ముగిసిన సీబీఐ డైరెక్టర్ జైస్వాల్ పదవీ కాలం
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ.. సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ పదవీకాలం నేటితో ముగియనుంది. మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఆయన. జైస్వాల్ స్థానంలో కర్ణాటక కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ మధ్యాహ్నం ప్రవీణ్ సూద్.. ఛార్జ్ తీసుకునే అవకాశం ఉంది.
ఇంతకుముందు ప్రవీణ్ సూద్- కర్ణాటక పోలీస్ డైరెక్టర్ జనరల్ పని చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన కమిటీ కొత్త సీబీఐ డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్‌ను ఇదివరకే ఎంపిక చేసిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ సుధీర్ కుమార్ సక్సేనా, ఢిల్లీ అగ్నిమాపక, హోమ్ గార్డ్స్ డైరెక్టర్ జనరల్ తాజ్ హస్సన్ పేర్లను కూడా పరిశీలించింది ఈ కమిటీ. ప్రవీణ్ సూద్ వైపే మొగ్గు చూపింది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే కేంద్రం ఆయనను కీలకమైన సీబీఐ డైరెక్టర్‌గా అపాయింట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 1986 బ్యాచ్, కర్ణాటక కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్.. రెండు సంవత్సరాల పాటు సీబీఐ డైరెక్టర్‌గా కొనసాగుతారు. 2025 మే 25వ తేదీ వరకు అదే హోదాలో ఉంటారు.
ప్రవీణ్ సూద్ స్వస్థలం హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా. ఐఐటీ-ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం సివిల్స్‌కు ఎంపికయ్యారు. మైసూరు, బళ్లారి, రాయచూర్ జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. బెంగళూరు సిటీ డీసీపీగా వ్యవహరించారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. 2020లో కర్ణాటక డీజీపీగా అపాయింట్ అయ్యారు.
ప్రస్తుతం సీబీఐ అనేక కీలక కేసులపై దర్యాప్తు కొనసాగిస్తోంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం, ఢిల్లీ మద్యం కుంభకోణం..వంటి రాజకీయాలతో ముడిపడి ఉన్న కేసులపై దర్యాప్తుతో పాటు తరచూ మెరుపుదాడులను నిర్వహిస్తోంది. ఈ పరిణామాల మధ్య ప్రవీణ్ సూద్- సీబీఐ కొత్త డైరెక్టర్‌గా అపాయింట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications