తూగో ప్రమాదం: ప్రణబ్ దిగ్భ్రాంతి, మోడీ ఎక్స్‌గ్రేషియా
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలంలో నగరం గ్రామంలో గ్యాస్ పైప్‌లైన్ పేలి భారీ శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి ప్రణబ్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రమాదం జరిగిన విషయం తెలియగానే ప్రణబ్ ముఖర్జీ గవర్నర్ నరసింహన్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. పేలుడు వల్ల పది అడుగుల గొయ్యి పడిందని తెలిసి ఆయన దిగ్భ్రాంతికి లోనయ్యారు. బాధిత కుటుంబాలకు అందరు అండగా ఉండాలన్నారు. క్షతగాత్రులకు వైద్య సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా పాల్గొంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని
ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. అలాగే గాయపడ్డ వారి కుటుంబాలకు రూ.50,000లు ఇస్తామని తెలిపారు. దీనిని ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుండి ఇస్తారు. కాగా, బాధిత కుటుంబాలకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇస్తుంది. వారితో పాటు ప్రధాని రిలీఫ్ ఫండ్ నుండి కూడా ఇవ్వనుందని పీఎంవో తెలిపింది. సామాజిక వెబ్ సైట్లలో నరేంద్ర మోడీ తన సంతాపం తెలియజేశారు.
కాగా, శుక్రవారం ఉదయం ఓఎన్‌జీసీ గ్యాస్ కనెక్టింగ్ స్టేషన్ సమీపంలోని గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలడంతో మంటల్లో చిక్కుకుని 14 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని స్థానికులు వ్యక్తపరుస్తున్నారు. పలువురు గాయపడ్డారు.












Click it and Unblock the Notifications