సస్పెన్స్‌కు తెర: ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు రేపు వెల్లడి: రేసులో ఎంపీ
న్యూఢిల్లీ: దేశంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. నాలుగు చోట్ల భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటంతో.. ఈ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. అందులోనూ దేశ రాజకీయ స్థితిగతులను ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ కూడా ఉండటం అందరి దృష్టీ దీనిపై పడింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇదివరకే వెలువడింది. ఉత్తర ప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌లల్లో ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది ఈసీ.

ఏడు దశల్లో..
తొలిదశ ఫిబ్రవరి 10వ తేదీన ఆరంభమౌతుంది. చివరి దశ పోలింగ్ మార్చి 7న ఉంటుంది. అదే నెల 10వ తేదీన ఓట్ల లెక్కింపును నిర్వహించేలా షెడ్యూల్‌ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమలు చేస్తోన్న ఆంక్షలు కొంత అడ్డంకిగా మారినప్పటికీ- నియోజకవర్గ స్థాయిలో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు జోరుగా తమ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, ప్రదర్శనలను నిర్వహిస్తోన్నాయి.

పంజాబ్‌లో పాగా కోసం..
పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఎన్నికల బరిలో దిగింది. బీజేపీ పరిస్థితి చెప్పుకోదగ్గ స్థితిలో ఉండట్లేదంటూ ఇదివరకు వెలువడిన ఎన్నికల సర్వేలు స్పష్టం చేశాయి. అధికారంలో రావడానికి బీజేపీ తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ కూడా కొంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందంటూ సర్వేలు తేల్చి చెప్పాయి. కాంగ్రెస్ రెండోస్థానంలో ఉంటుందని పేర్కొన్నాయి.

అతిపెద్ద పార్టీగా ఆప్..
ఈ పరిణామాల మధ్య ఓటర్లు- ఆమ్ఆద్మీ పార్టీ వైపు మొగ్గు చూపారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ఆద్మీ పార్టీ.. పంజాబ్‌లోనూ పాగా వేస అవకాశాలు లేకపోలేదని అంచనా వేస్తోన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్.. పంజాబ్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తుందని జోస్యం చెబుతున్నారు. అవి ఎంత వరకు ఫలించాయనేది మార్చి 10వ తేదీన తేలుతుంది.

రేపు ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు
పంజాబ్ ఓటర్ల నాడి తమకు అనుకులంగా ఉందంటూ వార్తలు, సర్వేలు స్పష్టం చేస్తోన్న నేపథ్యంలో- ఆమ్ ఆద్మీ పార్టీ.. ముఖ్యమంత్రి అభ్యర్థిపై కసరత్తు చేస్తోంది. పోలింగ్‌కు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటించడానికి సమాయాత్తమౌతోంది. పంజాబ్‌లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును మంగళవారం ప్రకటిస్తానని కేజ్రీవాల్ వెల్లడించారు. మధ్యాహ్నం 12 గంటలకు మొహాలీలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని, ముఖ్యమంత్రి పేరును అధికారికంగా ప్రకటిస్తానని స్పష్టం చేశారు.

భగవంత్ మాన్..
ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు భగవంత్ మాన్.. ముఖ్యమంత్రి రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌లోని సంగ్రూర్ లోక్‌సభ స్థానానికి ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. 2019 నాటి ఎన్నికల్లో ఆయన లక్ష ఓట్లకు పైగా తేడాతో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించారు. ఈ స్థానం నుంచి వరుసగా రెండు సార్లు ఘన విజయాన్ని సాధించారు. 2014లోనూ లక్షన్నర ఓట్లకు పైగా తేడాతో శిరోమణి అకాలీదళ్ అభ్యర్థిని మట్టి కరిపించారు. పంజాబ్‌లో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఆయన పేరును దాదాపు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించవచ్చని తెలుస్తోంది.