అలాంటి హామీలు ఇవ్వలేం: ఆప్‌పై ప్రధాని విమర్శ
న్యూఢిల్లీ: తాము ఇతర రాజకీయ పార్టీల లాగా సాధ్యం కానీ హామీలను ఇవ్వలేమని ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశించి ప్రధాని మన్మోహన్ సింగ్ బుధవారం అన్నారు. వాస్తవంగా సాధ్యమయ్యే హామీలను మాత్రమే ఇస్తామని ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చాలా అసంతృప్తి గురి చేశాయని మన్మోహన్ సింగ్ అన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల ముందు నిరుత్సాహానికి లోనుకాకూడదని పార్టీ శ్రేణులకు సూచించారు.
ఇటీవల జరిగిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంకేతంగా భావించాల్సిన అవసరం లేదని మన్మోహన్ సింగ్ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ అంశాలే ప్రధాన భూమిక నిర్వహిస్తాయని ఆయన అన్నారు. జాతీయ సమస్యలపై ప్రభుత్వం వ్యవహరించిన తీరుపైనే ఆ ఎన్నికల్లో ఫలితాలు ఉంటాయని తెలిపారు.

పార్టీలో క్రమ శిక్షణ, ఐకమత్యం లోపం, తదితర కారణాలతో ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైనట్లు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా గాంధీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ శ్రేణులు 2014 లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలపై ప్రజలను సానుకూలంగా మార్చుకోవడం విఫలమయ్యామని, ప్రజల ఆకాంక్షను పొందలేకపోయామని ఆమె అన్నారు.
పార్టీలో క్రమశిక్షణ, ఐకమత్యం లోపించిన కారణంగానే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, రాజస్థాన్ ఎన్నికల్లో పరాజయమైనట్లు సోనియా తెలిపారు. అయితే ఈ ఫలితాలతో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా 2014 మేలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఎన్నికల్లో ఓడింది, గెలిచింది.. పార్టీ విజయం సాధించినా, ఓటమి పాలైనా తమ అంతిమ లక్ష్యం సామర్థ్యం మేరకు ప్రజలకు సేవ చేయడమేనని సోనియా తెలిపారు.
ప్రత్యర్థి పార్టీల భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి పార్టీ శ్రేణులకు సోనియా సూచించారు. మత, విభజన ప్రయోజనాలు పొందేందుకు కొన్ని ప్రత్యర్థి పార్టీలు సెక్యూలర్ పార్టీ అయిన కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టాలను పార్టీ శ్రేణులకు సోనియా గాంధీ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications