం గ్రాంటు
ఈ పథకం అమలుకు కేంద్రం 60 శాతం గ్రాంటు ఇవ్వనుంది. రాష్ట్రాలు 10 శాతం భరించనున్నాయి. మిగిలిన మొత్తాన్ని రుణాల ద్వారా సమకూర్చనున్నారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు 85 శాతం నిధులను కేంద్రం గ్రాంటు రూపంలో ఇవ్వనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఐదు శాతం భరించనుంది. మొత్తంగా ఈ పథకం కోసం రూ.12,320 కోట్లు కేంద్రం భరించనుంది.












Click it and Unblock the Notifications