కాంగ్రెస్ సర్కార్ పతనం వెనుక మల్లాడి కృష్ణారావు హస్తం?: సీఎం పక్కలోనే ఉంటూ
పుదుచ్చేరి: ఊహించినట్టే- మరో చోట కాంగ్రెస్ ప్రభుత్వం అర్ధాంతరంగా కుప్పకూలింది. అయిదేళ్లపాటు పదవీ కాలాన్ని కాపాడుకోలేకపోయింది. ప్రతిపక్షాల దాడిని నిలువరించలేకపోయింది. ఎదురుదాడి చేయలేకపోయింది. కర్ణాటక, మధ్యప్రదేశ్ తరహాలో కాంగ్రెస్ పార్టీ.. అధికారాన్ని కోల్పోయింది. తాజాగా- కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని ప్రతిపక్షాలకు ధారదాత్తం చేసుకుంది. అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోలేకపోయింది. వరుస రాజీనామాలతో మైనారిటీలో పడిన ప్రభుత్వం.. చివరికి పతనమైంది.
పతనం అంచుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం: ముఖ్యమంత్రి రాజీనామా?: బీజేపీ మార్క్

నారాయణస్వామి రాజీనామా..
ముఖ్యమంత్రి వీ నారాయణస్వామి తన పదవికి రాజీనామా చేశారు. లెప్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. మిత్రపక్షం డీఎంకే సహా సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామాల బాట పట్టడంతో ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఫలితంగా- బలపరీక్షను ఎదుర్కొంది. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి వీ నారాయణ స్వామి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. బలపరీక్ష నిర్వహించడానికి ఒక్కరోజు ముందు మరో ఇద్దరు వైదొలగడంతో.. ఇక 12 స్థానాలకే పరిమితమైంది. అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది.

మల్లాడి కృష్ణారావు సహా
యానాం కాంగ్రెస్ ఎమ్మెల్యే, పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు సహా మొత్తం ఆరుమంది రాజీనామా చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏ జాన్ కుమార్, ఆర్ముగం నమశ్శివాయ, మల్లాడి కృష్ణారావు, థెప్పయ్యంథన్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. వారిలో నమశ్శివాయ, మల్లాడి కృష్ణారావు మంత్రులు కూడా. ఆదివారం సాయంత్రం మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కే లక్ష్మీనారాయణన్, మిత్రపక్షం డీఎంకేకు చెందిన కే వెంకటేశన్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఇదివరకే కాంగ్రెస్ పార్టీకే చెందిన మరో ఎమ్మెల్యే ఎన్ ధనవేలుపై అనర్హత వేటు పడింది. దీనితో అధికార కాంగ్రెస్-డీఎంకే సంకీర్ణ కూటమి ప్రభుత్వం మైనారిటీలో పడింది. 12 స్థానాలకే పరిమితమైంది.

ప్రతిపక్షం చేతుల్లో 14 మంది ఎమ్మెల్యేలు..
ప్రతిపక్ష అఖిల భారత ఎన్ఆర్ కాంగ్రెస్-ఏఐఏడీఎంకే కూటమికి 11 మంది సభ్యుల బలం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నామినేట్ చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రతిపక్షానికే మద్దతు ప్రకటించారు. దీనితో ప్రతిపక్ష కూటమి సంఖ్యాబలం 14కు చేరింది. రాజీనామాలు పోగా మిగిలిన 26 మంది శాసనసభ్యుల బలం ఉన్న పుదుచ్చేరి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 13 మంది సభ్యుల బలం అవసరం అవుతుంది. ఆ మేజిక్ ఫిగర్‌ను ప్రతిపక్షాలు అందుకున్నాయి. ఫలితంగా- ఎన్ఆర్ కాంగ్రెస్ సారథ్యంలో పుదుచ్చేరిలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటయ్యే అవకాశం ఉంది.

గవర్నర్ ముందు ప్రత్యామ్నాయాలేంటీ?
పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముందు ఉన్న ప్రత్యామ్నాయాలేమిటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆమె ముందు మూడు ప్రత్యామ్నాయాలు కనిపిస్తోన్నాయి. ఒకటి- ప్రతిపక్షానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని కల్పించడం.. రెండు- రాష్ట్రపతి పాలన విధించడానికి సిఫారసు చేయడం.. మూడు- అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచడం. ఈ మూడింట్లో తొలి ఆప్షన్‌కే అవకాశం ఇస్తారనే ప్రచారం ఉంది. మరో ఒకట్రెండు నెలల్లో పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించనున్నందున.. చివరి రెండు ఆప్సన్లను కూడా పరిశీలనలోకి తీసుకుంటారని చెబుతున్నారు.