రాజకీయాలు మారిపోయాయి! కొత్త తరానికి రాహుల్ పిలుపు
భారత రాజకీయాలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో ప్రపంచ రాజకీయాలు మారిపోయాయన్నారు. మోడర్న్ సోషల్ మీడియాతో అంతా మారిపోయిందన్నారు. రాజకీయాల్లో కొత్త తరం రావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహించి భారత సమ్మిట్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
దేశ సమస్యలు తెలుసుకునేందుకు కన్యాకుమారి నుంచి సుమారు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశానన్నారు రాహుల్ గాంధీ. పాదయాత్ర మొదలుపెట్టక ముందు ఆలోచించాను.. మొదలుపెట్టాక వెనకడుగు వేయలేదని చెప్పారు. పాదయాత్ర మొదలు పెట్టాక చాలా మంది తనతో కలిసి నడవటం మొదలుపెట్టారన్నారు.

పాదయాత్రలో జనం సమస్యలు వినటం నేర్చుకున్నానని, ఇప్పుడు వారి సమస్యలు వినటంలో నాయకులు విఫలమయ్యారని రాహుల్ గాంధీ చెప్పారు. నిన్ననే భారత్ సమ్మిట్‌లో పాల్గొనాల్సి ఉన్నా.. కాశ్మీర్‌కు వెళ్లడం వల్ల రాలేకపోయానని తెలిపారు. గడిచిన పదేళ్లలో దేశంలో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. చట్టసభల్లో విపక్షాలకు మాట్లాడే అవకాశం కూడా రావడం లేదన్నారు.
విపక్షాలు తమ గొంతు వినిపించేందుకు కొత్త వేదికలు వెతుక్కోవాల్సి వస్తుందన్నారు. పాతతరం నాయకత్వం అంతరించిపోయిందని, రాజకీయాల్లోకి కొత్త తరం రావాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. కొత్త తరం భాషను రాజకీయ నాయకులు అర్థం చేసుకోవాలని రాహుల్ సూచించారు. కొత్త తరాన్ని ప్రోత్సహించాలి, యువ నేతలను తయారు చేయాలన్నారు రాహుల్ గాంధీ.
అంతకుముందు తెలంగాణ సీఎం రేవంత్ ఈ సదస్సులో ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలఆకాంక్షలు నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం అనేక పథకాలు తీసుకొచ్చామన్నరు.
దేశంలోనే అతిపెద్ద రుణమాఫీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, ఇప్పటికే రూ. 20 వేల కోట్లు రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ చెప్పారు. రైతు భరోసా కింద రూ. 12 వేలు ఇస్తున్నామన్నారు. వరికి మద్దతు ధరతోపాటు రూ. 500 బోనస్ ఇస్తున్నమని తెలిపారు. పట్టభద్రులు సర్టిఫికెట్ తీసుకుంటున్నారు కానీ, ఉద్యోగాలు లేవన్నారు. యువత కోసం రాజీవ్ యువ వికాసం పథకం తీసుకొచ్చామన్నారు. 56 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు.
ప్రజలకు ఏ సమయంలో ఏది అవసరమో కాంగ్రెస్‌కు బాగా తెలుసు అని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులను ఆహ్వానించామని, దావోస్ నుంచి లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చామన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.
యువత కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నామన్నారు. దేశానికి రూల్ మోడల్‌గా నిలిచే కులగణన చేపట్టామని సీఎం రేవంత్ చెప్పారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు. పదేళ్లలో తెలంగాణ ప్రజల కల నెరవేరలేదన్నారు. నిరుద్యోగులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.
తమ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు కార్పొరేట్ వైద్యం కోసం రూ. 10 లక్షలు ఇస్తున్నామన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజావాణి నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇటీవల ఎస్సీ వర్గీకరణ కూడా చేశామన్నారు. థర్డ్ జెండర్ ను పోలీస్ శాఖలో రిక్రూట్ చేసుకున్నామని తెలిపారు. తెలంగాణ తలసరి ఆదాయంలో టాప్‌లో ఉందని సీఎం రేవంత్ చెప్పారు. కాగా, ఈ సదస్సుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతోపాటు పలువురు రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు, విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications