రూ. 4.31 కోట్లకు అమ్ముడు పోయిన ప్రధాని మోడీ సూటు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పర్యటనకు వచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ధరించిన సూటుకు వేలంలో భారీ ధర పలికింది. శుక్రవారంతో ముగిసిన వేలంలో ఈ సూటు ఏకంగా రూ. 4.31 కోట్లకు అమ్ముడుబోయింది.
ఓ వ్యాపారి ఈ మొత్తం చెల్లించి సూటును సొంతం చేసుకున్నారు. ఈ సొమ్మును బాలికల విద్య కోసం ఉపయోగించనున్నారు. నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన సుమారు 450 బహుమతులతో పాటు ఈ సూటుని కూడా వేలం వేశారు.

మొదట బుధవారం ఈ సూటుకి రూ. 51 లక్షల బిడ్ దాఖలైంది. అక్కడి నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చి రూ. 1.81 కోట్లకు చేరింది. వేలం చివరి రోజైన శుక్రవారం సూటు ధర ఒక్కసారిగా పెరిగింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పర్యటనకు వచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేవీ బ్లూ కలర్‌లో ఉండి, పిన్ స్ట్రయిప్స్ (సన్నని నిలువు చారలు) ఉన్న బంద్ గలా కోటు ధరించారు.
కానీ అవి పిన్ స్ట్రయిప్స్ కావని, నరేంద్ర దామోదర్ దాస్ మోడీ అన్న పేరులోని అక్షరాలు అలా నిలువుగా ఉన్నాయని పై చిత్రాన్ని చూస్తే మీకే తెలుస్తుంది. మోడీ పేరులోని అక్షరాలు నేతలోనే వచ్చేలా నేసిన వస్త్రంతో ఈ బంద్ గలా కోటు రూపొందించారు. అలా కోటుపై ఆయన పేరు వెయ్యిసార్లు వస్తుంది.












Click it and Unblock the Notifications