'బెస్ట్‌ టూరిజం విలేజ్‌' పోటీలో తెలంగాణ పోచంపల్లి, భారత్ నుంచి పోటీలో మూడు గ్రామాలు - ప్రెస్ రివ్యూ

ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీవో) నిర్వహించే 'బెస్ట్‌ టూరిజం విలేజ్‌' కాంటెస్ట్‌కు భారత్‌ నుంచి తెలంగాణలోని 'భూదాన్‌ పోచంపల్లి' గ్రామం పోటీ పడుతోందని 'నమస్తే తెలంగాణ’ కథనం రాసింది.

''భూదాన్ పోచంపల్లితో పాటు పాటు మేఘాలయలో విజిలింగ్‌ విలేజ్‌గా ప్రఖ్యాతిగాంచిన 'కాంగ్‌థాన్‌', మధ్యప్రదేశ్‌లోని చారిత్రాత్మక గ్రామం 'లద్‌పురా ఖాస్‌' కూడా పోటీలో ఉన్నాయి.

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా గ్రామీణ పర్యాటకాన్ని, అక్కడ నివసిస్తున్న ప్రజల జీవన శైలిని వినూత్న పద్దతిలో ప్రపంచానికి తెలియజేయడంలో భాగంగా యూఎన్‌డబ్ల్యూటీవో 'బెస్ట్‌ టూరిజం విలేజ్‌' పోటీని నిర్వహిస్తున్నది.

పర్యాటక రంగాన్ని ప్రోత్సాహకం, గ్రామీణ ప్రాంతాల్లో జనాభాను పెంచడం, మౌలిక వసతుల కల్పన, సంప్రదాయాల పరిరక్షణ, అసమానతల తొలగింపు కూడా ఈ పోటీ మరో ఉద్దేశం.

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని గ్రామమే భూదాన్‌పోచంపల్లి. 1951లో మహాత్మాగాంధీ ప్రియ శిష్యుడు ఆచార్య వినోభాబావే చేపట్టిన పాదయాత్ర ద్వారా దేశంలో ఒక కొత్త శకానికి ఈ ప్రాంతం నాంది పలికింది.

ఇక్కడి భూదాత వెదిరె రామచంద్రారెడ్డి వినోభాబావే పిలుపు మేరకు హరిజనులకు 100 ఎకరాల భూమి దానం చేశారు. అనంతరం ఈ కార్యక్రమాలను విస్తృతం చేస్తూ.. సుమారు 44 లక్షల ఎకరాల భూమిని దాతల నుంచి సేకరించి భూమిలేని పేదలకు పంచి పెట్టారు.

అలా మాములు పోచంపల్లిగా ఉన్న ఈ గ్రామం భూదానోద్యమంతో 'భూదాన్‌పోచంపల్లి'గా మారింది. అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరలే కాదు.. నాటి నిజాంతోపాటు ఇతర అరబ్‌ దేశాలకు తేలియా రుమాళ్లు, గాజులు, పూసలను ఎగుమతి చేసిన నాటి పోచంపల్లి.. రానురాను ఇక్కడి చేనేత కళాకారుల ప్రతిభతో 'సిల్క్‌ సిటీ ఆఫ్‌ ఇండియా'గా పేరు తెచ్చుకుంది.

పోచంపల్లి చేనేత కళాకారులు నేసిన అనేక రకాల ఇక్కత్‌ వస్త్రాలకు మంచి గుర్తింపు ఉంది’ అని ఆ కథనంలో పేర్కొన్నారు.

హైదరాబాద్‌కు కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొమ్మిది రోజుల ఢిల్లీ పర్యటన ముగిసిందని, గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన దిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకున్నారని 'ఆంధ్రజ్యోతి’ కథనం తెలిపింది.

''ఈ నెల ఒకటో తేదీన దిల్లీ వెళ్లిన కేసీఆర్ సుదీర్ఘంగా 9 రోజులపాటు దేశ రాజధానిలో గడపడం ఇదే మొదటిసారి.

ఈసారి తన పర్యటనలో ఆయన దిల్లీలో టీఆర్‌ఎస్‌ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఆ తర్వాత ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, గజేంద్ర సింగ్‌ షెకావత్‌, నితిన్‌ గడ్కరీతో భేటీ అయి రాష్ట్రానికి సంబంధించి ఆయా అంశాలపై చర్చించారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవాలని సీఎం భావించినా.. ఆయన ఢిల్లీలో అందుబాటులో లేని కారణంగా అపాయింట్‌మెంట్‌ లభించలేదు.

మంత్రులతో భేటీ అనంతరం మరో రెండు రోజులపాటు కేసీఆర్‌ దిల్లీలోనే ఉన్నార’ని ఆ కథనంలో పేర్కొన్నారు.

పోలవరం

పోలవరంలో మరో కీలకఘట్టం పూర్తి

పోలవరం పనుల్లో మరో కీలక ఘట్టం పూర్తయిందని 'సాక్షి’ కథనం తెలిపింది.

''ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌(ఈసీఆర్‌ఎఫ్‌) గ్యాప్‌-3లో కాంక్రీట్‌ డ్యామ్‌ నిర్మాణాన్ని 'మేఘా' సంస్థ పూర్తి చేసింది.

153.5 మీటర్ల పొడవు, 53.32 మీటర్ల ఎత్తు, 8.50 మీటర్ల వెడల్పుతో ఈ డ్యామ్‌ను నిర్మించారు. దీని నిర్మాణంలో సుమారు 23 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను వినియోగించారు.

నిర్మాణం పూర్తయిన కాంక్రీట్‌ డ్యామ్‌కు ప్రభుత్వ సలహాదారు (డిజైన్లు) గిరిధర్‌రెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు, ఎస్‌ఈ నరసింహమూర్తి, మేఘా వైస్‌ ప్రెసిడెంట్‌ రంగరాజన్‌ తదితరులు గురువారం శాస్త్రోక్తంగా పూజలు చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం రామయ్యపేట వద్ద గోదావరిలో భూభౌగోళిక పరిస్థితుల వల్ల నదికి అడ్డంగా ఇసుక తిన్నెలపై ఈసీఆర్‌ఎఫ్, కుడి గట్టుపై స్పిల్‌ వే(కాంక్రీట్‌ డ్యామ్‌).. ఈసీఆర్‌ఎఫ్‌కు ఎడమ వైపున 960 మెగావాట్ల సామర్థ్యంతో జలవిద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించేలా కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ను ఆమోదించింది.

ఆ డిజైన్‌ ప్రకారం స్పిల్‌వేను 1,118.4 మీటర్ల పొడవు, 55 మీటర్ల ఎత్తుతో ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. 194.6 టీఎంసీలను నిల్వ చేసేలా 2,454 మీటర్ల పొడవున ఈసీఆర్‌ఎఫ్‌ను మూడు భాగాలుగా నిర్మించాల’ని రాశారు.

నారా లోకేశ్‌ను అడ్డుకున్న పోలీసులు

గుంటూరు జిల్లా నరసరావుపేటలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరిన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను పోలీసులు అడ్డుకున్నారని 'ఈనాడు' కథనం తెలిపింది.

''మొదట గన్నవరం విమానాశ్రయంలోనే లోకేశ్‌ను అడ్డుకొని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు వ్యూహం మార్చి ఆయన్ను ఉండవల్లి నివాసానికి తరలించాలని చూశారు.

విజయవాడలోని కనకదుర్గ వారధి వద్దకు వచ్చేసరికి లోకేశ్ తాను ఇంటికి వెళ్లబోనని నరసరావుపేట వెళ్తానని పట్టుపట్టారు.

ఒక దశలో లోకేశ్‌ను పోలీసులు బలవంతంగా వాహనం నుంచి దించేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలని ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది.

తనను ఎందుకు అడ్డుకుంటున్నారో లిఖిత పూర్వకంగా నోటీసులు ఇవ్వాలని లోకేశ్ పట్టుపట్టడంతో అక్కడికక్కడ కాగితంపై 41(ఎ) నోటీస్ రాసి ఇచ్చారు.

అనంతరం అనూష తల్లిదండ్రులకు లోకేశ్ వీడియో కాల్ చేసి మాట్లాడారు.

మరో ఆడబిడ్డకు అన్యాయం జరగకుండా పోరాడుతా, మీ న్యాయపోరాటానికి అండగా ఉంటానని లోకేశ్ హామీ ఇచ్చారు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+