
Viral Video: వృద్ధులతో పేకాట.. యువకులతో క్రికెట్ : పంజాబ్‌లో సీఎం చన్నీ సరదాలు
పంజాబ్ అసెంబ్లీ పోలింగ్ తేది దగ్గరపడుతున్న కొద్ది ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఇంటింటికి ప్రచారాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉచిత హామీలు గుప్పిస్తూ ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల పీట్లు చేస్తున్నారు .
వృద్ధులతో సీఎం చన్నీ పేకాట
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను ఆకట్టుకునేందుకు పంజాబ్ ముఖ్మమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ తనదైన స్టైల్లో ప్రయత్నిస్తున్నారు. బర్నాలాలోని అస్పాల్ ఖుర్ద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానికలతో మమేకమై కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. యువకులతో కలసి సీఎం చన్నీ సరదా కాసేపు క్రికెట్ ఆడారు. అనంతరం వృద్ధులతో కలిసి పేకాట ఆడారు. సరదా సరదా సాగిన ఈ ఎన్నికల ప్రచార వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

ఈనెల 20న పోలింగ్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈనెల 20న పోలింగ్ జరగనుంది. మొత్తం 117 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. గత ఎన్నికల్లో 77 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి.. పదేళ్ల తర్వాత అధికారం చేపట్టింది . మరో సారి పంజాబ్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు హస్తం నేతలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. అటు ఆమ్ ఆద్మీ, బీజేపీ కూటమి కూడా గెలుపుకోసం వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి.

కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా చన్నీనే ..
ఎన్నికల ముందు ఎంతో తర్జనభర్జన తర్వాత అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా చరణ్ జిత్ సింగ్ చన్నీనే ఆపార్టీ అధిష్టానం ప్రకటించింది. పార్టీ ఎలక్షన్ కమిటీ చైర్మన్‌గా రవ్‌నీత్ సింగ్ బిట్టూను నియమించింది. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగాలని ఆశించిన పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధూకు నిరాశ ఎదురైంది. సిద్ధూలో ఉన్న అసంతృప్తిని చల్లార్చింది.