ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మోడీ ఫోన్ కాల్: నెక్స్ట్ రౌండ్‌లో
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతోన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. టెలిఫోన్‌లో సంభాషించారు. ఆయా రాష్ట్రాల్లో కొనసాగుతోన్న కరోనా కట్టడి చర్యలపై ఆరా తీశారు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ దేశంలో ఉధృతంగా కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో నరేంద్ర మోడీ.. తన ఫోకస్ మొత్తాన్నీ దానిపైనే కేంద్రీకరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లను నిర్వహిస్తోన్నారు. కరోనా పాజిటివిటీ అధికంగా ఉండే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కోవిడ్ టాస్క్‌ఫోర్స్, ఉన్నతాధికారులతో తరచూ భేటీ అవుతున్నారు.
తాజాగా నరేంద్ర మోడీ మరోసారి నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలిఫోన్ ద్వారా సంభాషించారు. ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్ (రాజస్థాన్), భూపేష్ బఘేల్ (ఛత్తీస్‌గఢ్), యోగి ఆదిత్యనాథ్ (ఉత్తర ప్రదేశ్), ఎన్ రంగస్వామి (పుదుచ్చేరి)లతో మోడీ మాట్లాడారు. కరోనా నివారణ చర్యల గురించి ఆరా తీశారు. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, గుజరాత్ ముఖ్యమంత్రులతోనూ ఆయన సంభాషించాల్సి ఉన్నప్పటికీ.. తౌక్టే తుఫాన్ ప్రభావానికి గురైన నేపథ్యంలో- ఆ అయిదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నందున దాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు.

సోమవారం మరో అయిదు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని టెలిఫోన్ ద్వారా సంభాషిస్తారని అధికారులు చెబుతున్నారు. అత్యధిక పాజిటివ్ కేసులు నమోదవుతోన్న రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఏపీ సీఎంలను ఆయన సంప్రదిస్తారని తెలుస్తోంది. ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరత, రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు, ఐసీయూ ఉపకరణాలు, వెంటిలేటర్ల కొరత గురించి ఆ ముఖ్యమంత్రులు ప్రధానికి వివరించినట్లు సమాచారం. వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ప్రధాని వారి వద్ద ప్రస్తావించారు. దీన్ని మరింత వేగవంతం చేయాలని సూచించారు. వ్యాక్సిన్ల కొరతను అధిగమించడానికి తీసుకున్న చర్యల గురించి మోడీ వారికి వివరించారు.












Click it and Unblock the Notifications