కళాకారిణికి మోడీ వందనం: తెలుగు రుచిచూపిన వెంకయ్య(పిక్చర్స్)
న్యూఢిల్లీ: ఢిల్లీలోని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు నివాసంలో మంగళవారం నాడు సంక్రాంతి సంబరాలు జరిగాయి. సంక్రాంతి మిలన్ పేరుతో నిర్వహించిన ఈ వేడుకలో ప్రధాని నరేంద్ర మోడీ సందడి చేశారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తెలుగు పిండివంటలు అందరినీ ఆకర్షించాయి.
బొబ్బట్లు, పూతరేకులు, తేగలు, రేగుపండ్లు, వీనులవిందు చేసే హరిదాసు కీర్తనలు, సంక్రాంతి పాటలు, యక్షగానాలు, కనువిందు చేసే భరతనాట్యాలు, మోహినీ ఆట్టం.. అలరించాయి. 30 ఔరంగజేబు రోడ్‌లోని ఆయన నివాసం ఒక్కసారి పచ్చిక బయళ్ల మధ్య పల్లెటూరుగా మారింది.
సంక్రాంతి మిలన్ పేరిట జరిపిన కార్యక్రమానికి ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, పార్టీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ, 25 మందికి పైగా కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు, అత్యంత ఉన్నతస్థాయి అధికారులు, ఢిల్లీలో తెలుగు ప్రముఖులు, విపక్ష నాయకులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

కళాకారిణికి మోడీ వందనం
‘‘ఈ పవిత్రమైన పండుగ ప్రకృతికి సంబంధించింది, సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి ప్రవేశించిన ఈ సందర్భాన్ని దేశంలో నలుమూలలా ప్రజలు రకరకాలుగా జరుపుకుంటారు. సంక్రాంతితో మంచిరోజులు వస్తాయని మనందరి నమ్మకం. మీకందరికీ మకర సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నా'నని ప్రధాని మోడీఅభినందనలు తెలిపారు.

సంక్రాంతి మిలన్
ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన షేక్ నాదియా నృత్యభంగిమలను చూసి మోడీ పులకరించిపోయారు. పలువురు కళాకారులను ఆయన అభినందించారు. ప్రముఖరచయిత, మాజీ పార్లమెంట్ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ‘నరేంద్ర మోడీ- ఒకపరిచయం' పేరుతో రచించిన పుస్తకాన్ని ఈ సందర్భంగా తనకు బహూకరించినప్పుడు ఆయన ఎంతో సంతోషించారు.

వెంకయ్య, అమిత్ షా
తాను మొట్టమొదటిసారి ఇంత అద్భుతమైన కార్యక్రమానికి హాజరయ్యానని అమిత్ షా కొనియాడారు. ప్రతిసారీ వెంకయ్య ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తారని, ఆయన అంత కష్టపడే నేతను తాను చూడలేదని ఆడ్వానీ అన్నారు.
వెంకయ్య ఇంట్లో అంతా తీయని తెలుగు స్వీట్లు కనపడతాయని, ఆయన మనసు, మాట కూడా తీపిగా ఉంటుందని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అభినందించారు.

సంక్రాంతి మిలన్
తెలుగువారు ఎంతో ఘనంగా జరుపుకొనే సంక్రాంతి ప్రత్యేకతను అతిథులకు తెలిపిన వెంకయ్య రాజకీయాలకతీతంగా సంస్కృతి అందర్నీ ఏకం చేస్తుందని, మనుషుల్లో మానవీయ విలువల్ని పైకి తెస్తుందని అన్నారు. తనను గల్లీ నుంచి ఢిల్లీకి తీసుకువచ్చిన ఆడ్వానీని ఆయన ప్రత్యేకంగా గౌరవించి, శాలువాతో సన్మానించారు.

సంక్రాంతి మిలన్
మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరిగిన ఈ కార్యక్రమంలో నాదస్వరం, గొబ్బిళ్లపాట, తమిళ్ కుమ్మి, కేరళ గిరిజన నృత్యాలు, కర్ణాటక జానపద నృత్యాలు ఆహూతులను అలరించాయి. సంక్రాంతి ప్రాధాన్యతను వివరించిన ప్రముఖ సహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ, కళాకారులను వెంకయ్య ఘనంగా సత్కరించారు.












Click it and Unblock the Notifications