PM Modi : విపక్షాల భేటీపై ప్రధాని మోడీ విసుర్లు-అక్కడికి వెళ్లాలంటే అర్హత ఇదే..!
బీజేపీకి వ్యతిరేకంగా బెంగళూరులో విపక్షాలు నిర్వహిస్తున్న రెండు రోజుల భేటీ, అలాగే విపక్షాలకు పోటీగా ఢిల్లీలో ఎన్డీయే నిర్వహిస్తున్న భేటీ ఆసక్తి రేపుతున్నాయి. ఈ రెండు భేటీల్లో అధికార ఎన్డీయే భేటీ కంటే కూడా విపక్షాల భేటీలో ఏం జరుగుతుందనే చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది. దీనికి విరుద్ధంగా ఎన్డీయే భేటీ కేవలం బలప్రదర్శనకే పనికొస్తుందనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ విపక్షాల భేటీపై సెటైర్లు వేశారు.
బెంగళూరులో జరుగుతున్న విపక్షాల భేటీని ఉద్దేశించి మాట్లాడుతూ.. అక్కడికి వెళ్లాలంటే ఓ అర్హత ఉండాలన్నారు. అది అవినీతిపరులు అయి ఉండటమే అన్నారు. అవినీతిపరులకు మాత్రమే అలాంటి సమావేశాలకు వెళ్లే అర్హత ఉంటుందన్నారు. తద్వారా విపక్షాల భేటీలో అవినీతి పరులు మాత్రమే ఉన్నారనే అర్దం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేసారు. ఇవాళ వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు.

గత 75 ఏళ్ల స్వాతంత్య్రంలో అవినీతి, దొరల పార్టీలు దేశానికి అన్యాయం చేశాయని ప్రతిపక్షాల ఐక్యతపై ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. 2024లో బీజేపీని తిరిగి తీసుకురావాలనే ఆలోచనలో దేశ ప్రజలు ఉన్నారని తెలిపారు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు మళ్లీ తమ దుకాణాన్ని తెరిచాయన్నారు. విపక్షాల ఐక్య సమావేశంలో 2024కి 26 పార్టీలు వచ్చాయని అన్నారు. ఈ పార్టీలు తమ దుకాణాల్లో 'కులతత్వం, అవినీతి' అనే రెండు వస్తువులను అమ్ముకుంటున్నాయని, ఇప్పుడు వారంతా బెంగళూరులో సమావేశమయ్యారని అన్నారు.
అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ గత ప్రభుత్వంతో పోల్చితే తమ ప్రభుత్వం అండమాన్, నికోబార్ దీవుల అభివృద్ధికి రెండింతలు ఖర్చు చేసిందని తెలిపారు. దేశంలోని ద్వీపాలలో పెరిగిన పర్యాటకం మరిన్ని ఉపాధి అవకాశాలకు సూచన అని మోడీ తెలిపారు. గతంలో స్వార్థ రాజకీయాల వల్ల మన అంతర్గత ప్రాంతం, ద్వీప ప్రాంతాలకు అభివృద్ధి పనులు జరగలేదన్నారు. తమ ప్రభుత్వ అభివృద్ధి పనులు కూడా దీవుల పర్యాటకానికి దోహదపడ్డాయని ప్రధాని మోడీ తెలిపారు. 2014 నుంచి పర్యాటకం రెట్టింపు అయిందని అన్నారు. అండమాన్, నికోబార్ దీవులలో స్నార్కెలింగ్, స్కూబా డైవింగ్, ఇతర కార్యకలాపాల కోసం దీవులకు వచ్చే వారి సంఖ్య బాగా పెరిగిందని ప్రధాని మోడీ వెల్లడించారు.












Click it and Unblock the Notifications