పహల్గామ్‌పై ప్రధాని మోదీ సంచలనం: రక్షణ శాఖ బలబలాలు బేరీజు- రెండో CCS ఖరార్
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో ఉగ్రవాదుల కిరాతక దాడి తరువాత అనూహ్య పరిణామలు ఏర్పడుతున్నాయి. ఈ దాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలను తీసుకుంది. ఈ మారణహోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావడం వల్ల ఆ దేశంపై కఠిన ఆంక్షలకు దిగింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ నెల 24వ తేదీన ఏర్పాటైన భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCS) ఈ నిర్ణయాలను తీసుకుంది. అట్టారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్ట్‌ను తక్షణమే మూసివేయాలంటూ ఆదేశించింది. చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లతో భారత్‌కు వచ్చిన, ఇక్కడ నివసిస్తోన్న పాకిస్తానీయులు కూడా తమ స్వదేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుందని తెలిపింది.

దీనికి డెడ్ లైన్ కూడా విధించింది సీసీఎస్. మే 1 తేదీ లోపలే వాళ్లంతా కూడా భారత్‌ను వదిలి పాకిస్తాన్‌కు వెళ్లి పోవాల్సి ఉంటుంది. ఈ రాకపోకల కోసం వారికి అందుబాటులో ఉన్న ఒకే ఒక్కటి ఈ అట్టారీ బోర్డర్ చెక్‌పోస్ట్. దీని ద్వారా మాత్రమే అధికారికంగా సరిహద్దు దాటాల్సి ఉంటుంది. గడువు దాటిన తరువాత కూడా ఇక్కడే ఉండే పాకిస్తానీయులకు జైలు శిక్ష తప్పకపోవచ్చు.
ఇండస్ రివర్ ట్రీటీనీ కేంద్రం రద్దు చేసింది. పాకిస్తాన్‌తో అన్ని రకాల సంబంధాలను కూడా తెంచేసుకుంది. భారత్‌లో ఉన్న పాకిస్తాన్ హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసింది. మే 1వ తేదీ లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. సీసీఎస్‌లో తీసుకున్న నిర్ణాయలతో కూడిన అధికారిక పత్రాన్ని ఆయనకు అందజేసింది.
ఈ నిర్ణయాలు తీసుకున్న ప్రకంపనలు ఇంకా తగ్గట్లేదు. అదే సమయంలో రెండోసారి సీసీఎస్ భేటీ కానుంది. బుధవారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ఏర్పాటు కానుంది. ప్రధాని మోదీ దీనికి అధ్యక్షత వహించనున్నారు.

సీసీఎస్ సభ్యులు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, భద్రత వ్యవహారాల సలహదారు అజిత్ ధోవల్, కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి, రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఇందులో పాల్గొననున్నారు.
తొలి సీసీఎస్‌లో తీసుకున్న నిర్ణయాల ఫలితాలు ఎలా ఉన్నాయనే విషయంపై రెండో భేటీలో విశ్లేషించే అవకాశం ఉంది. పాకిస్తాన్‌ను అన్ని కోణాల నుంచి అష్టదిగ్బంధనం చేయడంపై చర్చిస్తారని తెలుస్తోంది. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేసే దిశగా ఇందులో నిర్ణయాలు ఉంటాయని సమాచారం.
యుద్ధానికి దిగాల్సి వస్తే ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయనే అంశం కూడా ప్రస్తావనకు వస్తుందని చెబుతున్నారు. రక్షణ శాఖ బలబలాలను బేరీజు వేస్తారని సమాచారం. దీనిపై ఆ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని ఆధారంగా పాకిస్తాన్‌తో యుద్ధంపై తుది నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.
అలాగే- పహల్గామ్ దాడి తరువాత జమ్మూ కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ సైన్యం ప్రతి రోజూ భారత జవాన్ల అవుట్ పోస్టులపై కాల్పులకు పాల్పడే అంశాన్ని కూడా సీసీఎస్ చర్చించే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటివరకు పాకిస్తాన్ నాలుగుసార్లు ఎల్ఓసీ వద్ద కాల్పులు జరిపింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది.












Click it and Unblock the Notifications