ఆర్టీసీ బస్సుల్లో అశ్లీల, రెచ్చగొట్టే పాటలపై నిషేధం
ఛండీగఢ్: ప్రభుత్వ రవాణా సంస్థ బస్సుల్లో అసభ్యకర, అశ్లీల పాటలను పెట్టడంపై పంజాబ్ ప్రభుత్వం నిషేధం విధించింది. అశ్లీల, రెచ్చగొట్టే పాటలను బస్సుల్లో పెట్టకుండా నిషేధం విధిస్తున్నట్లు సోమవారం ఆ రాష్ట్ర రవాణా మంత్రి అజిత్ సింగ్ కోహార్ తెలిపారు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పారు.

ఒకవేళ ప్రభుత్వ ఆదేశాలను డ్రైవర్లు ధిక్కరించినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రయాణికులకు మేలైన సేవలను అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అసభ్యకర పాటలతో ప్రజలు ఇబ్బంది పడటమే గాక.. డ్రైవర్ దృష్టి మళ్లి ప్రమాదాలు జరిగే అవకాశాలు అన్నారు.
రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను దెబ్బతీసేలా ఈ పాటలు ఉంటాయని అన్నారు. ఓ ప్రత్యేక కమిటీ బస్సుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి, నిబంధనల అమలును పర్యవేక్షిస్తుందని మంత్రి తెలిపారు. ఏ డ్రైవరైనా ఆదేశాలను ఉల్లంఘించినట్లు కన్పిస్తే.. సామాన్య ప్రజలు వ్యక్తిగతంగా తనను కలిసి ఫిర్యాదు చేయవచ్చని అజిత్‌సింగ్ చెప్పారు.