అల్లుడా మజకా: కాంగ్రెస్ కు షాక్: 9 కోట్ల పాతనోట్లు సీజ్, మాకు తెలీదు !
బెంగళూరు: రద్దు అయిన పాత రూ. 1,000, రూ. 500 నోట్లు మార్చడానికి ప్రయత్నించిన దందా సభ్యులను బెంగళూరు సిటి క్రైం బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీరణ్ణ మత్తికట్టి అల్లుడు ప్రవీణ్ కుమార్ (43)తో సహ 14 మందిని సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుల నుంచి రూ. 9.1 కోట్ల విలువైన పాత నోట్లు స్వాధీనం చేసుకున్నామని బెంగళూరు సీసీబీ పోలీసులు తెలిపారు. అర్దరాత్రి బెంగళూరులోని శంకరపుర సమీపంలోని మరాఠ హాస్టల్ దగ్గర నజుండ అనే వ్యక్తి కారు నిలిపాడు.
అదే సమయంలో అటువైపు వెళ్లిన సీసీబీ పోలీసులకు అనుమానం వచ్చి కారులో పరిశీలించారు. కారులో రూ. 3 కోట్ల విలువైన పాతనోట్లు కనపడటంతో పోలీసులు నంజుండను అదుపులోకి తీసుకుని విచారించడంతో మొత్తం విషయం బయటపడింది.

నిందితులు తెలిపిన వివరాల మేరకు బెంగళూరులోని బెన్సన్ టౌన్ లోని ఇంటి మీద దాడి చేసి మిగిలిన మొత్తం నగదు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. ధారవాడకు చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి గత మూడు సంవత్సరాల నుంచి బెంగళూరులోని బెన్సన్ టౌన్ లో నివాసం ఉంటున్నాడు.
అరెస్టు అయిన ప్రవీణ్ కొన్ని రోజుల క్రితం నాగరబావికి చెందిన ఉమేష్ అనే పారిశ్రామిక వేత్తను కలిసి మీ దగ్గర ఉన్న పాత నోట్లను రూ. 58 శాతం కమిషన్ పద్దతిలో కొత్తనోట్లుగా మార్చి ఇస్తామని నమ్మించి రూ. 9.1 కోట్ల పాత నోట్లు తీసుకున్నాడు.
తరువాత విదేశాల నుంచి వస్తున్న ప్రవాస భారతీయుడు (ఎన్ఆర్ఐ)కి పాత నోట్లు ఇవ్వడానికి ప్రయత్నించారని పోలీసులు చెప్పారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీరణ్ణ మత్తికట్టి మీడియాతో మాట్లాడారు.
తాను ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నానని, గత ఆరు నెలల నుంచి తనకు తన అల్లుడికి ఎలాంటి సంబంధం లేదని, మేము అసలు మాట్లాడుకోవడం లేదని వివరించారు. మొత్తం మీద వీరణ్ణ మత్తికట్టి అల్లుడు పాతనోట్ల మార్పిడి కేసులో పోలీసులకు చిక్కిపోవడంతో బీజేపీ నాయకుల చేతికి అస్త్రం చిక్కింది.












Click it and Unblock the Notifications