మైనారిటీ ముద్ర తొలగించాలి: హిందూరాష్ట్ర భారత్: ప్రధాని కూడా అడ్డుకోలేరు: ధర్మసంసద్
న్యూఢిల్లీ: దేశంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటంతో- ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తి రేపుతోంది. అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ కూడా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోండటంతో అందరి దృష్టీ దీనిపైనే పడింది. ఉత్తర ప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌లల్లో ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించడానికి ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది.
Recommended Video
తొలిదశ ఫిబ్రవరి 10వ తేదీన ఆరంభమౌతుంది. చివరి దశ పోలింగ్ మార్చి 7న ఉంటుంది. అదే నెల 10వ తేదీన ఓట్ల లెక్కింపును నిర్వహించేలా షెడ్యూల్‌ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఉత్తర ప్రదేశ్‌లో ఏడు దశల్లో పోలింగ్ ఉంటుంది. ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో మొత్తంగా 15,05,82,750 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. దీనికోసం ఎన్నికల అధికారులు 1,74,351 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అధికారం ఎవరిని వరిస్తుందనేది అదే నెల 10వ తేదీన తేటతెల్లమౌతుంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, కాంగ్రెస్ భవితవ్యం ఏమిటనేది ఆ రోజే స్పష్టమౌతుంది.

ఈ పరిణామాల మధ్య ఎన్నికల వేడి మరింత రాజుకునేలా ప్రయాగ్‌రాజ్ ధర్మసంసద్- కొన్ని కీలక తీర్మానాలను చేసింది. ఇకపై భారత్‌ను హిందూ రాష్ట్రగా పిలవాలంటూ డిమాండ్ చేసింది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన పలు పీఠాధిపతులు, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు ఈ ధర్మసంసద్‌లో పాల్గొన్నారు. మూడురోజుల పాటు సాగే ఈ సభ శనివారం ఆరంభమైంది. ఇదివరకు హరిద్వార్ ధర్మసంసద్ తరహాలోనే ఇక్కడ కూడా కొందరు హిందూ ప్రతినిధులు వివాదాస్పద ప్రకటనలు చేశారు.
భారత్.. హిందూ రాష్ట్రగా ఆవిర్భవించడాన్ని ప్రధాని గానీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి గానీ అడ్డుకోలేరని తేల్చి చెప్పారు. దేశం ఖచ్చితంగా హిందూరాష్ట్రంగా మారుతుందని అన్నారు. దేశంలో ముస్లింలకు ఉన్న మైనారిటీ అనే హోదాను తొలగించాలని హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులు మైనారిటీల ఓటుబ్యాంకు, రాజకీయాల కోసమే ఈ హోదాను కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ముస్లింలపై ఉన్న అల్పసంఖ్యాకులు అనే పేరు కొనసాగించడం సరికాదని అన్నారు.
భారత్‌లో ఎవరూ మైనారిటీలు కారని తేల్చి చెప్పారు. దేశం ముందు ప్రతి ఒక్కరూ సమానమేనని అన్నారు. దేశ ప్రజలందరికీ సమ న్యాయం, సమాన చట్టం, సమాన అధికారాలను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. మైనారిటీల పేరుతో ఒక వర్గం ప్రజలకు ప్రత్యేక అధికారాలను ఇవ్వడం సమంజసం కాదని, ఈ పేరును తొలగించాలని అన్నారు. ఆయా అంశాలన్నింటి పట్లా తాము ధర్మ సంసద్‌లో ప్రస్తావిస్తామని, తీర్మానాలు చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications