ప్రధాని మోదీ 3 గంటల అర్ధరాత్రి భేటీ: మంత్రులకు క్లాస్..! కేబినెట్ ప్రక్షాళన వేళ..!
కేంద్ర కేబినెట్ ప్రక్షాళనపై (Union Cabinet Reshuffle) ప్రధాని మోడీ (PM Modi) సుదీర్ఘ కసరత్తు కొనసాగుతోంది. ఓవైపు ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రాధాన్యం, మరోవైపు మిత్రపక్షాలకు అవకాశాలు, అలాగే తొలగింపులతో తలెత్తే అసంతృప్తిని కట్టడి చేయడం ఇలా పలు అంశాలు కేంద్ర కేబినెట్ ప్రక్షాళనపై ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే కేబినెట్లో పలువురు మంత్రులు రాజీనామాలు చేసేందుకు నిరాకరిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ప్రధాని మోడీ అర్ధరాత్రి తన సహచరులతో కీలక భేటీ నిర్వహించారు.
కేంద్ర మంత్రివర్గ విస్తరణ, మార్పులపై ఊహాగానాల నేపథ్యంలో ప్రధాని మోదీ మంత్రులతో కీలక భేటీ నిర్వహించారు. దాదాపు ఇరవై మంది కేంద్ర సహాయ మంత్రులు, స్వతంత్ర హోదా కలిగిన మంత్రులతో ప్రధాని సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ అర్ధరాత్రి సమావేశం దాదాపు మూడు గంటల పాటు సాగింది. ఇందులో మంత్రులు తమ పరిధిలోని శాఖలలో సాధించిన పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఇందులో మంత్రుల శాఖల ప్రగతి నివేదికలను పరిశీలించిన మోదీ.. కేవలం అధికారుల నుంచి సేకరించిన గణాంకాలను చదవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాంటి గణాంకాల వివరాలను సెక్రటరీలు కూడా ఇస్తారని, మంత్రులుగా క్షేత్రస్థాయిలో ప్రజల కోసం తాము నిజంగా చేసిన కృషిని నిరూపించుకోవాలని స్పష్టం చేశారు. కేబినెట్ సహచరులకు వారి అసలు పనితీరును గుర్తుచేస్తూ ప్రధాని సున్నితమైన హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది.

భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే 'వికసిత్ భారత్ 2047' స్వప్నం కోసం మంత్రుల వద్ద ఉన్న నిర్దిష్ట ప్రణాళికలు ఏమిటనే దానిపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ సాగినట్లు తెలుస్తోంది. రాబోయే ఐదేళ్లకు సంబంధించిన రోడ్‌మ్యాప్ ఏమిటో చెప్పాలని ప్రధాని మంత్రుల్ని కోరారు. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, యువత వంటి వర్గాల సంక్షేమానికి సంబంధించి తమ మంత్రిత్వ శాఖలు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలు, వాటి ఫలితాలను సమర్పించాలని ఆదేశించారు. అలాగే మంత్రుల సోషల్ మీడియా వినియోగం, ప్రజాదరణపై కూడా విశ్లేషణ చేశారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో లేదా సమాజంలో వచ్చే ఉద్యమాలు, సున్నితమైన సమస్యలపై సోషల్ మీడియా వేదికగా మంత్రులు ఎలా స్పందిస్తున్నారనే దానిపై ప్రధాని ఆరా తీశారు. ప్రతి మంత్రికీ వారి సోషల్ మీడియా స్కోర్‌కార్డును ఇచ్చి, అందులో ఎవరికీ నిర్దిష్ట ర్యాంకులు ఇవ్వకుండా, ప్రతి ఒక్కరూ తమ పరిధిని మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. కేంద్ర కేబినెట్ ప్రక్షాళన నేపథ్యంలో ఈ భేటీ కీలకంగా మారింది.














Click it and Unblock the Notifications
