దిగిపోవాల్సిందే, హిందీని రుద్దడం లేదు: వెంకయ్య
బెంగళూర్: తప్పుకోవాలని ఏడుగురు గవర్నర్లను హోంశాఖ కార్యదర్శి అడగడాన్ని గవర్నర్లపై దాడిగా కాంగ్రెసు అభివర్ణించడాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తప్పు పట్టారు. తాము ఎవరిపైనా దాడి చేయలేదని ఆయన స్పష్టం చేశారు.
ఎవరినా అడగదలుచుకున్నప్పుడు వారిని అడగాల్సిందేనని, వారు గవర్నర్లైనా, మాజీ గవర్నర్లైనా సరేనని ఆయన అన్నారు. రాజకీయంగా నియమితులైనవారు వ్యవస్థ ప్రయోజనం, ప్రజాస్వామ్య స్ఫూర్తి దృష్ట్యా స్వచ్ఛందంగా తప్పుకోవాల్సిందేనని వెంకయ్య నాయుడు అన్నారు. కొంత మంది కాంగ్రెసు మిత్రులు పాఠాలు చెప్పాలనుకుంటున్నారని, దాన్ని గవర్నర్లపై దాడిగా అభివర్ణిస్తున్నారని ఆయన అన్నారు.

అలా అంటున్నవారు ఆత్మపరిశీలన చేసుకోవాలని, వారేం చేశారో గుర్తు చేసుకోవాలని, వారు చేస్తే మంచిదీ ఇతరులు చేస్తే చెడ్డదా, ఇదేమిటని ఆయన అన్నారు. సమస్యలు తెచ్చిపెట్టకుండా రాజకీయంగా నియమితులైనవారు తప్పుకోవాలని ఆయన అన్నారు.
పట్టణాభివృద్ధి పనులను, ప్రత్యేకంగా బెంగళూర్ మెట్రో ప్రగతిని సమీక్షించడానికి బెంగళూర్ వచ్చిన వెంకయ్య నాయుడు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. హిందీన తాము బలవంతంగా రుద్దడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో తప్పుడు ప్రచారానికి ఒడిగడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రాంతీయ భాషలను ప్రోత్సహించాలని, వాటికి ప్రాముఖ్యం ఇవ్వాలని తాను భావిస్తానని ఆయన చెప్పారు. అదే ప్రభుత్వ విధానమని ఆయన చెప్పారు. హిందీ భాషను ఎవరూ ఎవరి మీదా రుద్డడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications