ఉమ్మడి ఆస్తి వివాదం: అన్నంలో విషం కలిపి సొంత అన్నావదినను చంపిన యువకుడు!
బెంగళూరు: ఉమ్మడి ఆస్తికోసం సొంత తమ్ముడు అన్నావదినలను విషం పెట్టి హత్య చేసిన ఘటన కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో జరిగింది. అన్నావదినలకు అన్నంలో విషం కలిపి హత్య చేసిన దినేష్ అనే యువకుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని మంగళవారం పోలీసులు చెప్పారు.

అన్న పేరు మీద ఆస్తి
చిక్కమగళూరు జిల్లాలోని మూడగెరె తాలుకా కణచూరు గ్రామంలో వెంకటేష్, రుక్మిణి దంపతులు నివాసం ఉంటున్నారు. వెంకటేష్ తమ్ముడు దినేష్. తల్లిదండ్రులు తమ అనంతరం ఆస్తిని వెంకటేష్ పేరు మీద రాసిపెట్టారు.

ఆస్తిలో భాగం
తల్లిదండ్రులు మరణించిన తరువాత ఆస్తిలో భాగం కావాలని దినేష్ అతని అన్న వెంకటేష్ ను అడిగాడు. ఇప్పుడు ఆస్తి భాగం పెట్టవలసిని అవసరం ఏమి ఉందని, వ్యవసాయం చేసుకుందామని, ఆస్తి విక్రయించడానికి వీలు లేదని వెంకటేష్ చెప్పాడు.

అన్నంలో విషం
తన అన్నావదిన ప్రాణాలతో ఉన్నంత వరకూ తనకు ఆస్తిరాదని దినేష్ అనుమానం పెంచుకున్నాడు. ఎలాగైనా ఇద్దరినీ అంతం చెయ్యాలని ప్లాన్ వేశాడు. వారం రోజుల క్రితం రాత్రి ఇంటిలో ఉన్న బోజనంలో విషం కలిపిన దినేష్ తరువాత బయటకు వెళ్లిపోయాడు.

వారం రోజులు మృత్యువుతో !
ఎప్పటిలాగే రాత్రి బోజనం తిన్న వెంకటేష్, రుక్మిణి దంపతుల శరీరంలోకి విషయం చేరడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. బంధువులు, స్థానికులు విషయం గుర్తించి వెంకటేష్, రుక్మిణి దంపతులను మణిపాల్ ఆసుపత్రికి తరలించారు.

అనుమానం రాకుండా !
చికిత్స విఫలమై మంగళవారం వెంకటేష్, రుక్మిణి దంపతులు మరణించారని పోలీసులు తెలిపారు. అనుమానం రాకుండా ఆసుపత్రిలో అన్నావదిన దగ్గర దినేష్ ఉన్నాడని, దంపతులు విషాహారం తిని మరణించారని వైద్యులు కచ్చితంగా చెప్పడంతో దినేష్ ను అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా అసలు విషయం బయటపడిందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications