వందే భారత్ రైలును ప్రారంభించిన మోదీ
డెహ్రాడూన్: దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కింది. దేశ రాజధాని నుంచి వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సెమీ హైస్పీడ్ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ ఇది. ఇది 18వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్. ఇప్పటివరకు మొత్తం 17 రైళ్లు వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.
ఉత్తరాఖండ్‌కు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇది. ఢిల్లీ-డెహ్రాడూన్ మధ్య 302 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల 45 నిమిషాల్లో అధిగమిస్తుంది. ఈ నెల 29వ తేదీ నుంచి ప్రయాణికులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. బుధవారం మినహా మిగిలిన అన్ని రోజులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

ఢిల్లీ- డెహ్రాడూన్ ఏసీ చైర్ కార్ టిక్కెట్‌కి ధర 1,065 రూపాయలుగా నిర్ధారించారు. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టిక్కెట్ ధర 1,890 రూపాయలు.22457 నంబర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ ఆనంద్ విహార్ టెర్మినల్ స్టేషన్ నుంచి తెల్లవార జామున 5:50 నిమిషాలకు బయలుదేరుతుంది. 10:35 నిమిషాలకు డెహ్రాడూన్‌కు చేరుకుంటుంది.
డెహ్రాడూన్‌లో ఉదయం 7:00 గంటలకు ఢిల్లీకి బయలుదేరుతుంది. 11:45 నిమిషాలకు ఢిల్లీ ఆనంద్ విహార్ టెర్మినల్‌కు చేరుకుంటుంది. హరిద్వార్ జంక్షన్, రూర్కీ, సహరన్‌పూర్, ముజఫర్‌నగర్, మీరట్ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. కమర్షియల్ ఆపరేషన్స్ మొదలు పెట్టిన తరువాత ఈ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది.
PM Shri @narendramodi flags off Vande Bharat Express between Dehradun and Delhi. https://t.co/n4O9OVigVm
— BJP (@BJP4India) May 25, 2023
ఉత్తరాఖండ్‌లో వందశాతం రైల్వే పట్టాల విద్యుదీకరణ ప్రాజెక్ట్ పనులను కూడా ప్రధాని మోదీ లాంఛనంగా ఆరంభించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని డెహ్రాడూన్ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ రిటైర్డ్ లెప్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధమీ, మంత్రులు పాల్గొన్నారు.
అంతకుముందు అశ్విని వైష్ణవ్, పుష్కర్ సింగ్ ధమీ రైలులో కలియతిరిగారు. ప్రయాణికులతో మాట్లాడారు. విద్యార్థులతో ముచ్చటించారు. దేశవ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్‌ను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నామని, ప్రతి నగరానికీ రైలు సౌకర్యాన్ని కల్పిస్తోన్నామని పేర్కొన్నారు. వందే భారత్ రైళ్లు- దేశ ప్రగతికి అద్దం పడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్‌లో వంద శాతం రైల్వే ట్రాక్ విద్యుదీకరిస్తామని, దశలవారీగా పూర్తి చేస్తామని అశ్విని వైష్ణవ్ హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications