వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రహ్లాద్ సింగ్ రాజ్‌పుత్: పాకిస్తాన్ జైల్లో 24 ఏళ్లు ఉన్న వ్యక్తి చివరికి స్వదేశానికి ఎలా చేరుకున్నారంటే...

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాకు చెందిన ప్రహ్లాద్ సింగ్ రాజ్‌పుత్, పాకిస్తాన్ జైల్లో 24 ఏళ్లున్న తర్వాత తిరిగి తన ఇంటికి చేరుకున్నారు.

bbc

కానీ, ఆయన పాకిస్తాన్ ఎలా చేరుకున్నాడు అనేది, ఇప్పటికీ ఒక చిక్కు ప్రశ్నగా ఉండిపోయింది. ఆయన తిరిగి స్వదేశానికి చేరుకోవడంలో కూడా ఎన్నో మలుపులు ఉన్నాయి.

ప్రహ్లాద్ కుటుంబ సభ్యులు, గ్రామస్థుల వివరాల ప్రకారం ప్రహ్లాద్ సింగ్ మానసిక స్థితి సరిగా లేదు. ఆయన 1988లో హఠాత్తుగా కనిపించకుండా పోయారు. రెండు దశాబ్దాలకు పైగా గడిచాక 2021 ఆగస్టు 31న ఆయన పాకిస్తాన్ నుంచి తన గ్రామానికి చేరుకున్నారు.

ప్రహ్లాద్‌ను తిరిగి ఇల్లు చేర్చడానికి ఆయన కుటుంబ సభ్యులు, స్థానిక పోలీసులు, అధికారులు, సామాజిక కార్యకర్తలు రెండేళ్లకు పైగా ఎన్నో ప్రయత్నాలు చేశారు.

ఇప్పటికీ ఇక్కడ అందరికీ అంతుపట్టని రహస్యం ఒకటే. ఆయన పాకిస్తాన్ ఎలా చేరారు.

సాగర్ నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌర్‌ఝమర్ ప్రాంతంలో ఘోసీ పట్టి గ్రామం ఉంది. నేషనల్ హైవేకు ఇది దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ప్రహ్లాద్ సింగ్ రాజ్‌పుత్ ఈ ఊరి నుంచే కనిపించకుండా పోయారు. అప్పుడు ఆయన వయసు 33 ఏళ్లు.

ఆ సమయంలో అక్కడ మంచి రోడ్లుగానీ, మెరుగైన రవాణా సౌకర్యాలు గానీ లేవు. అయినా ప్రహ్లాద్ సరిహద్దు దాటి పాకిస్తాన్ చేరుకున్నారు.

ప్రహ్లాద్ ఏదైనా చెప్పే స్థితిలో లేకపోవడంతో ఆయన అక్కడకు ఎలా చేరుకున్నాడనేది ఇంకా రహస్యంగా ఉండిపోయింది.

ప్రహ్లాద్ పాకిస్తాన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మేం ఆయన్ను కలవడానికి ఆయన తమ్ముడి ఇంటికెళ్లాం. ప్రహ్లాద్ మాతో ఏం మాట్లాడలేకపోయారు. మీరు పాకిస్తాన్ ఎలా చేరుకున్నారని అడిగితే ఆయన నవ్వుతూ ఉండిపోయారు.

ప్రహ్లాద్ పాకిస్తాన్ ఎలా చేరుకున్నారనేది ఆయన కుటుంబ సభ్యులకు కూడా తెలీడం లేదు.

"అన్నయ్య అక్కడికి ఎలా చేరుకున్నారనే విషయం మాకు తెలీడం లేదు. అడిగినా ఏదీ చెప్పలేకపోతున్నారు. ఆయన మానసిక స్థితి మొదటి నుంచీ సరిగా లేదు. అందుకే దాని గురించి ఆయన్ను అడగడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు" అని ఆయన తమ్ముడు వీర్ సింగ్ రాజ్‌పుత్ చెప్పారు.

"అప్పట్లో ఆ ప్రాంతం నుంచి ఉల్లిపాయలు, టమాటా పాకిస్తాన్‌కు ఎగుమతి చేసేవారని, వాటిని ట్రక్కుల్లో సరిహద్దు వరకూ తీసుకెళ్లేవారని చాలా మంది చెప్పారు. అయన ఆ ట్రక్కుల్లో అక్కడికి వెళ్లిపోయుండచ్చు లేదా డ్రైవర్ ఎవరైనా తన పని చేయించుకోడానికి ఆయన్ను కూర్చోపెట్టుకుని ఉండచ్చు, అలా ఆయన సరిహద్దులు దాటుండచ్చు" అన్నారు.

పాకిస్తాన్‌లో ఉన్నాడనే సమాచారం 2014లో తెలిసింది

ప్రహ్లాద్ పాకిస్తాన్‌లో ఉన్న విషయం ఆయన కుటుంబానికి మొదట 2014లో తెలిసింది. అప్పుడు పోలీసులు ఆయన తల్లి గులాబ్ రాణీని ఆయన గురించి అడిగి తీసుకున్నారు.

తల్లి గులాబ్ రాణి చనిపోయేలోపు ఒక్కసారైనా పెద్ద కొడుకును చూడాలనుందని అనేవారని ప్రహ్లాద్ తమ్ముడు చెప్పారు.

కానీ 2016లో ఆమె చనిపోయారు. మొత్తం ఎవిమిది మంది సంతానంలో ప్రహ్లాద్ నాలుగో వాడు. ఆయనకు ముగ్గురు సోదరులు, ముగ్గురు సోదరిలు ఉన్నారు. వారిలో ఒక సోదరుడు చనిపోయారు. తమకు ఉన్న కొంత పొలాన్ని సాగు చేస్తూ, చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఈ కుటుంబం జీవిస్తోంది.

ప్రహ్లాద్ 24 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ నుంచి తిరిగి రావడంతో ఆయన స్వగ్రామం ఘోసీ పట్టీలో ఆగస్టు 31న పండుగ వాతావరణం కనిపించింది.

పాకిస్తాన్- భారత్ మధ్య సంబంధాలు సరిగా లేకపోవడంతో పాకిస్తాన్ జైల్లో ఉండి వచ్చిన ఆయన ఎలా ఉన్నారో చూడాలని చాలా మంది జనం వచ్చారు.

స్థానిక నేతలు ప్రహ్లాద్‌ను కలవాడనికి వస్తున్నారు. అయితే, స్థానిక మీడియా ప్రహ్లాద్ చెప్పారంటూ కొన్ని విషయాలు కూడా ప్రచురిస్తోంది.

ప్రహ్లాద్ ఎలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్‌లో ఉండేవారో, అక్కడి అధికారులు ఆయనతో ఎలా ప్రవర్తించారో మీడియా చెబుతోంది. కానీ, కుటుంబ సభ్యులు మాత్రం ఆయన ఏం మాట్లాడలేకపోతున్నారని అంటున్నారు.

ఆగస్టు 30న ప్రహ్లాద్‌ను పాకిస్తాన్ జైలు నుంచి విడుదల చేసిన అధికారులు ఆరోజు సాయంత్రం 5.10కి వాఘా-అటారీ బోర్డర్‌లో భారత సైన్యానికి అప్పగించారు. ఆ తర్వాత సాగర్ జిల్లా పోలీస్ అధికారులు ఆయన్నుతమ్ముడు వీర్ సింగ్‌కు అప్పగించారు.

రికార్డుల కోసం గాలింపు

ఆయన్ను తిరిగి తీసుకురావడం కూడా ఒక సుదీర్ఘ ప్రక్రియగా నిలిచింది. అది 2019లో మొదలైంది. పాకిస్తాన్‌లో ఉన్నట్లు తెలీగానే, కుటుంబ సభ్యులు ఆయన్ను తిరిగి తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

స్కూల్లో ఆయన పాత రికార్డులు బయటకు తీయించారు. ప్రహ్లాద్ మూడో తరగతి వరకూ చదువుకున్నారు. స్కూలు రికార్డుల్లో ఆయన మార్క్ షీట్ అధికారులకు పంపించారు.

ఘోసీ పట్టీలోని ప్రాథమిక పాఠశాలలో ప్రహ్లాద్ 1974-75లో చదువుకున్నారు.

"అంత పాత రికార్డ్ తీయడం అంత సులభం కాదు. కానీ, రికార్డ్ దొరికింది. ఆయన్ను తిరిగి తీసుకురావడానికి కుటుంబ సభ్యులకు ఆ పత్రాలు ఉపయోగపడ్డాయి" అని ఆ స్కూల్ టీచర్ కమలేష్ మిశ్రా చెప్పారు.

గ్రామస్థులు ఆయన్ను వల్ల తాము చాలా ఇబ్బంది పడ్డామని చెబుతుంటారు.

"ఆయన షాపులోకి వచ్చి రకరకాల ఇబ్బందులు సృష్టించేవాడు. అప్పుడు కూడా తన మానసిక స్థితి సరిగా ఉండేది కాదు" అని గ్రామంలో మంగలి షాపున్న గజోధర్ సేన్ చెప్పారు.

ప్రహ్లాద్ తిరిగి రావడం ఆయన కుటుంబానికి మంచి విషయమే అని గౌర్‌ఝమర్‌లో ఉంటున్న దీపక్ విశ్వకర్మ చెప్పారు.

"ఆయన సరిగా మాట్లాడలేరు, ఏదీ అర్థం చేసుకోలేరు. అయినా, ఆయన పాకిస్తాన్ జైలు నుంచి తిరిగి ఇంటికి చేరుకోగలిగాడు" అన్నారు.

తిరిగి రావడం సులభంగా జరగలేదు

ఈ కేసుకు సంబంధించి చాలా రోజులు సంప్రదింపులు జరిగాయని గౌర్‌ఝమర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అరవింద్ సింగ్ ఠాకూర్ చెప్పారు.

"మమ్మల్ని అప్పుడప్పుడూ ఇక్కడ నుంచి పత్రాలు పంపించమని చెప్పేవారు. పాకిస్తాన్‌లో ఉన్న వ్యక్తి, ఈ ప్రాంతం నుంచి కనిపించకుండా పోయిన ప్రహ్లాదేనా, కాదా అనేది వారు తెలుసుకోవాలని అనుకునేవారు" అన్నారు.

మా ఎస్పీకి నేరుగా ఏంబసీతో కమ్యూనికేషన్ ఉండేది. అక్కడ నుంచి మెయిల్ ద్వారా సంప్రదింపులు జరిగేవి. ఆయన నిరంతరం పాకిస్తాన్‌లోని రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండేవారు అన్నారు.

ఎస్పీ గౌర్‌ఝమర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జినే దీనికి నోడల్ ఏజెన్సీగా చేశారు. పోలీసులకు కూడా ఇది ఒక సుదీర్ఘ ప్రక్రియగా మారింది.

తాము ఏ ప్రహ్లాద్ సమాచారం పంపిస్తున్నామో అది నిజంగా అతడేనా లేక వేరేవాళ్లా అనే విషయం వాళ్లకు కూడా తెలీదు. కానీ, చివరికి అది ప్రహ్లాదే అని వాళ్లకు నమ్మకం కలిగింది.

అయితే, ప్రహ్లాద్‌ స్వస్థలం మధ్యప్రదేశ్‌కు చెందిన సాగర్ అనే విషయం పాకిస్తాన్‌లో ఎలా తెలిసింది. సాగర్ ఎస్పీ అతుల్ సింగ్ దానికి సమాధానం ఇచ్చారు.

"జైల్లో విచారణ సమయంలో ఆయన సాగర్ పేరు చెప్పారు. ఆ తర్వాత అక్కడి ప్రభుత్వం భారత ప్రభుత్వానికి ఆ సమాచారం పంపించింది. ఆ తర్వాత మేం సాగర్ నుంచి కనిపించకుండా పోయిన వారిలో ప్రహ్లాద్ అనే పేరున్న వారిని వెతికాం" అని చెప్పారు.

అధికారులు ఏం చెప్పారు

ప్రహ్లాద్‌ను వీలైనంత త్వరగా విడిపించడానికి, తాను నిరంతరం భారత ప్రభుత్వ ఏజెన్సీలను సంప్రదించేవాడినని, వాళ్లు ఏ సమాచారం అడిగితే అది వెంటనే అందించేవాడినని ఎస్పీ అతుల్ సింగ్ చెప్పారు.

మరోవైపు పాకిస్తాన్‌లో భారత్‌కు చెందిన ఎవరైనా చిక్కుకుపోతే, వారిని అక్కడి నుంచి త్వరగా తీసుకురావడం అంత సులభం కాదని సామాజిక కార్యకర్త సయ్యద్ ఆబిద్ హుస్సేన్ చెప్పారు.

ఆబిద్ విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు తిరిగి స్వదేశానికి చేరుకోవడానికి సాయం అందిస్తుంటారు.

పాకిస్తాన్ సహా గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన ఎంతోమందిని ఆయన తిరిగి స్వదేశానికి చేర్చగలిగారు.

"పాకిస్తాన్‌లో ఒక వ్యక్తి పట్టుబడినప్పుడు, అక్కడి ప్రభుత్వం మొదట వారిని గూఢచారిగా భావిస్తుంది. తర్వాత వారు తమను తాము నిర్దోషిగా నిరూపించుకోవడానికే చాలా సమయం పడుతుంది" అంటారు ఆబిద్.

"మొదట్లో పాకిస్తాన్ సరిహద్దుల్లో కంచె ఉండేది కాదు. దాంతో, జనం దారితప్పి ఆ దేశంలోకి వెళ్లిపోయేవారు. అక్కడ నుంచి ఎవరినైనా విడిపించి తీసుకురావడం కష్టం. మిగతా దేశాల నుంచి తీసుకురావడం చాలా సులభం" అని ఆయన చెప్పారు.

అలాంటప్పుడు పాకిస్తాన్ అధికారులకు తాను నిర్దోషి అని ప్రహ్లాద్ ఎలా నమ్మకం కగిలించాడు. అది మనం ఊహించుకోవాల్సిందే.

ఆబిద్ ఇప్పటివరకూ పాకిస్తాన్ నుంచి సునీల్ ఉయీకే, జితేంద్ర అర్జున్‌వార్‌ లాంటి వారిని విజయవంతంగా భారత్ చేర్చగలిగారు. ప్రస్తుతం అక్కడ ఉన్న రాజూ లక్ష్మణ్ అనే వ్యక్తిని తిరిగి స్వదేశానికి తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు.

భారత్‌కు చెందిన ఎవరైనా పాకిస్తాన్‌లో ఉన్నాడని తెలీగానే ఆబిద్ మొదట ఇస్లామాబాద్‌లోని భారత హై-కమిషనర్‌కు లేఖ రాసి, వారి గురించి చెబుతారు. ఆ తర్వాత సాధారణంగా హై-కమిషనర్ అక్కడి ప్రభుత్వ అధికారులతో మాట్లాడతారు. ఆ తర్వాత రెండు దేశాల నిబంధనల ప్రకారం కేసు ముందుకు వెళ్తుంది.

"పాకిస్తాన్‌లో ఎవరైనా పట్టుబడినప్పుడు సరైన పత్రాలు లేకపోవడం, అక్రమంగా ప్రవేశించిన నేరాలకు వారికి నాలుగేళ్ల శిక్ష విధిస్తారు. దాదాపు ప్రతి ఒక్కరూ ఆ శిక్షకాలం పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే వారిని తిరిగి పంపించడం గురించి చర్చలు మొదలవుతాయి" అని ఆబిద్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Prahalad Singh Rajput the man who was a prisoner for 24 years in Pak finally reached India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X