తమిళనాడు కిరికిరి: 18వ తేది కర్ణాటక బంద్
బెంగళూరు: మేకేదాటు తాగునీటి రిజర్వాయర్ నిర్మించడానికి తమిళనాడు ప్రభుత్వం అడ్డుపడుతున్నదని ఆరోపిస్తూ ఈనెల 18వ తేది కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చారు. వివిధ కన్నడ సంఘాలు కర్ణాటక బంద్ కు మద్దతు ఇస్తున్నాయి.
కన్నడ వాటల్ పార్టీ అధ్యక్షుడు, మాజీ శాసన సభ్యుడు వాటల్ నాగరాజ్ మాట్లాడుతూ ఈ నెల 18వ తేది ఉదయం 6 గంల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కర్ణాటక బంద్ జరుగుతుందని అన్నారు. ఆరోజు కేఎస్ఆర్ టీసీ, బీఎంటీసీ, ఆటోలు, ట్యాక్సీలు, గూడ్స్ వాహనాల సంచారాన్ని సంపూర్ణంగా నిలిపివేస్తామని చెప్పారు.
పాలు, పండ్లు, పూలు, ఔషధాల షాప్ లు తీయ్యడానికి అనుమతి ఇస్తామని, ఆంబులెన్స్ లు సంచరించడానికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. కర్ణాటక బంద్ కు వివిద కన్నడ సంఘాలు, సంస్థలు పూర్తి మద్దతు ఇస్తున్నాయని స్పష్టం చేశాయి.
కన్నడ సాహిత్య పరిషత్ రాష్ర్ట అధ్యక్షుడు పుండలిక హాలంబి మాట్లాడుతూ కర్ణాటక బంద్ కు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్పారు. ప్రముఖ సాహితీవేత్త ప్రోఫసర్ చంద్రశేఖర్ పాటిల్, డాక్టర్ రాజ్ కుమార్ అభిమానుల సంఘం, కర్ణాటక రక్షణా వేదిక తదితర సంఘాలు బంద్ కు మద్దతు ఇస్తున్నాయి.

మేకేదాటు రిజర్వాయర్.............!
కర్ణాటక ప్రభుత్వం 2013 సెప్టెంబర్ లో మేకేదాటు ప్రాంతంలో తాగు నీటి రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయం తీసుకునింది. వర్షాకాలంలో మేకేదాటు ప్రాంతం నుండి ఎక్కువ నీరు తమిళనాడుకు తరలి వెలుతున్నదని, అక్కడ రిజర్వాయర్ నిర్మించి నీరు నిల్వ చేయాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకునింది.
మేకేదాటు రిజర్వాయర్ నుండి బెంగళూరు, మైసూరు నగరాలకు తాగు నీరు సరఫరా చెయ్యాలని కర్ణాటక ప్రభుత్వం బావిస్తున్నది. అయితే మేకేదాటులో రిజర్వాయర్ నిర్మించడానికి తమిళనాడు ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. గత నెల తమిళనాడులో వివిద సంఘాలు బంద్ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. మేకేదాటు తాగు నీటి రిజర్వాయర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు.












Click it and Unblock the Notifications