అర్దరాత్రి ప్రధానితో చర్చలు, తెలంగాణ టాపిక్, పాతపాట పాడితే కొంప కొల్లేరు గ్యారెంటీ !
న్యూఢిల్లీ/బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీతో బీజేపీ నాయకులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇప్పటికే కర్ణాటకలో అధికారాన్ని చేతులారా వదులుకున్న బీజేపీ నాయకులు ఇప్పుడు 2024 లోక్ సభ ఎన్నికల్లో ఏం చెయ్యాలని అని రాత్రి పొద్దుపోయిన తరువాత చర్చలు జరపడం హాట్ టాపిక్ అయ్యింది. ఇదే ఏడాదిలో మరో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీతో బీజేపీ నాయకులు అర్దరాత్రి చర్చలు జరపడం హాట్ టాపిక్ అయ్యింది.
తెలంగాణలో కూడా ఇదే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు బీజేపీ సీనియర్ నేతలు బుధవారం రాత్రి సమావేశమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహ ఇతర పార్టీ నేతలు హాజరయ్యారు.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఏపార్టీ సహాయం లేకుండా సొంతంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ నాయకులతో చర్చించారని తెలిసింది.
బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని పదేపదే చెబుతున్నారు. అయితే ఇటీవల దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తుందని పలువురు మండిపడుతున్నారు. దేశంలో సివిల్ కోడ్ అనేది బీజేపీ మేనిఫెస్టోలలో భాగమైన అజెండా ఉండటం కూడా ఇప్పుడు బీజేపీ కొంప ముంచడానికి కారణం అవుతోందని ప్రజలు అంటున్నారు.

ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీ చిత్తుచిత్తుగా ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే, కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడంతో ఆ పార్టీ నాయకులు షాక్ తిన్నారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తన అభిప్రాయాలను మార్చుకునేలా చేసిందని తెలిసింది.
దేశంలో నాలుగు కీలక రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లకు ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో మధ్యప్రదేశ్‌లో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. రాజస్థాన్‌లో అధికార పార్టీలోని ఇద్దరి వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. అయితే అది ఎంతవరకు లాభం చేకూర్చుతుందో అనే విషయం ఆ దేవుడే నిర్ణయిస్తారు.
కర్ణాటకలో చేసిన ప్రయోగాలు మరోసారి చేస్తే బీజేపీ కొంప కొల్లేరు అయిపోతుందని కర్ణాటకకు చెందిన పలువురు నాయకులు ఇప్పటికే బహిరంగంగా చెప్పారు. గత నెలలో కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తొమ్మిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలు కలిసి పలుసార్లు చర్చలు జరిపారు. ఇది 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీకి ప్రజల మద్దతును పెంచడానికి బీజేపీ అనేక కసరత్తులు చేస్తోందని తెలిసింది.












Click it and Unblock the Notifications