కేంద్రమంత్రి కనబడుటలేదు!: వెలసిన పోస్టర్లు
పాట్నా: భారతీయ జనతా పార్టీ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కనబడుటలేదు. ఈ మేరకు తెలుపుతూ ఆయన గెలిచిన బీహార్ రాష్ట్రంలోని నెవడా పార్లమెంటరీ నియోజకవర్గంలో అనేక పోస్టర్లు వెలిశాయి. తమ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదంటూ అక్కడి ప్రజలు ఇలా పోస్టర్లు వేయించారు.
వివరాల్లోకి వెళితే.. నెవడా నియోజకవర్గం నుంచి 2014లో గిరిరాజ్ సింగ్ లోక్‌సభకి ఎన్నికయ్యారు. అయితే అప్పటినుంచి ఆయన నియోజకవర్గంలో ఒక్కసారి కూడా పర్యటించలేదు. అంతేగాక, తన ఎంపీ నిధుల నుంచి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేపట్టలేదు.

ఈ నేపథ్యంలో నెవడా నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ‘మంత్రిగారు కనబడుటలేదు' అంటూ పోస్టర్లు అతికించారు. తమ సమస్యలను పట్టించుకోవట్లేదని.. పోస్టర్లలో పేర్కొన్నారు.
నియోజక వర్గంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా అందులో రాశారు. గతంలో వివిధ అంశాలపై వ్యాఖ్యానించి వివాదాల్లో చిక్కుకున్న గిరిరాజ్‌సింగ్‌కు తాజాగా నియోజకవర్గంలో వెలసిన ఈ పోస్టర్లు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి.












Click it and Unblock the Notifications