
Pegasus: 2017లో ప్రధాని మోడీ ఇజ్రాయెల్ టూర్: అసలు కథ అప్పుడే: జస్ట్ 15 డేస్: కమల్‌నాథ్
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా వెలుగులోకి వచ్చిన బిగ్ హ్యాకింగ్ స్కాండల్ పెగాసస్ దుమారం రోజురోజుకూ తీవ్రరూపాన్ని దాల్చుతోంది. పలువురు వేర్వేరు రంగాలకు చెందిన పలువురు బిగ్ షాట్స్ ఫోన్లు హ్యాక్ అయ్యాయంటూ వస్తోన్న వార్తలు దుమారాన్ని రేపుతోన్నాయి. బాధితుల జాబితాలో కొందరు కేంద్రమంత్రులు, ప్రతిపక్ష పార్టీల నేతలు, ప్రభుత్వ అధికారులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు ఉండటం, వారిలో కొందరి పేర్లు వెలుగులోకి రావడం రాజకీయ రచ్చకు దారి తీసింది. మొత్తంగా 300 మందికి బాధితులు ఈ పెగాసస్ రాడార్‌లో ఉన్నట్లు తేలింది.
భారత్‌లో కరోనా మరణాలు మూడు మిలియన్లు?: అధికారిక లెక్కలకు పది రెట్లు అధికంగా

కాక పుట్టిస్తోన్న స్కాండల్
పెగాసస్ స్పైవేర్ స్కాండల్‌లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌లను కూడా ఈ స్పైవేర్ టార్గెట్ చేసినట్లు తేలింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, జల్‌శక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఫోన్ నంబర్లు కూడా హ్యాక్‌కు గురైనట్లు ది వైర్ వెబ్‌సైట్ పేర్కొంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ప్రచురించింది. కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ అశోక్ లావాస, ఎన్నికల వాచ్‌డాగ్ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ వ్యవస్థాపకుడు జగ్‌దీప్ ఛోఖర్ ఫోన్ నంబర్లను టార్గెట్ చేసినట్లు తేలింది.

రేపే రాజ్‌భవన్‌ల ముట్టడి..
రాహుల్ గాంధీ ఫోన్‌ను కూడా పెగాసస్ టార్గెట్ చేసినట్లు రావడంతో కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. పెగాసస్ స్పైవేర్ స్కాండల్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. గురువారం దేశంలోని అన్ని రాజ్‌భవన్‌లను ముట్టడించనుంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు దిశా నిర్దేశాలను జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లో ఏక కాలంలో రాజ్‌భవన్‌లను ముట్టడించాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చింది పార్టీ అధిష్ఠానం. దీనితోపాటు- పెగాసస్ స్పైవేర్ స్కాండల్‌పై ప్రతిరోజూ విలేకరుల సమావేశాలను నిర్వహించాలని సూచించింది.

2017లో ఇజ్రాయెల్ పర్యటనకు మోడీ..అప్పుడే బీజం..
ఇందులో భాగంగా ఈ మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భారతీయ జనతా పార్టీ సారథ్యలోని కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 2017లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. మోడీ ఇజ్రాయెల్ పర్యటనతోనే ఈ పెగాసస్ స్కాండల్ ఆరంభమైందని, ఆయన పర్యటన ఈ బిగ్ హ్యాకింగ్‌కు బీజం వేసిందని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలు, రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేసే ప్రక్రియ 2017 నాటి మోడీ ఇజ్రాయెల్ పర్యటనతో ప్రారంభమైందని ధ్వజమెత్తారు.

15 రోజుల్లో అన్ని విషయాలూ వెలుగులోకి..
ఈ స్కాండల్‌పై పూర్తి వివరాలు ఇంకో 15 రోజుల్లో వెలుగులోకి వస్తాయని కమల్‌నాథ్ స్పష్టం చేశారు. ఫ్రెంచ్ ఆర్గనైజేషన్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాయని తెలిపారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయని కమల్‌నాథ్ పేర్కొన్నారు. ఈ మొత్తం ఉదంతంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. వ్యక్తుల ప్రైవసీపై చోటు చేసుకున్న అతిపెద్ద దాడిగా ఆయన పెగాసస్ స్కాండల్‌ను అభివర్ణించారు. స్పైవేర్ స్కాండల్ జరగలేదంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.