వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

PMSBY ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన : 20 రూపాయ‌ల‌తో రూ. 2 లక్ష‌ల ప్ర‌మాద బీమా పొందడం ఎలా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పీఎంఎస్‌బీవై

మ‌న బ్యాంకు ఖాతాలో ఒక 20 రూపాయ‌లుంటే చాలు. 2 ల‌క్ష‌ల రూపాయ‌ల ప్ర‌మాద బీమాను మనం పొందొచ్చు. ఏదైనా అనుకోని ప్ర‌మాదాలు సంభ‌వించి మ‌ర‌ణించినా లేదా వైక‌ల్యం సంభవించినా ఆప‌ద వేళ‌ల అండ‌గా నిలిచేందుకు ప్ర‌ధాన‌మంత్రి సుర‌క్షా బీమా యోజ‌న (పీఎంఎస్‌బీవై) పథకం తోడ్పడుతుంది.

భార‌తీయుల సామాజిక భ‌ద్ర‌త కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల్లో పీఎంఎస్‌బీవై ఒకటి. దేశంలో బ్యాంకు ఖాతాలు క‌లిగిన ప్ర‌తి ఒక్క‌రూ ఉప‌యోగించుకోవ‌డానికి ఉద్దేశించి రూపొందించిన ప‌థ‌క‌మిది.

ఇంత త‌క్కువ ప్రీమియం చెల్లింపుతో ఇంత ల‌బ్ది చేకూర్చే ప‌థ‌కం మ‌న దేశ బీమా రంగంలో వేరొకటి లేదని చెప్పుకోవచ్చు.

ఇంతకీ పీఎంఎస్‌బీవై అంటే ఏమిటి, ఈ బీమా పొంద‌డం ఎలా, ప్రీమియం ఎలా చెల్లించాలి, ఈ బీమా నియ‌మ నిబంధ‌న‌లు ఏమిటీ, బీమా క్లెయిములు ఎలా పొందాలి? లాంటి వివ‌రాలు ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం..

పీఎంఎస్‌బీవై

ఏమిటీ ప్ర‌ధాన‌మంత్రి సుర‌క్ష బీమా యోజ‌న?

భార‌తీయులకు సామాజిక భ‌ద్ర‌త క‌ల్పించాల‌నే ఉద్దేశంతో కేంద్ర ప్ర‌భుత్వం 2015 సంవ‌త్స‌రంలో మూడు ర‌కాల సామాజిక భ‌ద్ర‌తా ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. అందులో ఒక‌టి ఈ ప్ర‌ధాన‌మంత్రి సుర‌క్ష బీమా యోజ‌న (PMSBY).

పేద‌లు, అణ‌గారిన వ‌ర్గాల ప్ర‌జ‌లు అతి త‌క్కువ ప్రీమియం చెల్లించడం ద్వారా ప్ర‌మాదా బీమా స‌దుపాయాన్ని పొంద‌గ‌లిగే వీలు క‌ల్పిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం 2015 మే 9వ తేదీన ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించింది. బ్యాంకులో సేవింగ్స్ ఖాతా క‌లిగిన వారంద‌రూ ఈ బీమా పొందే వీలు క‌ల్పించింది.

ప్ర‌భుత్వ రంగ సాధార‌ణ బీమా సంస్థ‌లు (Public Sector General Insurance Companies - PSGIC) / జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్సు కంపెనీలు ఆయా బ్యాంకుల‌తో అనుసంధానం చేసుకోవ‌డం ద్వారా ఈ ప‌థ‌కాన్ని నిర్వ‌హిస్తారు. బీమా సంస్థ‌ల‌తో ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంకులు త‌మ ఖాతాదారుల‌కు ఈ బీమాలో చేరే స‌దుపాయాన్ని క‌ల్పిస్తాయి.

ఈ బీమా చేసుకున్న‌వారు ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణిస్తే వారి కుటుంబాల‌కు 2 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ఆ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్న బీమా సంస్థ‌లు చెల్లిస్తాయి. ఒక‌వేళ ప్ర‌మాదంలో పాక్షిక వైక‌ల్యానికి గురైతే బీమా చేసుకున్న వ్య‌క్తికి 1 ల‌క్ష రూపాయ‌లు చెల్లిస్తారు.

31-03-2022 నాటికి 22 కోట్ల మంది ఈ బీమాలో చేరారు. రూ.1,134 కోట్ల రూపాయలను పాలసీదారుల నుంచీ ప్రీమియం రూపేణా వసూలు చేశారు. 2,513 కోట్ల రూపాయలను క్లెయిములను చెల్లించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

బీమా

బీమా చేసుకోవ‌డానికి ఎవ‌రు అర్హులు?

18 నుంచీ 70 సంవ‌త్స‌రాల వ‌య‌సున్న ప్ర‌తి ఒక్క‌రూ కూడా ప్ర‌ధాన‌మంత్రి సుర‌క్షా బీమాలో చేర‌డానికి అర్హులు.

దీనికోసం వీరికి దేశంలోని ఏదో ఒక బ్యాంకులో సేవింగ్స్ ఖాతా త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి.

ఆ ఖాతాతో మీ ఆధార్ కార్డు త‌ప్ప‌నిస‌రిగా అనుసంధాన‌మై ఉండాలి.

ఒక‌వేళ ఒక వ్య‌క్తికి ఒక‌టి కంటే ఎక్కువ బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతాలున్న‌ట్ల‌యితే ఆ వ్య‌క్తి కేవ‌లం ఒక బ్యాంకులో త‌న‌కున్న ఒక సేవింగ్స్ ఖాతా ద్వారా మాత్ర‌మే ఈ బీమాలో చేరొచ్చు.

ఇద్ద‌రు అంత‌కంటే ఎక్కువ మందితో కూడిన ఉమ్మ‌డి ఖాతా (Joint Account) ఉన్న‌ట్ల‌యితే, ఆ ఖాతాలో ఉన్న స‌భ్యులంద‌రూ కూడా ఈ బీమాలో చేరొచ్చు.

ప్ర‌వాస భారతీయులు (NRI) కూడా ఈ ప‌థ‌కంలో చేరొచ్చు. అయితే క్లెయిమ్‌లు చెల్లించాల్సి వ‌చ్చిన‌ప్పుడు పాల‌సీదారుడు / నామినీకి చెల్లించాల్సిన మొత్తం భార‌తీయ క‌రెన్సీలోనే చెల్లిస్తారు.

బీమా కాల ప‌రిమితి ఎంత‌?

కేవ‌లం ఒక సంవ‌త్స‌ర కాల పరిమితి మాత్రమే. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే ఈ పథకం వర్తిస్తుంది.

ప్ర‌తి సంవ‌త్స‌రం జూన్ 1వ తేదీ నుంచీ బీమా ప్రారంభ‌మై మే 31వ తేదీతో ముగుస్తుంది.

ప్రతి సంవత్సరం కూడా బీమా ప్రీమియం సేవింగ్స్ ఖాతా నుంచీ బ్యాంకు ద్వారా ఆటో డెబిట్ చేయించి ఈ బీమాను రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుంది.

బీమాలో చేర‌ద‌ల‌చుకున్న‌వారు ఈ కాల వ్య‌వ‌ధిలోనే మీ సేవింగ్స్ ఖాతా నుంచీ ఈ బీమాకు చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

ప్రీమియం ఎంత‌?

ఈ బీమాలో చేర‌డానికి చెల్లించాల్సిన ప్రీమియం సంవ‌త్స‌రానికి కేవ‌లం 20 రూపాయ‌లు మాత్ర‌మే.

ప‌థ‌కం ప్రారంభంలో కేంద్ర ప్ర‌భుత్వ ప్రీమియం 12 రూపాయ‌లుగా నిర్ణ‌యించినా త‌రువాత దాన్ని 20 రూపాయ‌ల‌కు పెంచారు.

సేవింగ్స్ ఖాతా నుంచీ ఆ బ్యాంకు ఒప్పందం చేసుకున్న బీమా సంస్థ‌కు ఈ ప్రీమియం మ‌న ఆమోదంతో జ‌మ (Audo Debit) అయిపోతుంది.

ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీ ఈ ప్రీమియం సొమ్ము మీ సేవింగ్స్ ఖాతా నుంచీ ఆటో డెబిట్ అవ్వాలి. అంటే ఈ తేదీకి మీ ఖాతాలో తప్పనిసరిగా రూ.20 ఉండేలా చూసుకోవాలి.

జూన్ 1వ తేదీకి చెల్లించలేక పోతే ఏమవుతుంది?

జూన్ 1వ తేదీలోపు పీఎంఎస్‌బీవై పథకం ప్రీమియం సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.

ఒకవేళ ఎవరైనా ఆ తేదీలోపు బీమా ప్రీమియం చెల్లించలేపోయినట్లయితే తదుపరి మీరు చెల్లించిన తేదీ నుంచీ ఆ ఆర్థిక సంవత్సరానికి ఈ బీమా వర్తిస్తుంది.

బీమా వ‌ల్ల క‌లిగే లాభ‌మేమిటీ?

ఈ బీమాలో చేర‌డం వ‌ల్ల చాలా ఉప‌యోగాలున్నాయి. బీమాలో చేరిన వ్య‌క్తి ప్ర‌మాదంలో మ‌ర‌ణిస్తే వారి కుటుంబ స‌భ్యులు/ నామినీకి ఆ బ్యాంకు ద్వారా బీమా సంస్థ 2 ల‌క్ష‌ల రూపాయ‌లు చెల్లిస్తుంది. పాక్షికంగా వైక‌ల్యం చెందితే ల‌క్ష రూపాయ‌లు చెల్లిస్తుంది.

ప్రమాదానికి గురై ఆసుపత్రి పాలైతే వైద్య ఖర్చులు చెల్లిస్తారా?

ఒక్కపైసా కూడా చెల్లించరు. ఎందుకంటే ఇది మెడిక్లైయిమ్ పాలసీ కాదు కాబట్టి.

కేవలం ప్రమాదానికి గురై అంగవైకల్యం సంభవించినా లేదా బీమా చేసుకున్న వ్యక్తి మరణించినప్పుడు మాత్రమే ఈ బీమా సొమ్ము చెల్లిస్తారు.

బ్యాంకు ఖాతా లేకపోతే?

బ్యాంకులో సేవింగ్స్ ఖాతా లేనివారు ఈ పథకానికి అర్హులు కారు.

మీకు బ్యాంకు ఖాతా లేకపోతే వెంటనే మీకు దగ్గర్లోని ఏదేని బ్యాంకులో సేవింగ్స్ ఖాతా తెరచుకోవాల్సి ఉంటుంది.

ఈ ఖాతా నుంచీ ఏటా 20 రూపాయలు బీమా చెల్లించడం ద్వారా మీరు ఈ పథకంలో చేరొచ్చు.

ఒక ఏడాది కట్టి ప్రీమియం చెల్లించడం ఆపేస్తే అప్పుడు ఏం చేయాలి?

ఈ బీమా ఆయా సంవత్సరానికి ఉద్దేశించింది కాబట్టి మీరు తదుపరి ఏడాది కూడా ఈ బీమాలో చేరొచ్చు.

ఎప్పుడైనా ఆ ఏడాదిలో మీ బ్యాంకు ఖాతా నుంచీ 20 రూపాయల బీమా ఆటో డెబిట్ చేయించుకోవడం ద్వారా బీమాలో చేరొచ్చు.

చేరిన తరువాత ప్రతి ఏడాది ఇదేవిధంగా రెన్యువల్ చేసుకోవచ్చు.

ఈ ఏడాది నేను ప్రీమియం చెల్లించలేదు, నాకు బీమా వర్తిస్తుందా?

వర్తించదు. మీరు ప్రీమియం చెల్లించిన సంవత్సరానికే ఈ పథకం వర్తిస్తుంది

బీమాలో చేరిన సంవత్సరం మీకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే అప్పుడు మీకు నిబంధనల మేరకు బీమా సొమ్ము పొందే అవకాశం ఉంటుంది.

మునుపటి సంవత్సరం బీమాలో చేరి, ఈ ఏడాది బీమాలో చేరలేదనుకుందాం. అప్పుడు ఈ ఏడాది మీకు ఏదైనా ప్రమాదం సంభవించి మీరు నష్టపోతే మీకు బీమా సొమ్ము రాదు. ఎందుకంటే మీరు ఈ సంవత్సరం బీమాలో చేరలేదు కాబట్టి.

అందువల్ల ప్రతి సంవత్సరం ఈ బీమా ప్రీమియం చెల్లించి సభ్యత్వం రెన్యువల్ చేసుకోవాలి

ఈ బీమాలో మాస్టర్ పాలసీ దారు ఎవరు?

మనం ఏ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఉందో ఆ బ్యాంకు మాత్రమే బీమా మాస్టర్ పాలసీదారుగా వ్యవహరిస్తారు.

ఆ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్న బీమా సంస్థలు ఆ మాస్టర్ పాలసీదారైన ఆ బ్యాంకుతో సంప్రదించి బీమా చేసుకున్న వ్యక్తికి బీమా సొమ్ము చెల్లిస్తాయి.

బీమా ఏ పరిస్థితుల్లో రద్దు చేస్తారు?

మీ వయసు 70 సంవత్సరాలు దాటితే ఈ బీమా రద్దు అవుతుంది.

బ్యాంకులో మీరు మీ సేవింగ్స్ ఖాతాను క్లోజ్ చేసుకున్నప్పుడు కూడా ఇది రద్దు అవుతుంది.

బ్యాంకులోని మీ సేవింగ్స్ ఖాతాలో బీమా చెల్లింపునకు సరిపడా డబ్బులు లేనప్పుడు కూడా బీమా వర్తించదు.

ఒకవేళ మీరు ఒకటి కంటే ఎక్కువ సేవింగ్స్ ఖాతాల ద్వారా ఈ బీమాలో చేరి ఉన్నట్లయితే బీమా రద్దు అవుతుంది.

ఇతరత్రా బీమా కలిగి ఉన్నా ఈ బీమా వర్తిస్తుందా?

మీకు ఇతరత్రా ఏదేని ఎన్ని బీమా కలిగి ఉన్నా ఈ బీమాలో మీరు చేరవచ్చు. ఈ బీమా వర్తిస్తుంది.

బీమా ఎప్పుడు వర్తిస్తుంది?

సహజ విపత్తుల కారణంగా జరిగే ప్రమాదాలు, మరణం లేదా వైకల్యం సంభవించినప్పుడు మాత్రమే ఈ ప్రధానమంత్రి సురక్షా బీమా పథకం వర్తిస్తుంది.

ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి బీమా వర్తిస్తుందా?

ఈ బీమాలో చేరిన వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఈ బీమా వర్తించదు.

పాలసీదారు హత్యకు గురైతే?

ప్రధానమంత్రి సురక్షా బీమా యోజనాలో చేరిన వ్యక్తి హత్యకు గురైతే ఈ పథకం వర్తిస్తుంది. హత్యకు గురైన బీమా చందాదారు కుటుంబ సభ్యులు లేదా నామినీకి బీమా సొమ్ము చెల్లిస్తారు.

ఈ పథకంలో చేరే విధానం ఎలా?

ప్రభుత్వరంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు, అలాగే బ్యాంకుల సహకారంతో ఇతర సాధారణ బీమా సంస్థల నుంచీ ఈ బీమాలో చేరొచ్చు.

బ్యాంకులు తమ ఖాతాదారుల కోసం ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సాధారణ బీమా సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయి.

http://www.janasuksha.gov.in/Forms-PMSBY.aspx వెబ్ సైటు ద్వారా ఈ బీమా దరఖాస్తు పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకుని అందులోని వివరాలు నింపి ఆ పత్రాన్ని మీరు సేవింగ్స్ ఖాతా కలిగిన బ్యాంకులో అందజేయాలి.

నెట్ బ్యాంకింగ్ ద్వారా చేరొచ్చా?

చేరొచ్చు . ఇప్పుడు బ్యాంకులన్నీ కూడా తమ ఖాతాదారులకు ఆన్‌లైన్ సదుపాయం కల్పిస్తున్నాయి

ముందుగా నెట్ బ్యాంకింగ్ లాగిన్ చేసుకోవాలి.

అందులో ఇన్సూరెన్సు ఆప్షన్ క్లిక్ చేయాలి.

మీరు ఏ ఖాతాను ఉపయోగించి ప్రీమియం చెల్లించాలనుకుంటున్నారో దాన్ని ఎంపిక చేసుకోవాలి.

అన్ని వివరాలను తనిఖీ చేసకోవాలి. తరువాత అక్నాలెడ్జ్‌మెంటును తప్పనిసరిగా డౌన్‌లోడు చేసుకోవాలి. భవిష్యత్తు రెఫరెన్సు కోఫం దాన్ని భద్రపరచుకోవాలి.

SMS ద్వారా సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చా?

SMS ద్వారా కూడా ఈ బీమా తీసుకోవచ్చు.

అర్హులైన చందాదారులు 'PMSBY Y’ కి ప్రతిస్పందించమని ఒక SMS వస్తుంది. ఈ బీమాలో చేరడానికి ఈ సందేశం వచ్చిన ప్రత్యుత్తరం ఇవ్వాలి.

ఎస్‌ఎంఎస్‌కు ప్రతిస్పందనగా కస్టమర్‌కు రసీదు కూడా వస్తుంది.

తదుపరి ప్రాసెసింగ్ కోసం చందాదారుడు పేరు, పుట్టిన తేదీ, వైవాహిక స్థితి, మొదలైన వివరాలను కలిగి ఉండాలి.

ఈ వివరాలను చందాదారు బ్యాంకు ఖాతా నుంచీ తీసుకుంటారు.

ఒకవేళ మీకు సంబంధించిన తగిన వివరాలు ఆ బ్యాంకులో లేనట్లయితే పాలసీ నిర్ధారణ ప్రక్రియ ఆగిపోతుంది.

అప్పుడు మీరు మీ ఖాతా ఉన్న సమీప బ్యాంకును సంప్రదించి మీ వివరాలు వారికి అందజేయాల్సి ఉంటుంది.

నామినీని మార్చుకోవచ్చా?

నెట్ బ్యాంకింగ్‌లో మీ పొదుపు ఖాతా (సేవింగ్స్ ఖాతా)లో మీరు సూచించిన నామినే పేరునే ఇది సూచిస్తుంది.

అయితే మీరు అదే నామినీ పేరు లేదా మీకు ఇష్టమైన మరొకరి పేరును కూడా సూచించవచ్చు.

మీరు ఎంపిక చేసుకున్న బ్యాంకును బట్టి చిన్న చిన్న మార్పులు కూడా చేసుకోవచ్చు.

ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?

బీమాలో చేరిన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే దానికి సంబంధించిన అన్ని సరైన పత్రాలు సాక్ష్యంగా తీసి ఉంచుకోవాలి.

ఈ పత్రాలను సమర్పించినట్లయితే పీఎంఎస్‌బీవై పథకం కింద క్లెయిమ్ డబ్బులు మంజూరవుతాయి.

ఒకవేళ రోడ్డు, రైలు ప్రమాదాలు, ఏదైనా వాహన ప్రమాదం, నీటిలో మునిగిపోవడం, హత్యకు గురికావడం లాంటివి సంభవిస్తే దానికి సంబంధించి పోలీసులు ధ్రువీకరించిన పత్రాలు పొందుపరచాల్సి ఉంటుంది.

పాము కాటుకు మరణించినా లేదా చెట్టుపై నుంచీ కిందపడిపోయి మరణించినా దానికి సంబంధించి ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించిన పత్రాలు పొందుపరచాలి. తద్వారా క్లెయిమ్ సొమ్ములు చెల్లిస్తారు.

నామినీకి ఎప్పుడు చెల్లిస్తారంటే?

బీమాలో చేరిన వ్యక్తి మరణించినప్పుడు మాత్రమే బీమా చేసుకున్న వ్యక్తి సూచించిన నామినీకి ఈ బీమా సొమ్ములు చెల్లిస్తారు.

ఒకవేళ బీమాదారు నామినీగా ఎవరి పేరును సూచించనట్లయితే అతడి చట్టబద్ధమైన వారసుడు లేదా వారసురాలు క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

చట్టబద్దమైన వారసుల బ్యాంకు ఖాతాలో ఈ సొమ్ము జమ అవుతుంది.

ఒకవేళ బీమా దారు బతికి ఉండి ప్రమాదంలో వైకల్యానికి గురైతే బీమా దారు బ్యాంకు ఖాతాలోకి సొమ్ము జమ అవుతుంది.

బీమా

పీఎంఎస్‌బీవై అందిస్తున్న వివిధ రకాల బ్యాంకుల్లో కొన్ని

  • భారతీయ స్టేట్ బ్యాంకు
  • ఇండియన్ బ్యాంకు
  • అలహాబాద్ బ్యాంకు
  • బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • ఐసీఐసీఐ
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
  • ఐడీబీఐ బ్యాంక్
  • భారతీయ మహిళా బ్యాంక్
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్ తదితర అన్ని జాతీయ, ప్రవైటు బ్యాంకులు

''చాలా మేలు చేస్తుంది”

పీఎంఎస్‌బీవైతో అల్పాదాయ వర్గాలకు, కార్మికుల కుటుంబాలకు ఎంతో మేలు చేకూరుతోందని బ్యాంకింగ్ రంగ నిపుణులు పున్నమరాజు అన్నారు.

''ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యం పొందినా 2 లక్షల రూపాయలు.. పాక్షిక అంగవైకల్యం కలిగితే లక్ష రూపాయలు అందిస్తారు. అనుకోకుండా ప్రమాదానికి గురి అయ్యే అవకాశం ఉన్న భవన నిర్మాణ కార్మికులు, యంత్రాలతో పని చేసేవారు, డ్రైవర్‌లు వంటి వారు తప్పకుండా చేరవలసిన పథకం ఇది’’అని ఆయన అన్నారు.

''ఫ్యాక్టరీ యాజమాన్యాలు తమ కార్మిక కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తమ దగ్గర పనిచేసే వారందరికీ ఈ పథకాన్ని వర్తింప చేసేలా ప్రీమియాన్ని వారే చెల్లించేలా చూడడం చాలా అవసరం. కొత్తగా ఖాతా ప్రారంభించనవసరం లేకుండా ఇప్పటికే ఉన్న ఖాతాల ద్వారా ప్రీమియం చెల్లించే వెసులుబాటు ఉపయోగించుకుంటే మరింత ఎక్కువ మందికి ఈ పథకం చేరువ అవుతుంది’’అని ఆయన అన్నారు.

''ప్రభుత్వాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, పత్రికలు, వివిధ మాధ్యమాలు ఈ పథకానికి మరింత విస్తృత ప్రచారం కల్పించాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతివారు ఈ పథకంలో చేరేలా చూడాల్సిన అవసరం ఉంది’’అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
PMSBY Pradhan Mantri Suraksha Bima Yojana: How to get Rs 2 lakh with Rs 20 accident insurance?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X