ఒకటి కాదు..రెండు కాదు: ఒకేసారి పట్టాలెక్కనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు
న్యూఢిల్లీ: దేశంలో మరిన్ని వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలెక్కబోతోన్నాయి. ఒకేసారి అయిదు రైళ్లు ప్రయాణికుల కోసం అందుబాటులోకి రాబోతోన్నాయి. వాటిని ప్రారంభించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ముహూర్తాన్ని ఖరారు చేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైలును కేంద్ర ప్రభుత్వం దశలవారీగా పట్టాలెక్కిస్తోంది. ఇప్పటివరకు మొత్తం 18 రైళ్లు వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి. కొత్తగా అయిదు రైళ్లు అందుబాటులోకి రానుంది.
ఈ అయిదింట్లో ఒకటి బిహార్‌లోని పాట్నా- జార్ఖండ్‌లోని రాంచీ మధ్య ప్రతిపాదించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్. ఇప్పటికే ట్రయల్ రన్ చేపట్టారు అధికారులు. ప్రతి రోజూ తెల్లవారు జామున 6.55 నిమిషాలకు పాట్నా జంక్షన్ నుంచి బయలుదేరుతుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు రాంచీకి చేరుకుంటుంది. మార్గమధ్యలో జెహనాబాద్, గయ, కోడెర్మా, బర్కాఖానా, హజారీబాగ్, మెస్రాలో దీనికి హాల్ట్ సౌకర్యాన్ని కల్పించారు. గయ స్టేషన్‌లో 10 నిమిషాల పాటు హాల్ట్ సౌకర్యం ఉంది ఈ రైలుకు.

ముంబై-గోవా మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్. ఇదివరకే ఈ రైలు పట్టాలెక్కాల్సి ఉన్నప్పటికీ- అది సాధ్యపడలేదు. అంతకుముందు రోజు రాత్రే ఒడిశాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఘోర ప్రమాదానికి గురైన నేపథ్యంలో ఈ రైలు ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. తాజాగా ఈ నెల 26వ తేదీన షెడ్యూల్ చేశారు. ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్ నుంచి బయలుదేరే ఈ రైలు దాదర్, థానె, పన్వెల్, రోహా, ఖేడ్, రత్నగిరి, కంకావళి, థివిమ్‌లల్లో ఆగుతుంది.
బెంగళూరు- హుబ్బళ్లి. ఇది కర్ణాటకలో నడిచే రెండో ఎక్స్‌ప్రెస్. క్రాంతివీర సంగోళి రాయన్న బెంగళూరు సెంట్రల్ స్టేషన్ నుంచి బయలుదేరే ఈ రైలు గదగ్, ధార్వాడ మీదుగా హుబ్బళ్లికి చేరుకుంటుంది. ఈ రెండు నగరాల మధ్య రైలు ప్రయాణ సమయం సుమారుగా 12 గంటలు.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించడం ద్వారా ఎనిమిది గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు. భోపాల్- ఇండోర్, భోపాల్- జబల్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అదే రోజున పట్టాలెక్కబోతోన్నాయి. వీటికి సంబంధించిన ట్రయల్ రన్ కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications