కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఈ స్వామిజీ చెప్పిందే నిజమైంది: నాలుగు నెలల ముందే తేల్చారు
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకే స్పష్టమైన మెజార్టీ వచ్చిన విషయం తెలిసిందే. అయితే, మెజార్టీ ఓపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ కూడా కర్ణాటక రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని పేర్కొన్నాయి. అయితే, ఒక స్వామిజీ మాత్రం కర్ణాటక ఎన్నికల ఫలితాలను నాలుగు నెలల ముందే స్పష్టతనిచ్చేశారు. ఆయన చెప్పినట్లుగానే ఫలితాలు కూడా ఉండటం గమనార్హం. దీంతో ఆయన చెప్పిన జోస్యం చర్చనీయాంశంగా మారింది.
జోస్యం చెప్పడంలో కర్ణాటక రాష్ట్రంలోని కోడిమఠం పీఠాధికారి డాక్టర్ శివానంద శివయోగి రాజేంద్ర మహాస్వామీజీ అలియాస్ కోడిమఠం శ్రీగలు పేరు పొందారు. ఆయన ఏం చెబితే అది జరిగి తీరుతుందని ప్రజల నమ్మకం. గతంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతాయని చెప్పారు. అది జరిగింది. తాజాగా కర్ణాటక ఎన్నికలపై కూడా ఆయన చెప్పిందే నిజమైంది.

కర్ణాటక ఎన్నికల్లో ఒకే పార్టీకి మెజారీటీ వస్తుందని శివానంద శివయోగి రాజేంద్ర మహాస్వామీజీ ప్రవచించారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉండదని నాలుగు నెలల ముందే తేల్చి చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన చెప్పినట్లే జరిగింది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చింది. ఆ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
కాగా, కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ సీట్లు సాధించి అధికారం ఖాయం చేసుకుంది. 224 సీట్లు కలిగిన కర్ణాటక అసెంబ్లీలో 136 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 65 స్థానాలతో రెండో స్థానంలో బీజేపీ, 19 స్థానాలు దక్కించుకున్న జేడీఎస్ మూడో స్థానంలో నిలిచాయి.
కాగా, కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి ఎవరు అవుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సీఎం పదవి కోసం పోటీపడుతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని తానై పార్టీని గెలిపించిన శివకుమార్‌కే సీఎం పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, దీనిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేపు అంటే ఆదివారంరోజున నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications