వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బహుభార్యత్వం: 'అసహ్యమైన' సమస్యపై భారతీయ ముస్లిం మహిళల పోరాటం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ముస్లిం మహిళలు

ముస్లింలలో బహుభార్యత్వం ఆచారం ఉందన్న సంగతి తెలిసిందే. ఈమధ్య ఒక ముస్లిం మహిళ ఈ విషయమై కోర్టును ఆశ్రయించారు. తన రాతపూర్వక అనుమతి లేకుండా తన భర్త మరొక మహిళను వివాహం చేసుకోకూడదంటూ పిటిషన్ వేశారు. దాంతో, బహుభార్యత్వం అంశం మరోసారి వెలుగులోకి వచ్చింది.

28 ఏళ్ల రేష్మ తన పేరు వెనుక భర్త పేరు లేదా ఇంటి పేరు పెట్టుకోరు. బహుభార్యత్వం "తిరోగమనాన్ని" సూచిస్తుందని చెబుతూ, దీన్ని నిరోధించేందుకు ప్రభుత్వం చట్టాలు తీసుకువచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని దిల్లీ హై కోర్టుకు విజ్ఞప్తి చేశారామె.

కోర్టు పత్రాల ప్రకారం, రేష్మ 2019 జనవరిలో మొహమ్మద్ షోయబ్ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. తరువాతి సంవత్సరం వారికి బిడ్డ పుట్టింది. ఇంట్లో తన భర్త గృహ హింస, క్రూరత్వం, వరకట్న వేధింపులకు పాల్పడతాడని రేష్మ ఆరోపించారు. అయితే, షోయబ్ కూడా రేష్మపై ఇలాంటి ఆరోపణలే చేశారు.

షోయబ్, తనను, తన బిడ్డను విడిచిపెట్టి వేరే పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారని రేష్మ చెబుతున్నారు.

షోయబ్ చర్యలు "రాజ్యాంగవిరుద్ధం, షరియాకు వ్యతిరేకం, చట్టవిరుద్ధం, ఏకపక్షం, కఠినం, అమానవీయం, అనాగరికం" అని పేర్కొంటూ, "ముస్లిం మహిళల దుస్థితికి కారణమైన ఈ ఆచారాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని" రేష్మ అన్నారు.

కోర్టు ఈ కేసును, బహుభార్యత్వం చట్టబద్ధతను పరిశీలిస్తోంది. మరోవైపు, ఈ అంశం చర్చలకు తెరలేపింది.

బహుభార్యత్వం

'మహిళల పట్ల ఘోరమైన వివక్ష'

భారతదేశంలో ముస్లింలు, కొన్ని గిరిజన వర్గాలు మినహా బహుభార్యత్వం చట్టవిరుద్ధం.

ప్రపంచ జనాభాలో సుమారు 2 శాతం మహిళలు బహుభార్యత్వం ఉన్న కుటుంబాల్లో నివసిస్తున్నారని ప్యూ రీసెర్చ్ సెంటర్ ఒక నివేదిక (2019)లో తెలిపింది.

టర్కీ, ట్యునీషియా వంటి ముస్లిం-మెజారిటీ దేశాలు సహా ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ ఆచారాన్ని నిషేధించారు. అనుమతి ఉన్న దేశాల్లో దీన్ని విస్తృత స్థాయిలో నియంత్రిస్తున్నారు.

ఇది "మహిళల పట్ల ఘోరమైన వివక్ష, దీన్ని అనుమతించలేం" అని వ్యాఖ్యానిస్తూ, "ఈ ఆచారాన్ని కచ్చితంగా రద్దుచేయాలని" ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది.

కానీ, భారతదేశంలో రాజకీయంగా ఇదొక తాయిలం. ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ బీజేపీ 'యూనిఫాం సివిల్ కోడ్' (యూసీసీ) అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇదొక వివాదాస్పద చట్టం. దీని ప్రకారం, వివాహాలు, విడాకులు, వారసత్వం ఇకపై మతాల చేతుల్లో ఉండవు. అంటే మత నియమాల ప్రకారం జరగవు. ఇది దేశ పౌరులందరికీ వర్తించే చట్టం.

ప్రస్తుతం దేశంలో మతపరమైన విభజనలు రగులుకుంటున్న పరిస్థితుల్లో, ప్రభుత్వం తీసుకొచ్చే ఎలాంటి చట్టమయినా ముస్లింలు, ఇస్లాం మీద దాడిగా పరిగణించే అవకాశాలు ఉన్నాయి.

ముస్లిం మహిళలు

'ఖురాన్‌లో ఈ ఆచారం ఉందిగానీ దాన్ని ప్రోత్సహించదు'

"భారతదేశంలో ప్రతీ ముస్లిం పురుషుడికీ నలుగురు భార్యలు ఉంటారనేది సాధారణ అభిప్రాయం" అని మాజీ చీఫ్ ఎలక్షన్ కమీషనర్, ఇస్లాం పండితుడు ఎస్‌వై ఖురేషి అన్నారు.

ఎక్కువమంది భార్యలతో ఎక్కువమంది పిల్లల్ని కంటారని, అందువల్ల ముస్లింల సంఖ్య హిందువుల సంఖ్య కన్నా పెరిగిపోతుందని అనుకుంటారుగానీ అది నిజం కాదని ఆయన అన్నారు.

భారత జనాభాలో 14 శాతం ముస్లింలు, 80 శాతం హిందువులు ఉన్నారు.

ముస్లిం పురుషులు అధికంగా నలుగురు స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చు. ఈ బహుభార్యత్వం ఖురాన్‌లో ఉందని, కానీ దీన్ని ఆచరించాలంటే "కఠినమైన నియమాలు, పరిమితులు" పాటించాల్సి ఉంటుందని ఖురేషి తెలిపారు. వాటిని పాటించడం దాదాపు అసాధ్యమని అన్నారు.

"ఒక పురుషుడు ఇద్దరు, ముగ్గురు లేదా నలుగురు స్త్రీలను వివాహం చేసుకోవచ్చని ఖురాను చెబుతుంది. అయితే, వారు అనాథలు లేదా వితంతువులు అయుండాలి. వివాహం తరువాత భార్యలందరినీ సమానంగా చూడాలన్నది నియమం. ఇలా కాకపోతే ఖురాన్‌ను ఉల్లంఘించినట్టే లెక్క. భార్యలందరినీ సమానంగా ప్రేమించడం అన్నది ఆచరణాత్మకంగా దాదాపు అసాధ్యం. వాళ్లకి బట్టలు, వస్తువులు కొనివ్వడం కాదు. అంతకన్నా చాలా ఎక్కువ" అని ఖురేషి వివరించారు.

ఖురాన్‌లో బహుభార్యత్వం ఆచారాన్ని 7వ శతాబ్దంలో చేర్చారని ఖురేషి చెప్పారు. అరేబియాలో ఆదివాసీల మధ్య జరిగిన యుద్ధంలో వయసులో చిన్నవాళ్లైన పురుషులు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో, అనాథలు, వితంతువుల సంఖ్య పెరిగింది. వారందరికీ సహాయం చేయడానికి బహుభార్యత్వాన్ని ప్రవేశపెట్టారని వివరించారు.

"లేదంటే, ఖురాన్ ఈ ఆచారాన్ని ప్రోత్సహించదు. దీన్ని పాటించినవారిని చిన్నచూపు చూస్తుంది" అని చెప్పారు.

'పురుషాధిక్యతను, పితృస్వామ్యాన్ని సూచిస్తుంది'

ఇప్పుడు భారతదేశంలో యుద్ధం లాంటిదేమీ లేదని, "పురుషాధిక్యతను, పితృస్వామ్యాన్ని" సూచించే ఈ ఆచారాన్ని రద్దుచేయాలని జాకియా సోమన్ లాంటి మహిళా హక్కుల కార్యకర్తలు, విమర్శకులు అంటున్నారు. జాకియా సోమన్, ముంబైకు చెందిన భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ (బీఎంఎంఏ) వ్యవస్థాపకురాలు.

బహుభార్యత్వం అనేది "నైతికంగా, సాంఘికంగా, చట్టపరంగా అసహ్యమైన ఆచారం". కానీ, "దానికి చట్టబద్ధత ఉండడం సమస్యను మరింత జటిలం చేస్తోందని" జాకియా అభిప్రాయపడ్డారు.

"మగవాడికి ఒకరి కన్నా ఎక్కువమంది భార్యలు ఉండవచ్చని ఎలా చెప్పగలరు? కాలంతో పాటూ ఈ వర్గం కూడా మారాలి. ప్రస్తుత కాలంలో ఇది మహిళల గౌరవానికి సంబంధించిన సమస్య. మానవ హక్కుల తీవ్ర ఉల్లంఘన" అని జాకియా అన్నారు.

బీఎంఎంఏ 2017లో, బహుభార్యత్వ సంబంధాలలో ఉన్న 289 మంది మహిళలను సర్వే చేసింది. వారి శారీరక, మానసిక, భావోద్వేగ, ఆర్థిక స్థితిగతుల గురించి ప్రశ్నించింది. వారిలో 50 మంది కథనాలను ఒక నివేదికగా విడుదల చేసింది.

"వారు చాలా దారుణమైన, అన్యాయమైన పరిస్థితిలో చిక్కుకున్నారని, ఎంతో వేదన అనుభవిస్తున్నారని, కొంతమంది మానసిక ఆరోగ్యం దెబ్బతిందని మేం కనుగొన్నాం" అని జాకియా చెప్పారు.

బీఎంఎంఏ గతంలో ఇస్లాంలోని తలాక్ (తక్షణ విడాకులు) వ్యవస్థకు వ్యతిరేకంగా విస్తృత స్థాయిలో ప్రచారం చేసింది. బహుభార్యత్వాన్ని నిషేధించాలని కోరుతూ 2019లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ముస్లిం మహిళలు

'ముస్లింలలో బహుభార్యత్వం అరుదు, అదొక సమస్య కాదు'

అదే కాకుండా, మరి కొంతమంది కూడా బహుభార్యత్వాన్ని కోర్టులో సవాలు చేశారు. న్యాయవాది, బీజేపీ నేత అశ్విని కుమార్ దూబే కూడా కోర్టులో కేసు వేశారు.

దీనిపై సంప్రదాయవాద ముస్లింలు నిరసన వ్యక్తం చేశారు. ఇది తమ మత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడమేనంటూ ఆరోపించారు.

"ఇస్లాంలో చట్టాలు దైవికమైనవి. మేం దిశానిర్దేశం కోసం ఖురాన్, హదీసుల వైపు చూస్తాం. అల్లా చేసిన చట్టాన్ని మార్చే హక్కు మనిషికి లేదు" అని డాక్టర్ అస్మా జోహ్రా అన్నారు. ఆమె, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) మహిళా విభాగం అధిపతిగా వ్యవహరిస్తున్నారు. AIMPLB, దూబే పిటీషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించింది.

ముస్లింలలో బహుభార్యత్వం "అరుదు, అదొక సమస్య కాదని" అస్మా జోహ్రా అన్నారు. "మైనారిటీలకు వ్యతిరేకంగా బీజేపీ మెజారిటేరియన్ ఎజెండాను అనుసరిస్తోందని" ఆమె ఆరోపించారు.

"మీరెప్పుడైనా నలుగురిని పెళ్లి చేసుకున్న ముస్లింను చూశారా? 2022వ సంవత్సరంలో ఒక భార్యను పోషించడమే కష్టంగా ఉందని, నలుగురిని ఎక్కడ పోషించగలమని చాలామంది పురుషులు అంటున్నారు. ముస్లిం కమ్యూనిటీలో బహుభార్యత్వం రేటు చాలా తక్కువ" అని అస్మా జోహ్రా అన్నారు.

అన్ని మతాలలో బహుభార్యత్వం ప్రబలంగా ఉన్నట్లు చూపిస్తున్న డేటా ఆధారంగా ఆమె ఈ వాదన చేశారు. 1961 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలో 1,00,000 వివాహాలను శాంపిల్‌గా తీసుకుని జరిపిన సర్వేలో ముస్లింలలో బహుభార్యత్వం 5.7 శాతం ఉందని, మిగతా వర్గాలతో పోలిస్తే కనిష్ట స్థాయిలో ఉందని తేలింది.

తరువాత వచ్చిన జనాభా లెక్కల్లో ఈ అంశం గురించి ప్రస్తావించలేదు. తాజా డేటా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్‌హెచ్ఎస్-3) 2005-06లో వచ్చింది. అన్ని మతాల్లోనూ బహుభార్యత్వం చాలా తగ్గిపోయిందని ఈ డేటా చెబుతోంది.

"ఇది కూడా పాత డాటానే. అందుకే మనం తాజా ట్రెండ్స్ చూడాలి. 1903ల నుంచి 1960ల మధ్య జనాభా లెక్కలు చూస్తే, అన్ని కమ్యునిటీల్లో బహుభార్యత్వం స్థిరంగా క్షీణిస్తూ వచ్చింది. ముస్లింలలో అతితక్కువ ఉంది" అని ఖురేషి అన్నారు. కానీ, ఎన్ఎఫ్‌హెచ్ఎస్ అధ్యయనం కొంత వేరుగా ఉందని అన్నారు.

ముస్లింలు

'ఈ ఆచారాన్ని పెద్దగా పాటించనప్పుడు, రద్దు చేస్తే ఏం నష్టం?'

ఖురేషి 2021లో 'ది పాపులేషన్ మిత్: ఇస్లాం, ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ పాలిటిక్స్' అనే పుస్తకం రాశారు. అందులో, బహుభార్యత్వాన్ని నిషేధించాలనే డిమాండ్ చేయాలని ఖురేషి ముస్లిం సమాజానికి పిలుపునిచ్చారు.

"ఈ ఆచారాన్ని పెద్దగా పాటించనప్పుడు, రద్దు చేస్తే ఏం నష్టం?" అంటారాయన.

అయితే, అందుకు మతపరమైన, రాజకీయ కారణాలు ఉన్నాయంటారు డాక్టర్ జోహ్రా.

"ముస్లింలు చాలా కఠినంగా ఉంటారని అందరూ అంటారు. కానీ, ఆ ఆచారం ఖురాన్‌లో ఉంది. దాన్ని ఎవరూ మార్చలేరు. ఈశాన్య రాష్ట్రాల్లో చాలా గిరిజన వర్గాల్లో బహుభార్యత్వం ఉంది. కానీ, వారిని ఎవరూ లక్ష్యంగా చేసుకోరు. మరి, మమ్మల్నే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు? ఇదంతా ఇస్లామోఫోబియాలో భాగం" అని జోహ్రా అంటారు.

బహుభార్యత్వం గురించి చర్చలు, కేసులు పెట్టడం తమ కమ్యూనిటీపై దాడి అని, తమ "వ్యక్తిగత మత నియమాల్లో జోక్యం చేసుకోవడం" అని ఆమె వాదిస్తున్నారు.

అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ఏ చట్టం తీసుకొచ్చినా ముస్లింలు అనుమానంగా చూస్తున్నారని జాకియా సోమన్ అంగీకరించారు.

"మన ఇంటిని ముందు మనమే చక్కదిద్దుక్లోవాలి. లేదంటే ఇతరులు ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు. వాళ్లకి ఏమైనా ఎజెండాలు ఉండవచ్చు. ఏది ఏమైనా బహుభార్యత్వం మహిళా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. దాన్ని కచ్చితంగా నిషేధించాల్సిందే" అన్నారు జాకియా.

గమనిక: డేటా విశ్లేషణ, గ్రాఫిక్స్ షాదాబ్ నాజ్మీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Polygamy: The struggle of Indian Muslim women over the 'unhealthy' issue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X