మోడీకి ధీటుగా బదులిచ్చిన కానిస్టేబుల్, పునరాలోచన
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి ఓ పోలీసు కానిస్టేబుల్ ఇటీవల ధీటుగా బదులిచ్చారు! దీంతో, మోడీ తన భద్రత విషయంలో పునరాలోచన చేశారు! స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈ నెల 2న ఢిల్లీలోని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో మోడీ ప్రారంభించారు. ఆ సమయంలో పోలీస్ స్టేషన్‌ను శుభ్రం చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో స్టేషన్‌ను ఎందుకు శుభ్రంగా పెట్టుకోరు? అని మోడీ అక్కడి అధికారులను ప్రశ్నించారు.
దీంతో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. కానీ ఒక కానిస్టేబుల్ మాత్రం మోడీ ప్రశ్నకు ధైర్యంగా సమాధానం చెప్పాడు. మాలో (పోలీసుల్లో) ఎక్కువ మంది మీ భద్రతా విధులకే పరిమితమైతే శుభ్రం చేయడానికి ఇక్కడ ఎవరుంటున్నారని అన్నాడు. ఆ సమాధానంతో అధికారులు నిశ్ఛేష్టులయ్యారు. ఆ కార్యక్రమం ముగిశాక ప్రధాని అక్కడ నుంచి వెళ్లిపోయారు.

కానీ, కానిస్టేబుల్ సమాధానంతో ఈ విషయంపై ప్రధాని కార్యాలయం దృష్టి సారించింది. ఢిల్లీ పోలీసుల నుంచి వివరాలు తెలుసుకుంది. ఆ రోజు ఒక్క తీస్ జనవరి మార్గ్‌లోని ఒక్క బారికేడ్ వద్దే సుమారుగా 50 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. ప్రధాని పర్యటన నిమిత్తం సుమారుగా 500 మంది పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు.
దీంతో ఇలా భారీ సంఖ్యలో కాకుండా అవసరమైన మేరకే పోలీసులను భద్రతా విధులకు వినియోగించుకోవాలంటూ ఆ మరుసటి రోజే మార్గదర్శకాలు జారీ చేసింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటనల సమయంలో చొరవగా ప్రజల్లోకి వెళ్లి మాట్లాడడాన్ని ఇటీవలి పర్యటనలో గమనించిన ప్రధాని మోదీ దీనిపై దృష్టి పెట్టినట్లు సమాచారం.
కానీ, భద్రత పేరుతో ప్రజలకు అసౌకర్యం కలిగించరాదని, అవసరమైన మేరకే పోలీసులను విధులకు కేటాయించాలని ఢిల్లీ పోలీసులను ప్రధాని కార్యాలయం (పీఎంవో) ఆదేశించింది. ఓ కానిస్టేబుల్ సమాధానం వల్ల పీఎంవో స్పందించడం గమనార్హం.












Click it and Unblock the Notifications