ఈ నెల 13న నామినేషన్ వేయనున్న ప్రధాని మోదీ..
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేడీ కొనసాగుతుంది. ఇప్పటికే పలు పార్టీలు తమ ప్రచారాలతో ఫుల్ బిజిగా మారిపోయాయి. కొందరు నేతలు ఇప్పటికే నామినేషన్లను కూడా వేసేశారు. ఇక, ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ నెల 13న నామినేషన్ వేయనున్నారు. ఆయన వారణాసిలో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే ప్రధాని వారణాసి నుంచి రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. ఇక, ఈసారి కూడా గెలిస్తే ఆయన హ్యాట్రిక్ సాధించినట్లే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉండగా, వారణాసి నుంచి బిజెపికి పోటీగా కాంగ్రెస్ తరఫున అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు. మోదీపై అజయ్ రాయ్ పోటీ చేయడం వరుసగా ఇది మూడోసారి.
వారణాసి నియోజకవర్గంలో వచ్చే నెల 1 వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక, దేశంలోని ఏడోదశకు ఈ నెల 7 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మే 13వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. మే 14వ తేదీ నామినేషన్లకు చివరి రోజు. ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో భాగంగా వారణాసిలో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక, ఈ ర్యాలీకి ముందే ప్రధాని మోదీ వారణాసిలోని కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని దర్శించుకోనున్నట్లు సమాచారం.

గత ఎన్నికల్లో..
ఇక మోదీ నామినేషన్ కోసం ఇప్పటికే యూపీ బిజెపి యూనిట్ అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలో లోక్‌సభ ఎన్నికల చివరి దశలో ఎన్నికలు జరగనున్నాయి. 2014వ సంవత్సరంలో మోదీ మొదటిసారి వారణాసిలో పోటీ చేసి 56శాతం ఓట్లతో విజయం సాధించడమే కాకుండా దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇక గత (2019) ఎన్నికల్లో కూడా ప్రధాని మోదీకి 63 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ తరపున 2019 ఎన్నికల్లో బరిలోకి దిగిన అజయ్‌రాయ్‌కి 14శాతం ఓట్లు దక్కాయి. 2014 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తరపున అజయ్ రాయ్ పోటీ చేయగా, ఆయనకి అప్పడు కేవలం 75 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేసి, 3.5 లక్షల ఓట్లతో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications