పుదుచ్చేరిలో డీఎంకే-కాంగ్రెస్ కు షాక్..! బీజేపీ-ఎన్నార్సీకి ఎడ్జ్..!
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో (Puducherry Assembly Elections)కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార బీజేపీ-ఎన్నార్ కాంగ్రెస్ కూటమిని ఎలాగైనా గద్దెదింపాలని ప్రయత్నిస్తున్న డీఎంకే-కాంగ్రెస్ కూటమి ఓవైపు, విజయ్ నేతృత్వంలోని కొత్త పార్టీ టీవీకే మరోవైపు విజయం కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీఎంకే-కాంగ్రెస్ కూటమిలో సీట్ల పంపకాలు చిచ్చుపెట్టాయి. దీంతో కూటమికి ఓ పార్టీ గుడ్ బై చెప్పేసింది.
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల వేళ డీఎంకే-కాంగ్రెస్ కూటమిలో సీట్ల పంపిణీ విషయంలో వివాదం తీవ్రమైన నేపథ్యంలో విడుదల చిరుతైగల్ కచ్చి (VCK) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమావళవన్ నేతృత్వంలోని వీసీకే పార్టీ డీఎంకే కూటమిలో భాగంగా ఉండాల్సిన సీట్లు కేటాయింపు ఒప్పందంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించింది. దీంతో కూటమికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వీటిలో తలో 14 సీట్లు తీసుకోవాలని కాంగ్రెస్-డీఎంకే నిర్ణయించాయి. మిగిలిన రెండు సీట్లను సీపీఐకి 1, వీసీకేకు ఒకటి చొప్పున ఇవ్వాలని నిర్ణయించాయి. ఈ నిర్ణయం వీసీకేకు మంటపుట్టించింది. దళిత పార్టీగా పేరున్న వీసీకే అంతకంటే ఎక్కువ సీట్లు కావాలని పట్టుబట్టినా ఫలితం లేకపోవడంతో సొంతంగా పోటీకే మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో తమకు బలమున్న అన్ని సీట్లలోనూ పోటీ చేస్తామని ప్రకటించింది. మరోవైపు ఇప్పటికే విజయ్ పార్టీ టీవీకే 30 సీట్లలోనూ పోటీ చేస్తోంది. దీంతో అధికార బీజేపీ-ఎన్నార్ కాంగ్రెస్ వ్యతిరేక ఓటు విపక్షాల మధ్య భారీగా చీలిపోయే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications